Laal Singh Chaddha: ఐదురోజులైనా.. ఆ భారీ చిత్రం ఫస్ట్‌ డే వసూళ్లనూ దాటలేదు..!

బాలీవుడ్‌ అగ్రనటుడు ఆమిర్‌ఖాన్‌ (Aamir Khan) ప్రధాన పాత్రలో నటించిన ఎమోషనల్‌ ఎంటర్‌టైనర్‌ ‘లాల్‌ సింగ్‌ చడ్డా’ (Laal Singh Chaddha). అద్వైత్‌ చందన్‌ దర్శకుడు. ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మొదటి రోజ.....

Published : 17 Aug 2022 11:54 IST

‘లాల్‌ సింగ్‌ చడ్డా’ ఐదు రోజుల వసూళ్లపై సినీ విశ్లేషకుడు ఏమన్నాడంటే..?

ముంబయి: బాలీవుడ్‌ అగ్రనటుడు ఆమిర్‌ఖాన్‌ (Aamir Khan) ప్రధాన పాత్రలో నటించిన ఎమోషనల్‌ ఎంటర్‌టైనర్‌ ‘లాల్‌ సింగ్‌ చడ్డా’ (Laal Singh Chaddha). అద్వైత్‌ చందన్‌ దర్శకుడు. ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మొదటి రోజు నుంచే మిశ్రమ స్పందనలకు పరిమితమైంది. లాంగ్‌ వీకెండ్‌ని దృష్టిలో ఉంచుకొని.. సినిమా ఫలితంలో మార్పులుంటాయని ఆశించిన చిత్రబృందానికి నిరాశే ఎదురైనట్లు కనిపిస్తోంది. సినిమా విడుదలై ఐదు రోజులైనా వసూళ్లు అంతంత మాత్రంగానే ఉన్నాయంటూ బాలీవుడ్‌ ప్రముఖ సినీ విశ్లేషకుడు ట్వీట్‌ చేశాడు. ఆమిర్‌ నటించిన గత సినిమా ఫస్ట్‌ డే కలెక్షన్స్‌ని సైతం ‘లాల్‌ సింగ్‌ చడ్డా’ ఇప్పటివరకూ దాటలేకపోయిందంటూ పేర్కొన్నాడు.

హాలీవుడ్‌లో సూపర్‌హిట్‌ అందుకొన్న ‘ఫారెస్ట్‌ గంప్‌’కు రీమేక్‌గా సిద్ధమైంది ‘లాల్‌ సింగ్‌ చడ్డా’. భారీ తారాగణం, బడ్జెట్‌తో ఎన్నో ఏళ్ల పాటు దీన్ని నిర్మించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద బోల్తా కొట్టింది. రాఖీపౌర్ణమి, రెండో శనివారం, ఆదివారం, స్వాతంత్ర్య దినోత్సవం.. ఇలా లాంగ్‌ వీకెండ్‌ని దృష్టిలో ఉంచుకుని కలెక్షన్స్‌ పరంగా ఏదైనా మార్పులు ఉంటాయని చిత్రబృందం ఆశించినప్పటికీ నిరాశే ఎదురైనట్లు సినీ విశ్లేషకుడు తరణ్‌ ఆదర్శ్‌ పేర్కొన్నాడు. ‘లాల్‌ సింగ్‌ చడ్డా’ ఐదురోజుల కలెక్షన్స్‌ను.. ఆమిర్‌ నటించిన గత సినిమా ‘థగ్స్‌ ఆఫ్‌ హిందూస్థాన్‌’ వసూళ్లతో పోలుస్తూ ట్వీట్‌ చేశాడు. ‘థగ్స్‌ ఆఫ్‌ హిందూస్థాన్‌’ మొదటి రోజు రూ.50.75 కోట్లు (హిందీ వెర్షన్‌) వసూళ్లు చేయగా.. ‘లాల్‌ సింగ్‌ చడ్డా’ ఐదు రోజుల్లో రూ. 45.38 కోట్లు మాత్రమే రాబట్టగలిగిందని అంచనా వేశాడు. ‘థగ్స్‌ ఆఫ్‌ హిందూస్థాన్‌’ మొదటి రోజు వసూళ్లను ఐదు రోజులైనప్పటికీ ‘లాల్‌ సింగ్‌ చడ్డా’ దాటలేకపోయిందని పేర్కొన్నాడు.

ఇక, ‘థగ్స్‌ ఆఫ్‌ హిందూస్థాన్‌’ విషయానికి వస్తే.. 2018లో ఈసినిమా విడుదలైంది. ఆమిర్‌ఖాన్‌, అమితాబ్‌ బచ్చన్‌, కత్రినా కైఫ్‌ వంటి అగ్రనటీనటులతో రూపుదిద్దుకుంది. సుమారు 300 కోట్ల భారీ బడ్జెట్‌తో వచ్చిన ఈ సినిమా.. టాక్‌ పరంగా మిశ్రమ స్పందనలకే పరిమితమైనప్పటికీ వసూళ్లు మాత్రం బాగానే రాబట్టింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని