Krishnam Raju: కొరడా దెబ్బ తిన్నాకే ఆ విషయం అర్థమైంది.. కృష్ణంరాజు జ్ఞాపకాలివీ!

ఎదుటివారికి గౌరవం ఇవ్వడంలో, అతిథులకు మర్యాద చేయడంలో నటుడు కృష్ణంరాజు ముందుండేవారు. క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచారు. అదంతా తాను చేసిన ఓ తప్పు వల్లే అని కృష్ణంరాజు గతంలో తెలిపారు. ఆ సంఘటనతోపాటు ఆయన ఇష్టాలు.. బిరుదు, నిర్మాతగా ఎందుకు మారాల్సి వచ్చింది? ఓసారి గుర్తు చేసుకుందాం..

Published : 12 Sep 2022 02:07 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎదుటివారిని గౌరవించడంలో, అతిథులకు మర్యాద చేయడంలో నటుడు కృష్ణంరాజు (Krishnam Raju) ఎప్పుడూ ముందుండేవారు. క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచారు. అదంతా తాను చేసిన ఓ తప్పు వల్లే అని కృష్ణంరాజు గతంలో తెలిపారు. ఆ సంఘటనతోపాటు ఆయన ఇష్టాలు, బిరుదు, నిర్మాతగా ఎందుకు మారాల్సి వచ్చింది? ఆయన ప్రయాణాన్ని ఓసారి గుర్తు చేసుకుందాం..

ఫొటోగ్రఫీ అంటే ఇష్టం

కృష్ణంరాజు చదువులో ఎంత చురుకుగా ఉండేవారో స్టిల్‌ ఫొటోగ్రఫీలోనూ అంతే. తన స్వగ్రామైన మొగల్తూరు వాసులు, ప్రకృతిని తన కెమెరాలో బంధించేవారు. ఆ నెగెటివ్‌లను ఇంట్లోనే హైపోతో కడిగి, టార్చిలైట్‌ వెలుగులో ఎక్స్‌పోజ్‌ చేసేవారు. రెండు ఫొటోలు విడివిడిగా తీసి, వాటి నెగెటివ్‌లను కలుపుతూ మరో కొత్త ఫొటో సృష్టించడంలాంటి ప్రయోగాలు ఆయనకు మహా సరదా. అలా ఆయన తీసిన ఫొటోలకు ‘అండర్‌ 16 రాష్ట్రస్థాయి’ పోటీల్లో బహుమతి వచ్చింది.

కొరడాతో కొట్టారు!

‘‘నా వ్యక్తిత్వం మీద మా నాన్న ప్రభావం చాలా ఉంది. కొడుకును ఐదేళ్ల వయసు వరకు రాజులా, పద్దెనిమిదేళ్ల వరకు సేవకుడిలా, ఆ తర్వాత స్నేహితుడిలా చూడాలని చెప్పేవారు, ఆచరించి చూపారు. తప్పు జరిగితే మాత్రం సహించేవారు కాదు. అప్పుడు నాకు పదహారేళ్లు.. ఓ వ్యక్తి నాన్న కోసం వచ్చాడు. బల్లమీద కాళ్లు పెట్టి, ఊపుతూ కూర్చొన్న నేను ఆ అతిథిని చూసి కూడా లేవలేదు. కూర్చొనే ఆయన అడిగిన దానికి సమాధానం ఇచ్చా. ఇంతలో బయట నుంచి వచ్చిన నాన్న అది చూశారు. అంతే.. గోడకు తగిలించి ఉన్న కొరడా తీసి నన్ను బాదేశారు. ఆ దెబ్బలకు ఐదు రోజుల వరకు నేను మంచం దిగలేదు. ఎదుటివారిని గౌరవించాలనే సూత్రం అప్పుడే నాకు ఒంటబట్టింది’’ అని కృష్ణంరాజు ఓ సందర్భంలో తన బాల్యాన్ని గుర్తు చేసుకున్నారు.

ముక్కురాజుగా..

కృష్ణంరాజుకు కబడ్డీ, యోగా అంటే ప్రాణం. కోర్టు, ప్రత్యర్థులెవరు.. ఇలా మైదానంలో జరగబోయే దాన్ని ముందుగానే ఊహించుకుని, పక్కా ప్లాన్‌తో బరిలోకి దిగేవారట. ‘‘ఆటల్లో నేనెప్పుడూ దురుసుగా ప్రవర్తించేవాడిని కాదు. రైడింగ్‌కు వెళ్లినప్పుడు ప్రత్యర్థిని ఓడించాల్సి వస్తే చాలామంది గట్టిగా కొడతారు. నేను మాత్రం ముక్కుమీద వేలుతో తాకి వచ్చేవాడిని. అది ఒక్కోసారి అంపైర్‌కు కూడా కనిపించేది కాదు. అలాగే ఆటను కొనసాగిస్తుండటంతో స్నేహితులు నాకు ‘ముక్కురాజు’ అనే బిరుదు ఇచ్చారు’’ అని కృష్ణంరాజు తన కాలేజీ రోజులను (1963) ఓ ఇంటర్వ్యూలో నెమరువేసుకున్నారు.

జీవితం మలుపు తిరిగింది..

కృష్ణంరాజు భీమవరంలోని ప్రకృతి ఆశ్రమంలో చైతన్యానంద సరస్వతి వద్ద యోగాసనాలు నేర్చుకున్నారు. డిగ్రీలో.. యోగాకి సంబంధించి పుస్తకాలెన్నో చదివారు. పతంజలి యోగశాస్త్రాన్ని మథించి పీహెచ్‌డీ తీసుకోవాలనుకున్నారు. కానీ, ఆయన జీవితంలో కీలక మార్పు చోటుచేసుకుంది. అదే ఆయన నటుడిగా మారడం. చెన్నైలో కృష్ణంరాజుకు తెలిసిన ఓ వ్యక్తి ఉండేవారు. ఆయన ఇంటికి, అక్కడున్న ‘ఆంధ్రాక్లబ్‌’కూ కృష్ణంరాజు అప్పుడప్పుడు వెళ్తుండేవారు. ఆ సమయంలోనే దర్శకుడు ప్రత్యగాత్మ ఆయనకు పరిచయమయ్యారు. ‘సినిమాల్లో చేరాలనే ఆసక్తి ఉందా’ అని ప్రత్యగాత్మ అడగ్గా.. ‘నాకు అలాంటి ఆలోచనగానీ నటనలో ప్రవేశంగానీ లేదు’ అని కృష్ణంరాజు సమాధానమిచ్చారు. తర్వాత నటనపై ఆసక్తి పెంచుకుని, తగిన మెలకువలు తెలుసుకున్నారు. అలా ‘మేకప్‌’ వేసుకుని ప్రేక్షకులతో ‘చప్పట్లు’ కొట్టించారు.

కృష్ణంరాజును అనుకరించడం కష్టం..

‘బంగారు తల్లి’, ‘మన వూరి పాండవులు’, ‘రంగూన్‌ రౌడీ’, ‘త్రిశూలం’ (Trisulam), ‘తాండ్ర పాపారాయుడు’ (Thandra Paparayudu), ‘భక్త కన్నప్ప’ (Bhaktha Kannappa), ‘పల్నాటి పౌరుషం’, ‘అంతిమ తీర్పు’, ‘బొబ్బిలి బ్రహ్మన్న’, ‘రావణబ్రహ్మ’, ‘అమరదీపం’, ‘కటకటాల రుద్రయ్య’.. ఇలా సినిమాసినిమాకీ వైవిధ్యం చూపారు కృష్ణంరాజు. అందుకే ఆయన్ను అనుకరించడం కష్టమని ప్రఖ్యాత మిమిక్రీ విద్వాంసుడు నేరెళ్ల వేణుమాధవ్‌ అభిప్రాయపడ్డారు. 

అందుకే నిర్మాతగా..

కృష్ణంరాజుకు పుస్తక పఠనమంటే ఎంతో ఇష్టం. ఖాళీ దొరికితే చాలు ఏదో ఒక పుస్తకాన్ని చదివేవారు. వాటిల్లోని గొప్ప పాత్రలను ‘తెర’పైకి తీసుకురావాలనుకునేవారు. అయితే, అలాంటి వాటిని రూపొందించేందుకు నిర్మాత దొరకడం కష్టమని ఒకానొక సమయంలో భావించారు. అందుకే ‘గోపీకృష్ణా మూవీస్‌’ అనే సంస్థను నెలకొల్పి, నిర్మాతగా మారారు. ఆ బ్యానర్‌లో వచ్చిన తొలి చిత్రం ‘కృష్ణవేణి’. ‘పరిస్థితుల కారణంగా తప్పుచేసిన మహిళకు ఈ సమాజంలో బతకడానికి అవకాశం లేదా’ అని ప్రశ్నిస్తూ తీసిన సినిమా అది.  యాంటీ సెంటిమెంట్‌ కథ అని చాలామంది వారించినా కృష్ణంరాజు ఎవరి మాట వినకుండా తాను అనుకున్నది చేశారు. సినిమా విడుదలై, ఘన విజయం అందుకుంది. ఆ తర్వాత ఆ బ్యానర్‌పై ‘తాండ్ర పాపారాయుడు’, ‘బొబ్బిలి బ్రహ్మన్న’, ‘భక్త కన్నప్ప’, ‘బిల్లా’ తదితర ఎన్నో హిట్‌ చిత్రాలు వచ్చాయి.

వేడుక రద్దు చేసి, విరాళం అందించి..

అది 1984.. కృష్ణంరాజు హీరోగా నటించిన ‘భారతంలో శంఖారావం’ వందరోజుల వేడుకను నెల్లూరులో నిర్వహించాలనుకుంటున్న రోజులు. అదే సమయానికి తుపాను ముసురుకుంది. దాంతో, చిత్ర నిర్మాత పల్నాటి బాబుకి కృష్ణంరాజు ఫోన్‌ చేసి, ఆ ఈవెంట్‌కు ఎంత ఖర్చవుతుందో కనుక్కొన్నారు. నిర్మాత రూ. 70 వేలని చెప్పగా దానికి మరో రూ. 1,30,000 కలిపి కృష్ణంరాజు వరద బాధితుల సహాయార్థం విరాళం అందించారు.

విజయ రహస్యమిదే..

కృష్ణంరాజు తాను ఎంపిక చేసుకున్న పాత్రలకు వన్నె తెచ్చారు. వాటిని ఆయన తప్ప మరొకరు చేయలేరు అనేంతగా మెప్పించారు. యాక్షన్‌, డ్రామా.. ఇలా నేపథ్యం ఏదైనా అన్నింటా తన మార్క్‌ చూపించారు. నటుడిగా ఐదు దశాబ్దాలకుపైగా అనుభవం ఉన్న ఎన్నో హిట్‌ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నారు. తన విజయ రహస్యంపై కృష్ణంరాజు ఓ సందర్భంలో వెల్లడించారు. అనవసర విషయాల గురించి ఆలోచించకపోవడం, అవసరమైనవాటిని మనసుపెట్టి చేయటమే తన విజయ రహస్యమని తెలిపారు.Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts