Lata Mangeshkar: అమృతం పంచిన స్వరం ఆమెది..!

రిపబ్లిక్‌ డే రోజు కచ్చితంగా వినిపించే పాటల్లో ‘ఏ మేరీ వతన్‌’  ఒకటి. ఈ పాటను కవి ప్రదీప్‌ రాసిన ఈ పాటకు సి.రామచంద్ర మ్యూజిక్‌ కంపోజ్‌ చేశారు.

Updated : 08 Feb 2022 11:19 IST

లతా మంగేష్కర్‌ గొంతులో అమృతం ఉంది.. ఆ గానమాధుర్యానికి ఎంతటి వారైన మంత్రముగ్ధులు కావాల్సిందే.. ఆమె ‘ఏ మేరి వతన్‌’ అంటే ప్రతిభారతీయుడిలో దేశభక్తి స్ఫూర్తి రగలాల్సిందే.. ‘తుఝే దేఖా హై తో’ అని ఆమె హుషారుగా పాడినా.. దేశ యువత దాసోహమవ్వాల్సిందే. ఎటువంటి పాట అయినా ఈ గాన కోకిల స్వరంతో భారతీయులు తన్మయంలో మునిగిపోతారు. అభిమానులు ఆమెను ప్రేమతో దీదీ అని పిలుస్తారు. 36కుపైగా భాషల్లో.. దాదాపు 25 వేలకుపైగా పాటలు పాడారు. ఆమె పాటల్లో ప్రతిదీ ఆణిముత్యమే.. వాటిల్లో అత్యుత్తమైనవి అంటూ ఎంచటం కష్టమే.. కేవలం ఆమెను స్మరించుకోవడానికి కొన్ని.. 

ఏ మేరే వతన్‌ (ఆల్బం)

(ఫొటోలు : లతా మంగేష్కర్‌ ట్విటర్‌ నుంచి..)

రిపబ్లిక్‌ డే రోజు కచ్చితంగా వినిపించే పాటల్లో ‘ఏ మేరే వతన్‌’  ఒకటి. కవి ప్రదీప్‌ రాసిన ఈ పాటకు సి.రామచంద్ర మ్యూజిక్‌ కంపోజ్‌ చేశారు. తొలిసారి 1963 రిపబ్లిక్‌ డే రోజు సాయంత్రం న్యూదిల్లీలోని నేషనల్‌ స్టేడియంలో అప్పటి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణా, ప్రధాని జవహర్‌ లాల్‌ నెహ్రూ సమక్షంలో లతా ఆలపించారు. ఆర్ధ్రతతో నిండిన ఆమె స్వరం.. సైనికుల త్యాగాలను కీర్తిస్తూ ప్రదీప్‌ రాసిన సాహిత్యానికి అక్కడి వారి కళ్లు చెమర్చాయి. ఈ గీతాలాపన తర్వాత దేశ ప్రధాని నెహ్రూ కన్నీరు ఆపుకోలేకపోయారు. అనంతరం ఆమెను వ్యక్తిగతంగా కలిసి ‘మీరు నాతో కంటతడి పెట్టించారు’ అని చెప్పారు. లతా తన గానంతో దేశానికి అందించిన అద్భుతమైన కానుకగా ఈ పాట నిలిచింది.

ఏ దిలే నాదాన్‌: రజియా సుల్తాన్‌

రజియా సుల్తాన్‌ చిత్రంలో ‘ఏ దిలే నాదాన్’ పాట లతకు మంచి పేరు తీసుకొచ్చింది. మహమ్మద్‌ జహుర్‌ ఖయ్యుం కంపోజ్‌ చేసిన ఈ పాటలో లతా స్వరం సినీ పరిశ్రమను కట్టిపడేసింది. 1980ల్లో బాలీవుడ్‌లోని అత్యుత్తమ పాటల్లో ఒకటిగా నిలిచింది.

రైనా బీతి జాయే : అమర్‌ ప్రేమ్‌

అమర్‌ ప్రేమ్‌ చిత్రం కోసం ఆర్‌.డి. బర్మన్‌ కంపోజ్‌ చేసిన ‘రైనా బీతి జాయే’ పాటను లతా అద్భుతంగా ఆలపించారు. ఆర్‌.డి.బర్మన్‌ స్వరపర్చిన అత్యుత్తమ  పాటల్లో ఇది కూడా ఒకటి.

ఆజ్‌ ఫిర్‌ జీనేకి తమన్నా : గైడ్‌

సినీ నటుడు దేవ్‌ ఆనంద్‌ కెరీర్‌లోనే గైడ్‌ చిత్రం బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రంలో లాతా పాడిన ‘ఆజ్‌ ఫిర్‌ జీనేకి తమన్నా’ సాంగ్‌ సూపర్‌ హిట్‌ అయ్యింది. ఈ పాటతో లతా ఫిల్మ్‌ఫేర్‌కు నామినేట్‌ అయ్యారు. లతా కెరీర్‌లో బెస్ట్‌ సాంగ్స్‌లో ఇది కూడా ఒకటి.

తుఝే దేఖా తో యే జానా సనమ్‌: దిల్‌ వాలే దుల్హానియా లేజాయేంగీ

నేటి తరం యువతకు ప్రేమ అంటే గుర్తుకొచ్చే పాట దిల్‌ వాలే దుల్హనియా లేజాయేంగీ చిత్రంలోని ‘తుఝే దేఖా తో యే జానా సనమ్’. ఈ పాట కూడా లతా స్వరం నుంచి జాలువారింది. దిల్ వాలే చిత్రం బాలీవుడ్‌లో బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌గా నిలవడంలో ఈ పాట పాత్ర చాలా ఉంది. ఆమె స్వరానికి భారత యువత పులకించిపోయింది. యువతను ఆమె పాటలకు పెద్ద ఫ్యాన్స్‌గా మార్చేసింది.

హమ్‌కో హమీ సే చురాలో : మొహబ్బతే

షారుఖ్‌ ఖాన్‌-కాజల్‌ హిట్‌ జంటగా నిరూపించిన చిత్రం మొహబ్బతే. ఈ చిత్రంలో లతా పాడిన ‘హమ్‌కో హమీ సే చురాలో’ పాట సంగీత ప్రియులను ఓలలాడించింది. మొహబ్బతే చిత్రంలో ఈ పాట హైలైట్‌గా నిలిచింది. లత ఎంత వర్సెటైల్‌ సింగరో ప్రపంచానికి తెలియజేసింది.

కభీ ఖుషీ కభీ గమ్‌ : కభీ ఖుషీ కభీ గమ్‌

అమితాబ్‌-షార్‌ఖ్‌-హృతిక్‌ రోషన్‌ వంటి మెగాస్టార్లు కలిసి నటించిన కభీ ఖుషీ కభీ గమ్‌ సినిమాలో టైటిల్‌ సాంగ్‌ లతా పాడారు. ఈ చిత్రం ఎంత పెద్ద హిట్టో.. టైటిల్‌ సాంగ్‌ అంతకు మించిన హిట్‌గా నిలిచింది. మ్యూజిక్‌ డైరెక్టర్ల ద్వయం జతిన్‌-లలిత్‌ కెరీర్‌లో ఈ పాట ఓ ఆణిముత్యం.

-ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని