Krithi Shetty: ఒత్తిడి ఎదుర్కోక తప్పదు

‘‘నేనెప్పుడూ నాకు సరిపోయే కథల్నే ఎంచుకుంటాను. చేసే ప్రాజెక్ట్‌ పెద్దదా.. చిన్నదా? అని అసలు ఆలోచించను’’ అంది కృతి శెట్టి. ‘ఉప్పెన’తో తొలి అడుగులోనే సినీప్రియుల్ని మెప్పించిన ఈ అమ్మడు..

Updated : 07 Dec 2022 19:44 IST

‘‘నేనెప్పుడూ నాకు సరిపోయే కథల్నే ఎంచుకుంటాను. చేసే ప్రాజెక్ట్‌ పెద్దదా.. చిన్నదా? అని అసలు ఆలోచించను’’ అంది కృతి శెట్టి (Krithi Shetty). ‘ఉప్పెన’తో(Uppena) తొలి అడుగులోనే సినీప్రియుల్ని మెప్పించిన ఈ అమ్మడు.. ‘శ్యామ్‌ సింగరాయ్‌’, ‘బంగార్రాజు’ చిత్రాలతో కెరీర్‌ కొనసాగించింది. ఇప్పుడు ‘ది వారియర్‌’తో(The Warriorr) సందడి చేసేందుకు సిద్ధమైంది. రామ్‌ (Ram) కథానాయకుడిగా నటించిన చిత్రమిది. లింగుస్వామి (Lingusamy) తెరకెక్కించారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ఈ ద్విభాషా చిత్రం జులై 14న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ నేపథ్యంలోనే మంగళవారం హైదరాబాద్‌లో విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకుంది కృతి శెట్టి.

ఈ ఏడాది మీ నుంచి వస్తున్న రెండో చిత్రమిది. దీంతోనే తమిళంలోకీ అడుగు పెడుతున్నారు. ఎలా అనిపిస్తోంది?

‘‘చాలా సంతోషంగా ఉంది. ‘ఉప్పెన’ విడుదలయ్యాక తమిళ ప్రేక్షకులు, సినీ వర్గాల నుంచి మంచి ప్రశంసలు దక్కాయి. నాపై అంత ప్రేమ చూపిస్తారని అప్పుడు ఊహించలేదు. ఇప్పుడీ ద్విభాషా చిత్రంతో కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నందుకు ఆనందంగా ఉంది. ప్రస్తుతం తమిళం నేర్చుకునే పనిలో ఉన్నా’’.

ఈ కథ వినిపించాక మీకేమనిపించింది?

‘‘ఆయన తీసిన ‘ఆవారా’ను చాలా ఏళ్ల క్రితం తమిళంలో చూశా. లింగుస్వామి ఫోన్‌ చేశారని అమ్మ చెప్పినప్పుడు చాలా ఎగ్జైట్‌ అయ్యాను. ఆయన సినిమాల్లో కథానాయికల పాత్రలకూ ఎంతో ప్రాధాన్యముంటుంది. నటనకు ఆస్కారం దొరుకుతుంది. ఈ కథలోనూ ఇవన్నీ కుదిరాయి’’.

మీరు ఆర్జేగా చేశారు. రామ్‌ పోలీస్‌. ఇద్దరి మధ్య ప్రేమ ఎలా చిగురించింది?

‘‘పోలీస్‌ స్టేషన్‌, రేడియో స్టేషన్‌ మధ్యలో ఓ రైల్వే స్టేషన్‌ ఉంది. బహుశా.. అక్కడే ప్రేమ పుట్టి ఉండొచ్చు (నవ్వుతూ). అదెలా అన్నది మీరు తెరపై చూసి తెలుసుకోవాలి’’.

నటన, కథల ఎంపిక విషయాల్లో మీ ఆలోచనలు ఎలా ఉంటాయి?

‘‘నేనొక కథ విన్నానంటే.. అందులో నేను పోషించనున్న పాత్ర గురించి ఓ నోట్స్‌ సిద్ధం చేసి పెట్టుకుంటా. ప్రేక్షకుల్ని అలరించాల్సిన బాధ్యత నాపై ఉంది. అందుకే కథల ఎంపికలో కచ్చితంగా కాస్త ఒత్తిడి ఎదుర్కోక తప్పదు. ఓ కథ వింటున్నప్పుడు నేను ఎంజాయ్‌ చేశానంటే.. కచ్చితంగా అది ప్రేక్షకుల్ని అలరిస్తుందని నమ్ముతా. ఏ కథ విన్నా.. కచ్చితంగా మా అమ్మ అభిప్రాయాలు తీసుకుంటా. యాక్షన్‌ పాత్ర... నాకున్న డ్రీమ్‌ రోల్‌ అదే’’.

కొత్త చిత్ర విశేషాలేంటి?

‘‘బాలా దర్శకత్వంలో సూర్యతో కలిసి ఒక సినిమా చేస్తున్నా. దాదాపు 30శాతం చిత్రీకరణ పూర్తయింది. నాగచైతన్యకు జోడీగా వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నా. నితిన్‌తో చేసిన ‘మాచర్ల నియోజకవర్గం’ వచ్చే నెలలో విడుదలవుతుంది. సుధీర్‌బాబుతో చేసిన ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ విడుదలకు సిద్ధమవుతోంది. త్వరలో విడుదల తేదీ ప్రకటించనున్నారు’’.

ఇంతకీ ఈ చిత్ర కథేంటి? మీ పాత్ర ఎలా ఉంటుంది?

‘‘ఇదొక మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌. నేనిందులో ఓ పక్కింటి అమ్మాయిలా, క్యూట్‌గా కనిపిస్తా. నా పాత్ర పేరు విజిల్‌ మహాలక్ష్మి. ఓ రేడియో స్టేషన్‌లో ఆర్జేగా పనిచేస్తుంటా. కథ విన్న వెంటనే నేనీ పాత్రకు కనెక్ట్‌ అయిపోయా. ప్రేక్షకులూ అలాగే కనెక్ట్‌ అవుతారనుకుంటున్నా. ఈ పాత్ర చేయడానికి ముందు నేను చాలా హోంవర్క్‌ చేశా’’.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని