Cinema News: సంక్షిప్త వార్తలు (8)

కియారా అడ్వాణీ ఓ మహిళా ప్రాధాన్య చిత్రం నుంచి తప్పుకొందంటూ బాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.

Updated : 29 Oct 2022 09:04 IST

కర్రమ్‌ కుర్రమ్‌ నుంచి తప్పుకున్న కియారా?

కియారా అడ్వాణీ (Kiara Advani) ఓ మహిళా ప్రాధాన్య చిత్రం నుంచి తప్పుకొందంటూ బాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ‘లిజ్జత్‌ పాపడ్స్‌’ విజయవంతమైన ప్రస్థానాన్ని తెరకెక్కించడానికి ఫిల్మ్‌మేకర్‌ అశుతోష్‌ గోవారికర్‌ సన్నాహలు చేస్తున్నారు. ‘కర్రమ్‌ కుర్రమ్‌’ (karram kurram) పేరుతో రూపోందనున్న ఈ చిత్రంలో కియారాను తీసుకున్నారు. తాజా సమాచారం ప్రకారం ఆమె ఈ చిత్రం నుంచి తప్పుకొన్నట్టు తెలుస్తోంది. ‘‘ఈ సినిమా కమర్షియల్‌గా అంతగా వర్కవుట్‌ అయ్యేలా కనిపంచడం లేదు. పైగా ఇందులోని పాత్రకు తను సరిపోను’’అని కియారా భావించడంతో ఈ సినిమాను వదులుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించపోయినా త్వరలోనే చిత్రబృందం కొత్త కథానాయికను ప్రకటించే అవకాశం ఉంది. ఈ చిత్రానికి గ్లన్‌ బరెట్టో, అంకుష్‌ మోహ్లా దర్శకత్వం వహించనున్నారు. మరో పక్క కియారా చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. తెలుగులో రామ్‌చరణ్‌ సినిమాతో పాటు హిందీలో జుగ్‌జుగ్‌ జీయో, గోవిందా నామ్‌ మేరా, సత్యప్రేమ్‌ కీ కథా చిత్రాల్లో నటిస్తోంది.


‘ఫైటర్‌’ రాక ఆలస్యం

హృతిక్‌ రోషన్‌ (Hritik Roshan) అభిమానులతో పాటు యాక్షన్‌ ప్రియులు ఎదురుచూస్తున్న చిత్రం ‘ఫైటర్‌’ (Fighter). ఈ సినిమా సెట్స్‌ మీదకు వెళ్లకుండానే 2023 సెప్టెంబరు 30న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు తాజాగా మరో కొత్త తేదీని చిత్రబృందం ప్రకటించింది. 2024 జనవరి 25న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. 75వ రిపబ్లిక్‌ డే దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు ఓ పోస్టర్‌ను పంచుకుంటూ ట్వీట్‌ చేశారు హృతిక్‌ రోషన్‌. ‘వార్‌’ లాంటి బ్లాక్‌బస్టర్‌ సినిమా తర్వాత సిద్ధార్థ్‌ ఆనంద్‌..హృతిక్‌ కలయికలో రానున్న చిత్రం కావడంతో భారీ అంచనాలున్నాయి. మనదేశంలో తెరకెక్కుతోన్న తొలి ఏరియల్‌ సీక్వెన్స్‌ చిత్రమిది. ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తోంది. త్వరలోనే  ఈ సినిమాని సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నారు. అనిల్‌కపూర్‌ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు.


ఈసారి సల్మాన్‌తో?

విజయ్‌తో వరసగా మూడు హిట్‌ చిత్రాలు అందించి క్రేజీ దర్శకుడిగా ఎదిగారు అట్లీ. దాంతో బాలీవుడ్‌ హీరో షారుక్‌ఖాన్‌ సినిమాకి పనిచేసే అవకాశం వచ్చింది. షారుక్‌ కథానాయకుడిగా ‘జవాన్‌’ను తెరకెక్కిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం అట్లీతో మరో స్టార్‌ హీరో సల్మాన్‌ఖాన్‌ పనిచేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఈ ఇద్దరి మధ్య చర్చలు కూడా జరిగినట్టు సమాచారం. అన్ని అనుకున్నట్టు జరిగితే సల్మాన్‌ఖాన్‌తో (Salman Khan) అట్లీ సినిమా పట్టాలెక్కనుంది. ‘జవాన్‌’ పూర్తయ్యాకా విజయ్‌ 68వ చిత్రానికి అట్లీ దర్శకత్వం వహించే అవకాశం ఉంది.


అతిథిగా అదరగొట్టే స్టెప్పులతో...

ద్దరు అందాల తారల మధ్యలో ఓ యువ కథానాయకుడి డ్యాన్స్‌...చూడటానికి ప్రేక్షకులకు బాగుంటుంది కదా. ‘ఓ తుమ్‌కేశవరీ...’ పాటలో అలాంటి దృశ్యాలే కనపడతాయి. తోడేలు నేపథ్యంలో సాగే హారర్‌ థ్రిల్లర్‌ చిత్రం ‘బేడియా’ (Bediya). తాజాగా ఈ చిత్రంలోని తొలి పాట ‘తుమ్‌కేశవరీ...’ పాటను చిత్రబృందం విడుదల చేసింది. వరుణ్‌ధావన్‌ కథానాయకుడిగా నటించిన ఈచిత్రంలో కృతి సనన్‌ నాయిక. అమర్‌ కౌశిక్‌ దర్శకత్వం వహించారు. ‘ఓ తుమ్‌కేశవరీ...’లో వరుణ్‌, కృతి స్టెప్పులకు తోడు అనుకోని అతిథిలా శ్రద్ధాకపూర్‌ వచ్చి జత కలవడంతో పాటకు మరింత జోష్‌ వచ్చింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌ ఆకట్టుకుంటోంది. హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో వచ్చే నెల 25న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


హత్యకు గురైంది ఎవరు?

వీన్‌ చంద్ర ప్రధాన పాత్రలో శ్రీనివాస్‌ రాజు తెరకెక్కించిన చిత్రం ‘తగ్గేదే లే’ (Thaggede le). భద్ర ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మించింది. దివ్యా పిళ్లై, అనన్య సేన్‌ గుప్తా కథానాయికలు. నాగబాబు, రవి కాలే, మకరంద్‌ దేశ్‌ పాండే, అయ్యప్ప పి.శర్మ, పూజా గాంధీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా నవంబరు 4న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే చిత్ర ట్రైలర్‌ను హీరో నిఖిల్‌ ఇటీవల విడుదల చేశారు. ఓ అమ్మాయి హత్యకు గురవ్వడం.. ఆ కేసును ఛేదించే క్రమంలో పోలీసులు నవీన్‌ చంద్రను అదుపులోకి తీసుకొని విచారించడం వంటి సన్నివేశాలతో ట్రైలర్‌ ఆసక్తికరంగా మొదలైంది. ఓవైపు ఈ కేసు విచారణ సాగుతుంటే.. మరోవైపు ‘దండుపాళ్యం’ ముఠా వరుస హత్యలు చేయడానికి పథకాలు రచిస్తుంటుంది. అసలు హత్యకు గురైన అమ్మాయి ఎవరు? హంతకుల ముఠాకీ నవీన్‌ చంద్రకు ఉన్న సంబంధం ఏంటి? అన్నది తెరపై చూసి తెలుసుకోవాలి.


పండగలా చేసుకో.. నీ స్వేచ్ఛను

‘బ్లాక్‌ అండ్‌ వైట్‌’ అంటూ సందడి చేసేందుకు సిద్ధమైంది నటి హెబ్బా పటేల్‌ (Hebah Patel). ఆమె ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని ఎల్‌ఎన్‌వీ సూర్య ప్రకాష్‌ తెరకెక్కించారు. పద్మనాభ రెడ్డి, సందీప్‌ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. సూర్య శ్రీనివాస్‌, లహరి శారి, నవీన్‌ నేని ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్ర టీజర్‌ను రచయత, రాజ్యసభ సభ్యుడు విజయేంద్ర ప్రసాద్‌ విడుదల చేశారు. ‘‘నో కమిట్‌మెంట్‌.. నో కంట్రోల్‌.. నో రిస్ట్రిక్షన్స్‌. లెట్స్‌ సెలబ్రేట్ యువర్‌ ఫ్రీడమ్‌’’ అంటూ హెబ్బా చెప్పే డైలాగ్‌తో మొదలైన టీజర్‌ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. ఈ ప్రచార చిత్రాన్ని తీర్చిదిద్దిన తీరును బట్టి.. ఇదొక థ్రిల్లర్‌ కథతో తెరకెక్కిన చిత్రమని అర్థమవుతోంది. యువతరం కోరుకునే అన్ని రకాల అంశాలు ఇందులో పుష్కలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా.. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.


ఒకే ఒక్క పాత్రతో..

గార్గేయి ఎల్లాప్రగడ ఏకైక పాత్రలో నటించిన చిత్రం ‘హలో మీరా’. శ్రీనివాసు కాకర్ల దర్శకుడు. లక్ష్మణరావు, వరప్రసాదరావు దుంపల, పద్మ కాకర్ల సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్ర టీజర్‌ను దర్శకుడు హరీష్‌ శంకర్‌ ఇటీవల విడుదల చేశారు. మీరా అనే ఓ పాత్ర.. ఆమెకు వచ్చే కాల్స్‌.. అందులోని ట్విస్ట్‌లతో సినిమాని ఆసక్తికరంగా తీర్చిదిద్దినట్లు టీజర్‌ను బట్టి తెలుస్తోంది. ‘ఒకే పాత్రతో విభిన్నమైన ఎమోషన్స్‌ చూపిస్తూ ఎంతో థ్రిల్లింగ్‌గా ఈ చిత్రం తెరకెక్కించాం. పెళ్లి కాదనుకొని విజయవాడ నుంచి హైదరాబాద్‌కు బయల్దేరిన యువతి.. తన ప్రయాణంలో తల్లిదండ్రులు, పోలీసులు, ప్రేమికుడు, స్నేహితుల నుంచి ఊహించని పరిణామాలు ఎదుర్కొంటుంది. మరి అవేంటి? వాటిని ఆమె ఎలా ఎదుర్కొంది? అన్నది తెరపై చూసి తెలుసుకోవాలి’’ అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ చిత్రానికి సంగీతం: ఎస్‌.చిన్న, ఛాయాగ్రహణం: ప్రశాంత్‌ కొప్పినీడి.  


నవంబరులో ‘పసివాడి ప్రాణం’

ల్లు వంశీ, ఇతి ఆచార్య జంటగా నటించిన చిత్రం ‘పసివాడి ప్రాణం’. ఎన్‌.ఎస్‌.మూర్తి స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఈ చిత్రాన్ని నవంబరులో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. దర్శకనిర్మాత మూర్తి మాట్లాడుతూ ‘‘లైవ్‌ కం యానిమేషన్‌ చిత్రమిది. అప్పటి పసివాడి ప్రాణం చిత్రంలో బాలనటుడుగా ఆకట్టుకున్న సుజిత ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా అందరికీ నచ్చేలా ఉంటుంద’’న్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని