KK: ‘మనం రేపు బతికున్నా లేకున్నా’.. అభిమానులతో కేకే ఆఖరి మజిలీ

‘హమ్‌ రహే యా నా రహే కల్‌’ అంటే ‘మనం రేపు బతికున్నా లేకున్నా’.. చివరి క్షణాల్లో  పాట రూపంలో కేకే తన అభిమానులకు చెప్పిన మాటలివే....

Updated : 01 Jun 2022 13:24 IST

వైరల్‌గా మారిన చివరి వీడియో

ముంబయి: ‘హమ్‌ రహే యా నా రహే కల్‌’ అంటే ‘మనం రేపు బతికున్నా లేకున్నా’.. చివరి క్షణాల్లో  పాట రూపంలో కేకే తన అభిమానులకు చెప్పిన మాటలివే. కెరీర్‌ ఆరంభంలో కేకేకు మంచి గుర్తింపు ఇచ్చింది ఈ ఆల్బమ్‌. ఎన్నో కోట్ల మంది మనుసుని హత్తుకునేలా సాగే ఈ పాటనే మంగళవారం సాయంత్రం కోల్‌కతాలోని నజురుల్‌ మంచా ఆడిటోరియంలో ఆయన చివరి సారిగా ఆలపించారు. కేకే ఈ పాట ప్రారంభించగానే ఆడిటోరియంలో ఉన్న ప్రతి ఒక్కరూ సెల్‌ఫోన్లలో ఫ్లాష్‌ లైట్స్‌ ఆన్‌ చేసి ఆయన్ని ఎంతగానో ఉత్సాహపరిచారు. ఈ పాట పూర్తైన వెంటనే ఛాతినొప్పిగా అనిపించడంతో కేకే ఆడిటోరియం నుంచి హోటల్‌ రూమ్‌కి వెళ్లిపోయారు. అనంతరం కొన్ని క్షణాలకే ఆయన మరణించారనే వార్తలు బయటకు వచ్చాయి. ఈ వార్తలు చూసిన చాలామంది అభిమానులు షాక్‌కు లోనయ్యారు. కొన్ని క్షణాల ముందు.. తమ ఎదుట పాటలు పాడిన ఆయన కన్నుమూశారంటే నమ్మలేకపోతున్నామంటూ పోస్టులు పెడుతున్నారు.

ప్రదర్శనకు ముందు ఉక్కపోత.. ప్రదర్శన పూర్తవగానే..!

నజురుల్‌ మంచా ఆడిటోరియంలో ప్రదర్శన ప్రారంభం కావడానికి ముందు కేకే ఇబ్బందికి గురైనట్లు ఉన్న పలు వీడియోలు బయటకు వచ్చాయి. ఆడిటోరియంలో సరిగ్గా గాలి లేకపోవడంతో ఉక్కపోతకు గురైన ఆయన టవల్‌తో చెమటలు తుడుచుకుంటున్నట్లు కనిపించారు. కేకే ఛాతినొప్పితో ఇబ్బందిపడుతున్నారని తెలుసుకున్న సిబ్బంది ఆయన్ని హుటాహుటిన అక్కడి నుంచి తీసుకువెళ్లిపోయిన వీడియోలను నెటిజన్లు షేర్‌ చేస్తున్నారు. ఇక, కేకేది అసహజ మరణంగా పేర్కొంటూ కోల్‌కతా పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రాథమిక దర్యాప్తు చేపట్టారు. మరణవార్తతో దిగ్భ్రాంతికి గురైన కేకే కుటుంబసభ్యులు కోల్‌కతా చేరుకున్నారు.






Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని