College Tour: మంచు లక్ష్మి ‘స్కూల్‌, కాలేజ్‌ టూర్‌’.. విద్యాసంస్థలు తిరుపతిలోనే ఎందుకంటే?

తమ ఇంటి విశేషాలను ‘హోమ్‌ టూర్‌’ పేరిట పలువురు తారలు పంచుకుంటుంటారు. గృహ నిర్మాణం ఎలా సాగింది? ఏ వస్తువు ఎక్కడి నుంచి తెప్పించారు? తదితర సంగతులను అభిమానులకు వివరిస్తుంటారు.

Published : 23 Jun 2022 01:39 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తమ ఇంటి విశేషాలను ‘హోమ్‌ టూర్‌’ (Home Tour) పేరిట పలువురు తారలు పంచుకుంటుంటారు. గృహ నిర్మాణం ఎలా సాగింది?ఏ వస్తువు ఎక్కడి నుంచి తెప్పించారు? తదితర సంగతులను అభిమానులకు వివరిస్తుంటారు. ఇలా ప్రముఖ నటుడు మోహన్‌బాబు (Mohan Babu) తనయ, నటి, నిర్మాత మంచు లక్ష్మి (Lakshmi Manchu) తమ ఇళ్ల గురించి వీడియోలు చేయగా ఇప్పుడు ‘స్కూల్‌ టూర్‌’ (School Tour), ‘కాలేజ్‌ టూర్‌’ (College Tour)లను తీసుకొచ్చారు. శ్రీ విద్యా నికేతన్‌ సంస్థల తీరుతెన్నులు, అసలు వాటిని తిరుపతిలోనే నెలకొల్పడానికి కారణమేంటో తెలియజేశారు. ఆయా భవనాల్లోని ప్రతి విభాగం గురించి వివరించారు.

ఈ పాఠశాల ప్రాంగణంలో అడుగుపెట్టగానే ముందుగా అడ్మినిస్ట్రేటివ్‌ బ్లాక్‌, దాని ముందు.. బిడ్డపై అమ్మ ప్రేమ చాటే ఓ ప్రతిమ, విద్యార్థులు వేసిన ముగ్గులు, రుద్రాక్ష చెట్టు దర్శనమిస్తాయి. స్కూల్‌ శంఖుస్థాపన కార్యక్రమం నాటి ఫొటోలు, ప్రముఖులతో మోహన్‌బాబు దిగిన ఫొటోలు, ఆయన పద్మశ్రీ అందుకున్నటి ఫొటో, తన తండ్రి ఫొటోలను ఆ బ్లాక్‌లో చూడొచ్చు. మరో బిల్డింగ్‌లో 5- 10వ తరగతి విద్యార్థులకు సంబంధించిన ప్రయోగశాలలు, గ్రంథాలయం కనిపిస్తాయి. మరోవైపు హాస్టల్స్‌, స్విమ్మింగ్‌పూల్‌, హార్స్‌ రైడింగ్‌ ట్రాక్‌ ఉన్నాయి.

కాలేజీల (ఇంజినీరింగ్‌, బీఫార్మసీ తదితర) ఆవరణంలోకి వెళ్లగానే పచ్చదనం స్వాగతిస్తున్నట్టు ఉంటుంది. రోడ్డుకిరువైపులా ఉన్న చెట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అక్కడి కాన్ఫరెన్స్‌ హాల్‌లోనూ ఫొటోల రూపంలో మోహన్‌బాబు మధుర జ్ఞాపకాలు సాక్షాత్కరిస్తాయి. భారత ప్రధాని మోదీ, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, ఎన్టీఆర్‌, రజనీకాంత్‌ తదితరులతో వివిధ సందర్భాల్లో ఆయన దిగిన ఫొటోలవి. ఈ కాలేజీల పరిచయ వీడియోలో మోహన్‌బాబు సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. కొన్ని ఆసక్తికర విశేషాలను ఆయన పంచుకున్నారు. తన సర్టిఫికెట్లను ఎంత భద్రంగా దాచుకున్నారో చూపించారు. సువిశాలమైన లైబ్రరీ, కంప్యూటర్‌ ల్యాబ్స్‌తోపాటు అక్కడి ప్రొఫెసర్లను లక్ష్మి పరిచయం చేశారు.

‘‘నాన్న 500లకుపైగా సినిమాల్లో నటించడం ఒకెత్తు. ఈ విద్యా సంస్థలు నెలకొల్పడం ఇంకొక ఎత్తు. ఈ విద్యాసంస్థలు ప్రారంభించాలనుకున్న సమయంలో ‘ఈ మారుమాల ప్రాంతంలో ఎందుకు?’ అని చాలామంది నాన్నను అడిగారు. ‘నేను ఈ నేలపై పుట్టి, మరోచోట ఎలా కడతా’ అని నాన్న సమాధానమిచ్చేవారు. పాఠశాలకు సంబంధించి 24 బస్సులున్నాయి. వాటి మెయింట్‌నెన్స్‌పైనా ఓ వీడియో చేయొచ్చు. ఇంతటి ఓపెన్‌ స్థలంలో ఓ ప్రైవేట్‌ స్కూల్‌ను ఎక్కడా చూసుండరు. ఎలాంటి లెక్కలేసుకోకుండా విద్యార్థుల ఎదుగుదల కోసమే నాన్న ఇలా చేస్తున్నారు. ఇక్కడ బాస్కెట్‌ బాల్‌ కోర్ట్‌, క్రికెట్‌ గ్రౌండ్‌ రన్నింగ్‌ ట్రాక్‌, జిమ్‌.. ఇలా ఎన్నో ఉన్నాయి’’ అని లక్ష్మి వివరించారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని