Adipurush: ‘లాల్‌సింగ్‌’ కోసం ‘ఆదిపురుష్‌’ వాయిదా.. ‘జెర్సీ’ విడుదల అప్పుడే!

బాలీవుడ్‌ ప్రముఖ నటుడు ఆమిర్‌ఖాన్‌ ‘లాల్‌సింగ్‌ చద్ధా’ చిత్రం మరోసారి వాయిదా పడింది.

Published : 15 Feb 2022 20:46 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌ ప్రముఖ నటుడు ఆమిర్‌ఖాన్‌ ‘లాల్‌సింగ్‌ చద్ధా’ చిత్రం మరోసారి వాయిదా పడింది. గతేడాదే విడుదల కావాల్సిన ఈ సినిమాను 2022 ఏప్రిల్‌ 14న ప్రేక్షకుల ముందుకొస్తున్నట్టు చిత్ర బృందం ఇటీవల ప్రకటించినా సాధ్యపడలేదు. నిర్మాణానంతర కార్యక్రమాలు ఇంకా పూర్తికాకపోవటంతో మరో కొత్త విడుదల తేదీని మంగళవారం వెల్లడించింది. ‘‘అన్ని కార్యక్రమాలు పూర్తవకపోవటంతో ముందుగా అనుకున్నట్టు ‘లాల్‌సింగ్‌ చద్ధా’ ఏప్రిల్‌ 14న విడుదల కావటంలేదు. ఆగస్టు 11న మీ ముందుకొస్తుంది. అదే రోజున విడుదలకావాల్సిన ‘ఆదిపురుష్‌’ సినిమాని మా కోసం వాయిదా వేస్తున్నందుకు చిత్ర బృందానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం’’ అని ‘లాల్‌సింగ్‌ చద్ధా టీమ్‌ ఓ లేఖలో పేర్కొంది.

అద్వైత్‌ చందన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ‘లాల్‌సింగ్‌..’లో టాలీవుడ్‌ హీరో నాగచైతన్య కీలక పాత్ర పోషించారు. కరీనా కపూర్ కథానాయిక. షారుఖ్‌ ఖాన్‌, అక్షయ్‌ కుమార్‌ అతిథి పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని ఆమిర్‌ఖాన్‌ ప్రొడక్షన్స్‌, వయాకామ్ 18 స్టూడియోస్, పారామౌంట్‌ పిక్చర్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రభాస్‌ హీరోగా బాలీవుడ్‌ దర్శకుడు ఓం రౌత్‌ తెరకెక్కిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘ఆదిపురుష్‌’. కృతి సనన్‌ కథానాయిక. సైఫ్ అలీఖాన్‌ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. రామాయణ మహాకావ్యాన్ని ఆధారంగా చేసుకొని భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ను ప్రకటించే అవకాశాలున్నాయి.

జెర్సీ.. ఏప్రిల్‌లో ఫిక్స్‌

షాహిద్‌ కపూర్‌ హీరోగా తెరకెక్కిన ‘జెర్సీ’ సినిమా విడుదల తేదీ ఖరారైంది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఏప్రిల్‌ 14న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా చిత్ర బృందం ప్రకటించింది. గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మృణాళ్‌ ఠాకూర్‌ కథానాయిక. ఈ చిత్రాన్ని దిల్‌రాజు, సూర్యదేవర నాగవంశీ, అమన్‌ నిర్మించారు. నాని హీరోగా తెలుగులో ఘన విజయం అందుకున్న ‘జెర్సీ’కి ఇది రీమేక్‌ కావడం విశేషం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని