Sita Ramam: ‘సీతారామం’ సీక్వెల్‌పై ప్రశ్న.. నిర్మాత సమాధానమేంటంటే?

నిత్య మేనన్‌, నిరుపమ్‌ ప్రధాన పాత్రల్లో దర్శకుడు గోమటేశ్‌ ఉపాధ్యే రూపొందించిన వెబ్‌సిరీస్‌ ‘కుమారి శ్రీమతి’. సిరీస్‌ ఈ నెల 28న విడుదల కానున్న నేపథ్యంలో టీమ్‌ ప్రెస్‌మీట్‌లో పాల్గొంది.

Published : 26 Sep 2023 18:20 IST

హైదరాబాద్‌: ‘సీతారామం’ (Sita Ramam) సినిమా సీక్వెల్‌ గురించి ఓ విలేకరి ప్రశ్నించగా నిర్మాత స్వప్న దత్‌ (Swapna Dutt) స్పందించారు. ఆ విషయం దర్శకుడిని అడిగి తెలుసుకోవాలన్నారు. ఆమె నిర్మించిన తాజా వెబ్‌సిరీస్‌ ‘కుమారి శ్రీమతి’ (Kumari Srimathi). నిత్య మేనన్‌ (Nithya Menen), టీవీ యాక్టర్‌ నిరుపమ్‌ (Nirupam Paritala) ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ సిరీస్‌ ఓటీటీ ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో’ (Amazon Prime Video)లో ఈ నెల 28 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఈ సిరీస్‌ టీమ్‌ పాల్గొంది. డైరెక్టర్లు హను రాఘవపూడి, నందిని రెడ్డి అతిథులుగా హాజరయ్యారు. ప్రెస్‌మీట్‌కు సంబంధించిన సంగతులివీ..

* వైజయంతీ మూవీస్‌ స్ట్రాటజీ మీతో మారిపోయింది. కారణమేంటి?

స్వప్న: ఎలాంటి స్ట్రాటజీ లేకుండా పనిచేసేది మేం మాత్రమే అనుకుంటున్నా. నచ్చిన కథలను ప్రేక్షకులకు చెప్పాలనుకుంటామంతే. చిన్నా, పెద్దా అనే తేడాలు చూడం.

* ఈ సిరీస్‌ కోసం నిత్యకు ముందు మరో హీరోయిన్‌ను అనుకున్నారా?

స్వప్న: ఈ టైటిల్‌ పాత్ర పలు వేరియేషన్స్‌తో కూడుకున్నది. దాన్ని ప్లే చేయడం కొంచెం కష్టమే. నిత్య మేనన్‌ న్యాయం చేయగలదనుకుని ముందుగా ఆమెను సంప్రదించాం. ఆమెకు స్క్రిప్టు నచ్చడంతో గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు.

* ఈ కథను సినిమాగా తీయకుండా సిరీస్‌కు పరిమితం చేశారెందుకు?

స్వప్న: ఓటీటీ రావడం సినిమాలకు ఇబ్బంది అని చాలా అంటుంటారు. కానీ, ఓటీటీ రావడం మంచిదే అని నా అభిప్రాయం. ఇలాంటి కథలో ఓ సినిమా నిర్మించి, దానికి మంచి ఓపెనింగ్స్‌ వచ్చేందుకు కష్టపడి, మౌత్‌ టాక్‌ వచ్చేంత వరకు వేచి చూడడం కంటే ఓటీటీ ద్వారా చూపించడం బెటర్‌ కదా.

* సీరియల్‌ హీరో అయిన నిరుపమ్‌తో కలిసి నటించేందుకు నిత్య మేనన్‌ను ఎలా ఒప్పించారు?

స్వప్న: నిత్య మేనన్‌ గ్రేట్‌ యాక్టర్‌. వర్ధమాన నటులతోనూ కలిసి నటించానుకుంటారు. మేం ఎలాంటి సినిమాలు నిర్మిస్తున్నా మా అమ్మ పట్టించుకోదుగానీ నిరుపమ్‌ సీరియల్‌ టీవీలో వస్తుందంటే చాలు ఆసక్తిగా చూస్తుంది. ఆయన్ను ఈ సిరీస్‌లోకి తీసుకోవడమే మా అమ్మకు నేనిచ్చే బహుమతి.

* వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌లో తెరకెక్కే ప్రతి సినిమాలో మీకు ఓ పాత్ర ఉంటుంది. దాని గురించి ఏమంటారు?

రంగస్థలం మహేశ్‌: నా జీవితంలో నేను ఎక్కువగా స్వప్న అక్కకు రుణపడి ఉన్నా. ఆమె నిర్మించిన ప్రతి సినిమాలో నాకు అవకాశం కల్పించారు. కానీ, ప్రభాస్‌ ‘ప్రాజెక్ట్‌ కె’ కోసం తీసుకోలేదు. దాని గురించి మీరే ఆమెను అడగండి (నవ్వుతూ..)

* చాలాకాలం తర్వాత నటించారు. ఈ సిరీస్‌లో మిమ్మల్ని ప్రేరేపించిన అంశం ఏంటి?

రామేశ్వరి: సౌమ్య అనే అమ్మాయి నాకు ఓ రోజు ఫోన్‌ చేసి ‘మేం వెబ్‌సిరీస్‌ ఒకటి చేస్తున్నాం. అందులోని ఓ పాత్ర మీరు చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాం’ అని అన్నారు. షూటింగ్‌ ఎక్కడ చేస్తున్నారని మాత్రమే నేను అడిగా. గోదావరి ప్రాంతాల్లో అని ఆమె సమాధానమిచ్చారు. వెంటనే ఓకే చెప్పా.

* ఈ సిరీస్‌ అవకాశం ఎలా వచ్చింది?

నిరుపమ్‌: టీవీ సీరియల్స్‌ నుంచి బయటకువచ్చి సినిమానో, సిరీసో చేయాలనుకున్న సమయంలో స్వప్న ‘కుమారి శ్రీమతి’ గురించి చెప్పారు. ఇందులో హీరోయిన్‌ నిత్యమేనన్‌ నటిస్తున్నారనగానే చాలా సంతోషించా. రామేశ్వరి, గౌతమిలాంటి స్టార్‌ నటీమణలు ఈ సిరీస్‌లో నటిస్తున్నారనే సంగతి సెట్స్‌లో అడుగుపెట్టే వరకు నాకు తెలియదు.

* ‘సీతారామం’ సీక్వెల్‌ ఉంటుందనే రూమర్స్‌ వస్తున్నాయి. మీ స్పందనేంటి?

స్వప్న: కొన్ని సినిమాలు క్లాసిక్స్‌గా నిలిచిపోతాయి. అలాంటి వాటిల్లో ‘సీతారామం’ ఒకటి. సీక్వెల్‌ గురించి నా మనసులో ఏం లేదు. దర్శకుడు హను రాఘవపూడి ఏమనుకుంటున్నారో అడిగి తెలుసుకోండి.

* ‘ప్రాజెక్ట్‌ కె’ రిలీజ్‌ ఎప్పుడు?

స్వప్న: బై సర్‌ (నవ్వుతూ).

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని