Lata Mangeshkar: పాటల ‘రీమిక్స్‌’పై లతా మంగేష్కర్‌ ఏమనేవారంటే..!

గతంలో లతా మంగేష్కర్‌ పాడిన పాపులర్‌ పాటలను రీమిక్స్‌ చేసి అనంతర కాలంలో వచ్చిన సినిమాలు, వీడియోల్లో ఉపయోగించారు. ఇటువంటి రీమిక్స్‌ పద్ధతిని మాత్రం లతా మంగేష్కర్‌ వ్యతిరేకించేవారు.

Updated : 22 Nov 2022 16:26 IST

దిల్లీ: భారతీయ సంగీత ప్రపంచంలో లెజెండ్‌గా నిలిచిన లతా మంగేష్కర్‌ ఇక లేరనే విషయం యావత్‌ సంగీత ప్రియులకు చేదు వార్తగానే మిగిలిపోయింది. భౌతికంగా లతా మంగేష్కర్‌ అందర్నీ వీడిపోయినప్పటికీ.. ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయే ఎన్నో మధుర గీతాలను మాత్రం ప్రపంచానికి అందించారు. దాదాపు ఏడు దాశాబ్దాల పాటు కొనసాగిన ఆమె వృత్తి జీవితంలో ఎన్నో వేల ఆణిముత్యాలను అందించారు. అయితే, గతంలో లతా మంగేష్కర్‌ పాడిన పాపులర్‌ పాటలను రీమిక్స్‌ చేసి అనంతర కాలంలో వచ్చిన సినిమాలు, వీడియోల్లో ఉపయోగించారు. ఇటువంటి రీమిక్స్‌ పద్ధతిని మాత్రం లతా మంగేష్కర్‌ వ్యతిరేకించేవారు. గతంలో ఇదే అంశంపై ఆందోళన వ్యక్తం చేసిన ఆమె.. పాటల రీమిక్స్‌కు సంబంధించి తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ 2018లో ఓ ప్రకటన విడుదల చేశారు.

హిందీ పాటల్లో రీమిక్స్‌కు సంబంధించిన అంశం ప్రముఖ గేయ రచయిత జావేద్‌ అక్తర్‌తో జరిపిన సంభాషణ సమయంలో ప్రస్తావనకు వచ్చింది. అనంతరం ఆ విషయంపై తన అభిప్రాయాలను తెలియజేయాల్సిన అవసరం ఉందంటూ 2018లో లతా మంగేష్కర్‌ ఓ ట్వీట్‌ చేశారు. ‘ఆనాటి మధుర గీతాలకు కొత్త సంగీత బాణీలను జోడించి నూతనంగా తీసుకొచ్చే ముందు రికార్డింగ్‌ కంపెనీలు ఓసారి ఆలోచించాలి. సిద్ధాంతపరంగా పాటలను రీమిక్స్‌ చేయడం తప్పేమీ కాదు. ఒక పాట సారాంశం, సాహిత్యం సురక్షితంగా ఉన్నంతకాలం దానిని కొత్త వర్షన్‌లో తీసుకురావడంలో తప్పేమీ లేదు. కానీ, పాటకు ఓ కచ్చితమైన రూపం లేకుండా దాని ఆకృతిని మాత్రమే మార్చడం తప్పు’ అంటూ అతా మంగేష్కర్‌ పేర్కొన్నారు.

ఇక పాట క్రెడిట్‌ను మరొకరికి ఇచ్చేందుకు ట్యూన్‌ని పాడుచేయడం, సాహిత్యాన్ని యథేచ్ఛగా మార్చడం వంటి చౌకబారు ఆలోచనలు జోడించడం చోటు చేసుకుంటున్నట్లు తన దృష్టికి వచ్చిందని లతా మంగేష్కర్‌ పేర్కొన్నారు. ఇటువంటి అసంబద్ధ ప్రవర్తన తనను ఎంతోగానో బాధిస్తోందంటూ అప్పట్లో ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి పాటను ఎంతో అందంగా, అర్థవంతంగా తీర్చిదిద్దేందుకు స్వరకర్తలు, గాయకులు, గీత రచయితలు, సాంకేతిక బృందం, దర్శకులు ఎంతో కష్టపడతారని వివరించారు. ఇటువంటి సంగీత వారసత్వం అక్కడితో ఆగకూడదని.. మన సమాజం, సంస్కృతికి ఓ ముఖ్యమైన చిహ్నంగా సంగీతాన్ని గౌరవించే స్థాయికి ఎదగాలని లతా మంగేష్కర్‌ ఆకాంక్షించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని