krishnam raju: సినీ పరిశ్రమను విడిచి వెళ్లిపోవాలనుకున్న కృష్ణంరాజు..!

కథానాయకుడిగా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా తెలుగు చిత్ర పరిశ్రమపై చెరగని ముద్రవేశారు కృష్ణంరాజు (krishnam raju).

Updated : 11 Sep 2022 10:16 IST

హైదరాబాద్‌: కథానాయకుడిగా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా తెలుగు చిత్ర పరిశ్రమపై చెరగని ముద్రవేశారు కృష్ణంరాజు (krishnam raju). అంతేకాదు.. నిర్మాతగానూ పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. 1966లో ‘చిలకా గోరింక’తో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఆయనకు తొలి చిత్రమే నిరాశకు గురి చేసింది. దీంతో దిగులు పడిపోయిన కృష్ణంరాజు సినీ పరిశ్రమను విడిచి వెళ్లిపోవాలనుకున్నారు. కానీ, విధి ఎవరిని ఎటు వైపు తీసుకెళ్తుందో తెలియదు కదా! అదే సమయంలో ఒక రోజు అనుకోకుండా సినీ దిగ్గజం ఎల్వీ ప్రసాద్‌ను కృష్ణంరాజు కలిశారు. ఆయన చెప్పిన మాటల వల్లే సినీ పరిశ్రమను విడిచి వెళ్లిపోదామనుకున్న కృష్ణంరాజు ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. ఇదే విషయాన్ని కృష్ణంరాజు ఓ సందర్భంలో పంచుకున్నారు.

‘‘చిత్ర పరిశ్రమలో నేను నిలదొక్కుకోవడానికి కారణం ఎల్వీ ప్రసాద్‌.  ఆయనతో నాకు అనుబంధం లేకపోయుంటే సినీ పరిశ్రమని వదిలి వెళ్లిపోయేవాణ్ని. అప్పట్లో నేను నటించిన ‘చిలకా గోరింక’ సినిమా విడుదలై ఆశించిన స్థాయిలో విజయవంతం కాలేదు. ఆ తర్వాత ‘నేనంటే నేనే’లో అవకాశం వచ్చినా... వ్యతిరేక ఛాయలతో కూడుకున్న పాత్ర కదా అని వద్దనుకున్నా. అదే సమయంలోనే ఎల్వీ ప్రసాద్‌ని కలవగా... పాత్ర ఎలాంటిదైనా నువ్వు ప్రేక్షకులకు ఎంత దగ్గరయ్యావన్నదే ముఖ్యమని హిత బోధ చేశారు. ఆయన మాటలు విని ఆ సినిమా చేశా. అది విజయవంతం కావడంతో పాటు ఆ తర్వాత విభిన్నమైన పాత్రలు చేసే అవకాశం వచ్చింది’’ అని కృష్ణంరాజు చెప్పుకొచ్చారు.

వివిధ సందర్భాల్లో కృష్ణంరాజు పంచుకున్న మాటలివి

* ‘‘పుట్టినరోజు అనగానే నాకు నా అభిమానులే గుర్తుకొస్తారు. ‘అమరదీపం’ నుంచి పరిశ్రమలో నా జన్మదిన వేడుకలు జరుగుతున్నాయి. దండలు, పుష్ప గుచ్ఛాలతో వచ్చే అభిమానులను ఆ డబ్బుని సమాజ సేవకి ఉపయోగించాలని చెప్పేవాణ్ని. వాళ్లూ అదే పాటిస్తున్నారు. ఇతర కథానాయకుల అభిమానులతోనూ సఖ్యతగా మెలిగేవాళ్లు. దాంతో నాకు విలువ పెరిగింది’’

* ‘‘సుదీర్ఘమైన నా సినీ ప్రయాణంలో పరాజయాలు తక్కువే కానీ.. కెరీర్‌ పరంగా చాలా ఒడుదొడుకుల్ని చూశా. నటన పరంగా, నిర్మాణం పరంగానూ కొత్త ట్రెండ్‌కి శ్రీకారం చుడుతూ సినిమాలు చేశా. పౌరాణిక నేపథ్య కథలు పెద్దవాళ్లు, మహిళలకి మాత్రమే పరిమితం అనుకొంటున్న పరిస్థితుల్లో ‘భక్తకన్నప్ప’ చేశా. హిందీలో మాత్రమే ఇలాంటి సినిమాలు సాధ్యం అనుకొంటున్న పరిస్థితుల్లో ‘తాండ్ర పాపారాయుడు’ చేశా. రోజూ 5 వేల మందితో, ఏనుగులు, గుర్రాలతో చిత్రీకరణ చేశాం. ట్రెండ్‌ మారాలని, చిత్ర పరిశ్రమకి మన తోడ్పాటు కూడా ఉండాలనే గోపీకృష్ణ మూవీస్‌ సంస్థని ప్రారంభించాం’’

* ‘‘పౌరాణికాలు మొదలుకొని అన్ని రకాల కథల్లోనూ నటించా. కలల పాత్రలంటూ ఏమీ లేవు. కానీ కొత్తగా, ఇప్పటిదాకా ఎవ్వరూ చేయని పాత్రలేవైనా వస్తే చేయాలనే తపన ఇప్పుడూ ఉంది. ‘కటకటాల రుద్రయ్య’తో పాటు అప్పట్లో నేను చేసిన పాత్రలే నాకు రెబల్‌స్టార్‌ అనే పేరును తీసుకొచ్చాయి. నటుడిగా ప్రేక్షకుల్లో నాపై ఉన్న గౌరవాన్ని దృష్టిలో ఉంచుకొని, దీటైన పాత్రలొచ్చినప్పుడే సినిమాలు చేస్తున్నా’’

* ‘‘కేంద్రమంత్రిగా నేను బాధ్యతలు నిర్వర్తించిన ప్రతి విభాగంలోనూ కొత్తదనం తీసుకొచ్చేందుకు ప్రయత్నించా. ఎంపీగా నా నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశా. 400 ఊళ్లు ఉంటే అన్నిచోట్లా నా ముద్ర కనిపిస్తుంది. కానీ ఆ తర్వాత డబ్బు ఇస్తే కానీ ఓట్లు వేయని పరిస్థితులొచ్చాయి. ప్రభుత్వాలు కూడా ప్రజల్ని సోమరిపోతులుగా మార్చకుండా, వాళ్ల ఉపాధికి పనికొచ్చేలాగా అభివృద్ధి పనులు చేయాలి. రైతాంగానికి, అవసరమైన వాళ్లకి మాత్రమే రాయితీలు ఇవ్వాలి’’
‘‘రాజకీయాల్లోనూ అరుదైన ప్రయాణం నాది. దేశంలో కేంద్రమంత్రి అయిన తొలి కథా నాయకుణ్ని నేనే. అమితాబ్‌ బచ్చన్‌ని కలిసినప్పుడు అదే విషయాన్ని గుర్తు చేస్తూ... ‘మీరు నాకు బాగా తెలుసు, ‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’ కార్యక్రమంలో కేంద్రమంత్రి అయిన తొలి కథానాయకుడు ఎవరనే ప్రశ్న అడిగాన’ని చెప్పారు’’

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని