Hansika: పెళ్లి వేడుకల్లో తల్లి నిర్ణయంతో హన్సిక తీవ్ర ఉద్వేగం

నటి హన్సిక (Hansika) పెళ్లి వేడుకలకు సంబంధించిన తాజా ఎపిసోడ్‌ శుక్రవారం విడుదలైంది. హన్సిక పెళ్లి ఏర్పాట్లు ఎలా జరిగాయో ఇందులో చూపించారు.

Published : 24 Feb 2023 13:40 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: గతేడాది వివాహబంధంలోకి అడుగుపెట్టారు నటి హన్సిక (Hansika). తన స్నేహితుడు సోహైల్‌ను ఆమె పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. రాజస్థాన్‌లో మూడు రోజులపాటు జరిగిన వీరి పెళ్లి వేడుకలను ‘లవ్‌ షాదీ డ్రామా’ (Love Shaadi Drama) పేరుతో హాట్‌స్టార్‌ వేదికగా రెండు వారాల నుంచి ప్రసారం చేస్తున్నారు. తాజాగా విడుదలైన ఎపిసోడ్‌లో పెళ్లికి ముందు హన్సిక కుటుంబంలో జరిగిన అమ్మవారి పూజా కార్యక్రమం, వెడ్డింగ్‌ డ్రెస్‌ షాపింగ్‌ వంటివి చూపించారు.

ఇందులో భాగంగా కన్యాదానం విషయంలో తాను తీసుకున్న ఓ నిర్ణయాన్ని తన కుమార్తెకు వివరిస్తూ హన్సిక తల్లి కనిపించారు. ‘‘కుటుంబంలో అందరి కంటే నువ్వే నాకు ఎక్కువ. ప్రతి అమ్మాయికీ ఆత్మ గౌరవం ఎంతో ముఖ్యం. నీ వల్లే అది నాకు మరింత పెరిగింది. నిన్ను చూస్తుంటే నాకెంతో గర్వంగా ఉంది. ఇబ్బందులు ఎదుర్కొని.. విమర్శలు దాటుకుని.. ఈ స్థాయికి వచ్చావు. పెళ్లి విషయంలో నేను కన్యాదానం చేయకూడదని ఓ నిర్ణయం తీసుకున్నా. ఎందుకంటే, నువ్వేమీ వస్తువు కాదు వేరొకరికి దానం చేయడానికి. కన్యాదానానికి బదులు గోదానం చేస్తాను. అలాగే, పెళ్లి అయినా సరే నువ్వు ఎప్పటికీ ఈ ఇంటి కుమార్తెవే’’ అంటూ తల్లి చెప్పడంతో హన్సిక తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తల్లి తీసుకున్న నిర్ణయం తనకెంతో నచ్చిందని, ఇది చాలా గొప్ప విషయమని చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని