Krishnam Raju: తెరపై ‘రెబల్‌’స్టార్‌.. తెర వెనక ‘మర్యాద రామన్న’

వెండితెర ‘భక్త కన్నప్ప’ ఇకలేరు. ‘బొబ్బిలి బ్రహ్మన్న’లాంటి వారు మరొకరు రారు. ‘తాండ్ర పాపారాయుడు’లా గర్జించే గొంతుక ఇకపై వినిపించదు. ‘ఉగ్ర నరసింహం’లాంటి రూపం కనిపించదు. ఇవన్నీ కృష్ణంరాజు (Krishnam Raju)కే సాధ్యం. వెండి తెరపై ‘రెబల్‌’స్టార్‌గా ఎదిగిన ప్రస్థానం ఎందరికో స్ఫూరిదాయకం.

Updated : 11 Sep 2022 10:30 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వెండితెర ‘భక్త కన్నప్ప’ ఇకలేరు. ‘బొబ్బిలి బ్రహ్మన్న’లాంటి వారు మరొకరు రారు. ‘తాండ్ర పాపారాయుడు’లా గర్జించే గొంతుక ఇకపై వినిపించదు. ‘ఉగ్ర నరసింహం’లాంటి రూపం కనిపించదు. ఇవన్నీ కృష్ణంరాజు (Krishnam Raju)కే సాధ్యం. వెండి తెరపై ‘రెబల్‌’స్టార్‌గా ఎదిగిన ఆయన ప్రస్థానం ఎందరికో స్ఫూరిదాయకం. ఆయన మరణంతో చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ఆయన నటించిన సినిమాలు, పాత్రలను అభిమానులు గుర్తు చేసుకుంటూ కృష్ణంరాజుకు నివాళి అర్పిస్తున్నారు.

అప్పటి నుంచే రెబల్‌స్టార్‌గా..

పౌరాణికాలు మొదలుకొని అన్ని రకాల నేపథ్య చిత్రాల్లోనూ కృష్ణంరాజు నటించారు. ఎప్పుడూ కొత్తదనాన్ని కోరుకునే ఆయన 180కి పైగా సినిమాల్లో విభిన్న పాత్రలు పోషించారు. ‘చిలకా గోరింక’తో 1966లో తెరంగేట్రం చేసిన కృష్ణంరాజు.. 1978లో వచ్చిన ‘కటకటాల రుద్రయ్య’ సినిమాతో రెబల్‌ స్టార్‌గా మారారు. ఈ ఒక్క పాత్రే కాకుండా ఇలాంటి పవర్‌ఫుల్‌ క్యారెక్టర్లు ఎన్నో ఆయన్ను సాహసిగా నిలిపాయి. తనకెంతో పేరు తీసుకొచ్చిన ‘కటకటాల రుద్రయ్య’ (Katakatala Rudrayya) చిత్రీకరణలో చోటు చేసుకున్న ఓ ఆసక్తికర విషయాన్ని కృష్ణంరాజు ఓసారి బయటపెట్టారు. ఈ సినిమాలో కృష్ణంరాజు పులితో ఫైట్‌ చేసే సన్నివేశం ఒకటుంది. దాని కోసం చిత్ర బృందం ఓ పులిని తీసుకొచ్చింది. ఎంతటి శిక్షణ తీసుకున్నదైనా పులి.. పులే కాబట్టి సెట్స్‌లోకి రాగానే గాండ్రించిందట.

‘ఇలా అయితే కష్టం’ అని అనుకుని దాన్ని మచ్చిక చేసుకునే ప్రయత్నం చేశారట కృష్ణంరాజు. చివరకు ఆ పోరాట దృశ్యాల్ని అనుకున్నట్టుగా తెరకెక్కించారు. సినిమా విడుదలై, ఘన విజయం అందుకోవడంతోపాటు ఆ ప్రత్యేక సీన్లకు మంచి ఆదరణ దక్కింది. అదే సంవత్సరం మరో సినిమా కోసం ఆ పులిని తీసుకురాగా, అది కృష్ణంరాజుతో ఫైట్‌ చేసేందుకు సహకరించలేదట. ‘ఆ పులి నన్ను గుర్తుపట్టి, ఎంతో చనువుగా ఉండేది. దాంతో ఫైట్‌ సీన్‌ అంటే కష్టమనుకుని మరొక పులిని తీసుకొచ్చాం’ అని కృష్ణంరాజు అప్పట్లో పేర్కొన్నారు. కృష్ణంరాజు స్నేహానికి మనుషులే కాదు.. పులి కూడా ఫిదా అవుతుందనటానికి ఇదొక నిదర్శనం.

వద్దన్నా వదిలేవారు కాదు!

సినిమాల్లోని పాత్రల్లో గంభీరంగా కనిపిస్తూ తెరపై ‘రెబల్‌’ స్టార్‌గా వెలుగొందిన కృష్ణంరాజు మనసు వెన్న. అతిథి మర్యాదలో ఆయనకు ఆయనే సాటి. తాను షూటింగ్‌లో పాల్గొన్నారంటే ఆ సెట్‌లో ఉన్నవారందరికీ కృష్ణంరాజు ఇంటి నుంచే భోజనం వెళ్తుంది. తన టీమ్‌ని అంత బాగా చూసుకునేవారాయన. తీసుకెళ్లడమే కాదు ‘ఇక వద్దు సర్‌.. చాలు’ అని అన్నా వినేవారు కాదట. ప్రతి ఒక్కరూ కడుపునిండా తినేంత వరకూ ఊరుకునే వారు కాదు. అందుకే ఆయన్ను కొందరు ‘మర్యాద రామన్న’ అని పిలుస్తుంటారు. కృష్ణంరాజు వారసుడు ప్రభాస్‌ (Prabhas) సైతం ఇదే పద్ధతిని కొనసాగిస్తున్నారు.

చేతులు కాల్చుకున్నారు..

కృష్ణంరాజు అప్పట్లో వేటకు వెళ్లేవారు. అడవిలోనే వండుకుని తినేవారట. తనకు అన్నం వార్చడం రాదని, పలుమూర్ల చేతులు కాల్చుకున్నానని కృష్ణంరాజు ఓ ఇంటర్వ్యూలో నవ్వుతూ చెప్పుకొచ్చారు. ఏదో సరదాగా చేసిన ఆ పనిని కొంతకాలం తర్వాత మానేసినట్టు తెలిపారు. కృష్ణంరాజుకు పెసరట్టు, నాన్‌వెజ్‌ అంటే బాగా ఇష్టం.

దాంప్యతం ఇలా ఉండాలి..

కృష్ణంరాజు తన జీవితంలోని ప్రత్యేకమైన రోజులను వేడుకగా జరుపుకొంటారు. కానీ, గిఫ్ట్‌లు ఇచ్చిపుచ్చికోవడం అంటే ఆసక్తి ఉండేది కాదు. ‘‘నా భార్యే నాకు అతి పెద్ద బహుమతి’ అని చెప్పిన కృష్ణంరాజు దాంపత్య జీవితం గురించి ఓ సందర్భంలో ఇలా వివరించారు. ‘‘భార్యాభర్తలెవరి మధ్య అయినా చిన్న చిన్న గొడవలు వస్తుంటాయి. కాసేపు మౌనంగా ఉంటే తర్వాత అన్నీ సర్దుకుంటాయి. ఇద్దరూ సంపాదించే వారైతే ‘ఇగో’ సమస్యలు తలెత్తుతున్నాయి. ‘నేనే గొప్ప అంటే నేనే గొప్ప’ అని అనుకుంటున్నారు. దంపతుల మధ్య అది ఉండకూడదు. చిన్న సమస్యను పెద్దగా చేసి చూడకుండా ప్రశాంతంగా ఆలోచిస్తే కాపురం బాగుంటుంది’’ అని వివరించారు.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts