Updated : 11 Aug 2022 15:21 IST

Lal Singh Chaddha: రివ్యూ: లాల్‌ సింగ్‌ చడ్డా

Lal Singh Chaddha Review న‌టీన‌టులు: ఆమిర్‌ ఖాన్‌, క‌రీనా క‌పూర్‌, నాగ‌చైత‌న్య‌, మాన‌వ్ విజ్, మోనాసింగ్ త‌దిత‌రులు; సాంకేతిక‌వ‌ర్గం: ఛాయాగ్ర‌హ‌ణం: సేతు, కూర్పు: హేమంతి స‌ర్కార్‌, ర‌చ‌న‌: అతుల్ కుల‌క‌ర్ణి, సంగీతం: త‌నూజ్ టీకు, ప్రీత‌మ్‌, నిర్మాతలు: ఆమిర్‌ ఖాన్‌, కిర‌ణ్ రావ్‌, స‌మ‌ర్ప‌ణ‌: చిరంజీవి, ద‌ర్శ‌క‌త్వం: అద్వైత్ చంద‌న్‌, నిర్మాణ సంస్థలు: వ‌యాకామ్ 18 స్టూడియోస్‌, ఆమిర్‌ ఖాన్ ప్రొడ‌క్ష‌న్స్‌, పంపిణీ: పారామౌంట్ పిక్చ‌ర్స్‌, విడుద‌ల‌: 11-08-2022.

కొన్నాళ్లుగా వ‌రుస ప‌రాజ‌యాల‌తో స‌త‌మ‌త‌మ‌వుతోంది హిందీ చిత్ర‌సీమ‌. అగ్ర తార‌లు న‌టించిన సినిమాలు కూడా ఏమాత్రం ప్రేక్ష‌కుల్ని ప్ర‌భావితం చేయ‌లేక‌పోతున్నాయి. ఈ ద‌శ‌లో ఆమిర్‌ ఖాన్ (Aamir Khan) న‌టించిన ‘లాల్‌సింగ్ చ‌డ్డా’ (Lal Singh Chaddha) ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డంతో అంద‌రి దృష్టీ ఈ సినిమాపైకే వెళ్లింది. నాలుగేళ్ల త‌ర్వాత ఆమిర్‌ ఖాన్ న‌టించిన చిత్రం కావ‌డం... ఆస్కార్ పుర‌స్కారం సొంతం చేసుకున్న ‘ఫారెస్ట్ గంప్‌’కి (Forrest Gump) రీమేక్‌గా రూపొంద‌డం... ప్ర‌చార చిత్రాలు ఆస‌క్తిని రేకెత్తించ‌డం ఈ సినిమాపై మ‌రిన్ని అంచ‌నాల్ని పెంచాయి. పాన్ ఇండియా ట్రెండ్‌కి త‌గ్గ‌ట్టుగానే ఆమిర్‌ ఖాన్ తెలివిగా ఈ సినిమాని ప‌లు భాష‌ల్లో విడుద‌ల చేశారు. ప్రాంతీయ భాష‌ల్లో అగ్ర తార‌ల్ని ఇందులో భాగం చేస్తూ ఈ సినిమాని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చారు. తెలుగులో అగ్ర క‌థానాయ‌కుడు చిరంజీవి (Chiranjeevi) ఈ చిత్రానికి స‌మ‌ర్ప‌కులుగా వ్య‌వ‌హ‌రించారు. మ‌రి చిత్రం ఎలా ఉందో తెలుసుకునే ముందు క‌థేమిటో చూద్దాం...

క‌థేంటంటే?

లాల్‌సింగ్ చ‌డ్డా (ఆమిర్‌ ఖాన్‌) కుటుంబంలో తాత ముత్తాత‌లంతా ఆర్మీలో ప‌నిచేసిన‌వాళ్లే. లాల్ కూడా ఆర్మీలో ప‌నిచేయ‌డ‌మే త‌న త‌ల్లికి ఇష్టం. కానీ, చిన్న‌ప్ప‌ట్నుంచి బ‌ల‌హీనుడిలా, నెమ్మ‌దైన కుర్రాడిలా క‌నిపించే లాల్‌కి ఒక‌రిని చంప‌డ‌మంటే ఇష్టం ఉండ‌దు. జీవితంలో అద్భుతాలు జ‌రుగుతుంటాయంటారు క‌దా, అలా రూప (క‌రీనా క‌పూర్‌) (Kareena Kapoor Khan) త‌న జీవితంలోకి రావ‌డం, ఆ త‌ర్వాత మ‌రికొన్ని అద్భుతాలు చోటు చేసుకోవ‌డంతో అత‌ను మామూలు కుర్రాడిగా మారి, ఆ త‌ర్వాత త‌ల్లి క‌ల‌లకి త‌గ్గ‌ట్టే ఆర్మీలో చేర‌తాడు. అక్క‌డే తోటి సిపాయి అయిన బాల‌రాజు (నాగ‌చైత‌న్య‌) (Naga Chaitanya) ప‌రిచ‌యం అవుతాడు. బాల‌రాజు కుటుంబానికీ ఓ చ‌రిత్ర ఉంది. బ‌నియ‌న్లు, డ్రాయ‌ర్లు త‌యారు చేసే కుటుంబం వాళ్ల‌ది. ఎప్ప‌టికైనా త‌న తాత ముత్తాత‌ల్లా బ‌నియ‌న్లు డ్రాయ‌ర్లు త‌యారు చేసే కంపెనీని ఏర్పాటు చేయాల‌ని క‌ల‌లు కంటుంటాడు. లాల్‌, బాల ఇద్ద‌రూ ఆర్మీ నుంచి బ‌య‌టికెళ్లాక క‌లిసి బ‌నియ‌న్లు, డ్రాయ‌ర్ల వ్యాపారం చేయాల‌నుకుంటారు. మ‌రి జీవితం ఆ ఇద్ద‌రినీ ఎక్క‌డి వ‌ర‌కు తీసుకెళ్లింది? చిన్న‌ప్పుడు త‌న ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన రూప‌తో లాల్ జీవితాన్ని పంచుకున్నాడా లేదా? అనేది మిగ‌తా క‌థ‌.

ఎలా ఉందంటే?

భావోద్వేగాల స‌మ్మిళితం ఈ సినిమా. విధి జీవితాల్ని ఎలా ప్ర‌భావితం చేస్తుందో ఓ ఈక‌తో పోలుస్తూ అందంగా చెప్పే ప్ర‌య‌త్నం చేశాడు ద‌ర్శ‌కుడు అద్వైత్ చంద‌న్‌. కాక‌పోతే మ‌రీ సుదీర్ఘంగా సాగుతుంది సినిమా. తెరపై ఆమిర్‌ ఖాన్ నాలుగేళ్లు ప‌రుగుపెట్టి ఎలా అల‌సిపోతాడో, ఈ సినిమా చూశాక ప్రేక్ష‌కుడికి కూడా ఇంచు మించు అదే అనుభవం క‌లుగుతుంది. 90వ ద‌శ‌కంలో వ‌చ్చిన ‘ఫారెస్ట్ గంప్‌’ సినిమాని మ‌న సామాజిక రాజ‌కీయ ప‌రిస్థితులతో ముడిపెట్టి ర‌చించిన తీరు ఆక‌ట్టుకుంటుంది. ఆ విష‌యంలో ర‌చ‌యిత అతుల్ కుల‌క‌ర్ణి క‌థ‌పై త‌న‌దైన ముద్ర‌వేశారని చెప్పొచ్చు. విధితోపాటు.. ప్రేమ‌, మాన‌వ‌త్వం వంటి విష‌యాల్ని ఈ క‌థ‌లో అందంగా స్పృశించారు. ప‌టాన్ కోట్ నుంచి చండీగ‌ఢ్ వెళ్లే రైలులో ఈ క‌థ మొద‌ల‌వుతుంది. 1970వ ద‌శ‌కం నుంచి చ‌డ్డా జీవితం మొద‌ల‌వుతుంది.

ఎమ‌ర్జెన్సీ, సిక్కుల ఊచ‌కోత‌, మ‌త క‌ల‌హాలు, ముంబయి అల్ల‌ర్లు, కార్గిల్ యుద్ధం, ముంబయి మార‌ణ‌హోమం, అన్నా హ‌జారే దీక్ష... ఇలా దేశంలో జ‌రిగిన ప‌లు సంఘ‌ట‌న‌ల్ని క‌థ‌తో ముడిపెట్టిన తీరు ప్ర‌తి ఒక్క‌రినీ లీనం చేస్తుంది. లాల్ బాల్యం, అత‌ని ఎదుగుద‌ల‌, రూప‌తో ప్రేమ‌, ఆర్మీ జీవితం... ఇలా ప‌లు పార్శ్వాలుగా క‌థ సాగుతుంది. షారూఖ్‌ఖాన్ ఎపిసోడ్‌, లాల్ ప‌రుగు పోటీలు, బాల బనియ‌న్ల క‌థ‌... ప్రేక్ష‌కుల‌కు స్వ‌చ్ఛ‌మైన హాస్యం పంచుతాయి. ద్వితీయార్థం భావోద్వేగాలే ప్ర‌ధానంగా సాగుతుంది. లాల్- రూప బంధం నేప‌థ్యంలో వ‌చ్చే స‌న్నివేశాలు హృద‌యాల్ని మెలిపెడ‌తాయి. మ‌హ‌మ్మ‌ద్ భాయ్ నేప‌థ్యంలో వ‌చ్చే స‌న్నివేశాలు మ‌తం, మాన‌వ‌త్వం వంటి విష‌యాల్ని అందంగా ఆవిష్క‌రిస్తాయి. ప‌తాక స‌న్నివేశాలు భావోద్వేగాల‌కి పెద్ద‌పీట వేసినా అవి మ‌రీ నిదానంగా, మాట‌ల‌తో సాగ‌డం అంత‌గా మెప్పించ‌దు.

ఎవ‌రెలా చేశారంటే?

లాల్‌సింగ్ చ‌డ్డా పాత్ర‌పై ఆమిర్‌ ఖాన్ త‌న‌దైన ముద్ర వేసే ప్ర‌య‌త్నం చేశారు. ఆయా కాల‌మాన ప‌రిస్థితులు, పాత్ర‌కి త‌గ్గ‌ట్టుగా ప‌లు కోణాల్లో క‌నిపించే ప్ర‌య‌త్నం చేశారు. అందుకు త‌గ్గ‌ట్టుగా త‌న‌ని తాను మ‌లుచుకున్న విధానం కూడా మెప్పిస్తుంది. అయితే `పీకే`లో కూడా ఇంచుమించు  ఆయ‌న పాత్ర ఇదే ర‌క‌మైన అమాయ‌క‌త్వంతో క‌నిపిస్తుంది కాబ‌ట్టి, ఇందులో కొత్తగా ప్ర‌యత్నించిన‌ట్టేమీ అనిపించ‌దు. ప్ర‌తి మాట‌కి ముందు మ్‌మ్‌... అంటూ మూలుగుతూ మాట్లాడ‌టం కూడా అంత‌గా అత‌క‌లేద‌నిపిస్తుంది. బాల‌రాజు పాత్ర‌లో నాగ‌చైత‌న్య  క‌నిపించేది కొద్దిసేపే. బ‌నియ‌న్లు, డ్రాయ‌ర్లు అంటూ ఆయ‌న చేసే హంగామా న‌వ్విస్తుంది. క‌రీనా క‌పూర్  పోషించిన రూప పాత్ర హ‌త్తుకుంటుంది. ఆ పాత్ర‌లో క‌రీనా చ‌క్క‌టి భావోద్వేగాల్ని పండించింది. మాన‌వ్ విజ్‌,  మోనాసింగ్ త‌దిత‌రులు పాత్ర‌ల‌పై త‌మ‌దైన ముద్ర వేశారు. షారూఖ్‌ఖాన్ అతిథి పాత్ర అల‌రిస్తుంది. సాంకేతిక విభాగాల్లో ఎడిటింగ్ త‌ప్ప మిగ‌తా విభాగాల‌న్నీ చ‌క్క‌టి ప‌నితీరుని క‌న‌బ‌రిచాయి. అతుల్ కుల‌క‌ర్ణి ర‌చ‌నతో ఆక‌ట్టుకున్నాడు. అద్వైత్ చంద‌న్ క‌థ‌నం ప‌రంగా ఎలాంటి క‌స‌ర‌త్తులు చేయ‌క‌పోవ‌డం సినిమాకి మైన‌స్‌గా మారింది. నిర్మాణం ఉన్న‌తంగా ఉంది.

బ‌లాలు

+ భావోద్వేగాలు  

+ ఆమిర్‌ ఖాన్, క‌రీనా క‌పూర్ న‌ట‌న

+ ప్ర‌ధమార్థంలో హాస్యం

బ‌ల‌హీన‌త‌లు

- సాగ‌దీత‌గా అనిపించే స‌న్నివేశాలు

- ఆక‌ట్టుకోని క‌థ‌నం

చివ‌రిగా: లాల్ సింగ్ చ‌డ్డా... హృద‌యాల్ని మెలిపెడ‌తాడు.

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని