Lata Mangeshkar: లతా మంగేష్కర్‌.. స్కూల్‌కి వెళ్లింది ఒక్కరోజే..!

తన మధురమైన స్వరంతో కోట్లాది మంది ప్రజల మనసులను గెలుచుకున్న లతా మంగేష్కర్‌.. పాఠశాలకు వెళ్లింది ఒక్కరోజు మాత్రమే అంటే నమ్మగలమా..?

Published : 07 Feb 2022 01:45 IST

ఆ కారణంతో మళ్లీ బడి ముఖం చూడని గానకోకిల

దిల్లీ: తన మధురమైన స్వరంతో కోట్లాది మంది ప్రజల మనసులను గెలుచుకున్న లతా మంగేష్కర్‌.. పాఠశాలకు వెళ్లింది ఒక్కరోజు మాత్రమే అంటే నమ్మగలమా..? వివిధ భాషల్లో ఎన్నో ఆణిముత్యాలను అందించిన గానకోకిల అక్షరాలు నేర్చుకుంది ఇంట్లోనే అంటే ఊహించగలమా..? అవును.. నిజమే. భారతరత్నతో పాటు మరెన్నో పురస్కారాలు సొంతం చేసుకున్న లతా మంగేష్కర్‌ పాఠశాలకు వెళ్లింది మాత్రం ఒక్కరోజే. అయినప్పటికీ ఇంటిదగ్గరే అక్షరాలు నేర్చుకున్న ఈ సంగీత కోకిల పలు భాషలపైనా పట్టుసాధించడం విశేషం.

లతా మంగేష్కర్‌ జీవితంపై నస్రీన్‌ మున్నీ కబీర్‌ రాసిన ఓ పుస్తకంలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ‘మహారాష్ట్రలోని సాంగ్లీలో మా ఇంటిముందే మరాఠీ మీడియం బోధించే మురళీధర్‌ పాఠశాల ఉండేది. అందులో నా సమీప బంధువు వాసంతి మూడోతరగతి చదువుకునేది. ఆమెతోపాటు అప్పుడప్పుడు నేను కూడా వెళ్లేదాన్ని. చివరకు అదే స్కూళ్లో నేనూ చేరాను. అయితే, చేరిన తొలిరోజే నా సోదరి ఆశాభోంస్లేను (పది నెలల వయసున్న) నా భుజాలపై వేసుకొని వెళ్లాను. తరగతిలోకి వెళ్లిన తర్వాత ఆశాను నా ఒడిలో పెట్టుకొని కూర్చున్నాను. అది చూసిన టీచర్‌.. ఇక్కడ చిన్న పిల్లలకు అనుమతి లేదంటూ తేల్చిచెప్పారు. అలా టీచర్‌ చెప్పడం నాకు తీవ్ర కోపాన్ని తెప్పించింది. వెంటనే అక్కడ నుంచి ఆశాను తీసుకొని ఇంటికి వచ్చేశాను. మళ్లీ ఎప్పుడూ స్కూల్‌కు తిరిగి వెళ్లలేదు’ అని లతా మంగేష్కర్‌ వెల్లడించారు.

‘నాకు మూడు లేదా నాలుగేళ్ల వయసున్నప్పుడు మరాఠీ అక్షరాలను నేర్పించమని మా ఇంట్లో పనిచేసే విట్టల్‌ అనే సహాయకుడిని అడిగాను. ఆయన చదవడం, రాయడం కూడా నేర్చించారు. అలా మరాఠీ చదవడం ఇంటివద్దే నేర్చుకున్నాను. బడిలో చేరకముందు కొంతకాలం నర్సరీ తరగతులకు హాజరయ్యాను. ‘శ్రీ గణేష్‌జీ’ అని బోర్డుమీద రాయమని టీచర్‌ అడిగితే అది ఎలా ఉందో అలాగే కాపీ కొట్టేదాన్ని. దాంతో 10కి 10 మార్కులు వచ్చేవి’ అంటూ లతా మంగేష్కర్‌ తన చిన్ననాటి మధుర జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.

ఇక పాటలను ఎలా నేర్చుకుంటారని అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చిన మంగేష్కర్‌.. ‘తొలుత పాటను హిందీలో రాసుకుంటాను. అవి ఉర్దూ లేదా మరే భాషలో ఉన్నా సరే అదే విధంగా చేస్తాను. మ్యుజిక్‌ డైరెక్టర్‌ పాట పాడి వినిపించినప్పుడు ట్యూన్‌ను అర్థం చేసుకుంటాను. అదే సమయంలో ఏయే పదాలను ఎలా ఉచ్చరించాలో నా సొంతంగా నోట్స్‌ సిద్ధం చేసుకుంటాను. అలా ట్యూన్‌ కంఠస్థం చేసి పాడేస్తాను’ అని లతా మంగేష్కర్‌ వివరించారు.

ఇలా లతా మంగేష్కర్‌ కేవలం మరాఠీనే కాకుండా పలు భాషలపైనా పట్టుసాధించారు. తొలుత తన సోదరి సహాయంతో హిందీ నేర్చుకోగా.. అనంతరం ముంబయిలోని లేఖ్‌రాజ్‌ శర్మ అనే శిక్షకుడి దగ్గర హిందీ భాషను పూర్తిగా నేర్చుకున్నారు. ఉర్దూ, బెంగాలీతోపాటు పంజాబీని నేర్చుకున్నట్లు వెల్లడించారు. తమిళ భాషనూ నేర్చుకునే ప్రయత్నం చేసిన లతా మంగేష్కర్‌.. సంస్కృత భాషలోనూ ప్రావీణ్యముంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని