Cinema News: సంక్షిప్త వార్తలు

నవీన్‌చంద్ర కథానాయకుడిగా భద్ర ప్రొడక్షన్స్‌ పతాకంపై తెరకెక్కిన చిత్రం ‘తగ్గేదే లే’. ‘దండుపాళ్యం’ ఫేమ్‌ శ్రీనివాస్‌ రాజు దర్శకత్వం వహించారు. ప్రేమ్‌కుమార్‌ నిర్మాత. ఈ నెల 4న చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది.

Updated : 03 Nov 2022 08:38 IST

ఈ సినిమా విషయంలోనూ జరిగేది అదే!

వీన్‌చంద్ర (Naveen Chandra) కథానాయకుడిగా భద్ర ప్రొడక్షన్స్‌ పతాకంపై తెరకెక్కిన చిత్రం ‘తగ్గేదే లే’ (Thaggedhe Le). ‘దండుపాళ్యం’ ఫేమ్‌ శ్రీనివాస్‌ రాజు దర్శకత్వం వహించారు. ప్రేమ్‌కుమార్‌ నిర్మాత. ఈ నెల 4న చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా ఇటీవల హైదరాబాద్‌లో విడుదలకి ముందస్తు వేడుక జరిగింది. కథానాయకుడు మాట్లాడుతూ ‘‘తొలి లాక్‌డౌన్‌కీ, రెండో లాక్‌డౌన్‌కీ మధ్యలో తెరకెక్కించిన చిత్రమిది. ప్రేమ, ప్రతీకారం,  యాక్షన్‌ అంశాలతో కూడిన కథ ఇది. మూడు కథల్ని ఓ సినిమాలో మేళవించిన తీరు కొత్తగా ఉంది’’ అన్నారు. దర్శకుడు శ్రీనివాస్‌రాజు మాట్లాడుతూ ‘‘మంచి నటులు, నిర్మాణ సంస్థవల్లే ఈ సినిమా సాధ్యమైంది. తప్పకుండా ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది’’ అన్నారు. పూజా గాంధీ మాట్లాడుతూ ‘‘మేం ‘దండుపాళ్యం’ ప్రయాణం మొదలుపెట్టి 12 ఏళ్లు అవుతుంది. మా గ్యాంగ్‌ ఉన్న చోటంతా ఓ మేజిక్‌ జరిగింది. ‘తగ్గేదేలే’ విషయంలోనూ అదే మేజిక్‌ పునరావృతం అవుతుంది’’ అన్నారు. ‘‘యథార్థ ఘటనల్ని తెరపై ఆవిష్కరించే లక్ష్యంతోనే ఈ నిర్మాణ సంస్థని ఏర్పాటు చేశాం. ’’ అన్నారు నిర్మాత ప్రేమ్‌కుమార్‌. కార్యక్రమంలో మకరంద్‌ దేశ్‌పాండే, దివ్య పిళ్లై, అనన్య, రాజా రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.


విజయ్‌తో విశాల్‌?

మిళ కథానాయకుడు విజయ్‌ (Vijay)..దర్శకుడు లోకేష్‌ కనగరాజ్‌ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో మాస్‌లో మంచి ఫాలోయింగ్‌ ఉన్న హీరో విశాల్‌ (Vishal) ఓ కీలక పాత్రల్లో నటిస్త్నుట్లు తెలుస్తోంది. విజయ్‌ 67వ చిత్రంగా రానున్న ఈ సినిమాలో వివిధ చిత్ర పరిశ్రమలకు చెందిన పలువురు ప్రముఖ నటులు కనిపించే అవకాశం ఉందట. గ్యాంగ్‌స్టర్‌ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో కొంచెం ప్రతినాయక ఛాయలున్న పాత్రలో కనిపించనున్నారట విశాల్‌. ముందు ఈ పాత్ర కోసం పృథ్వీరాజ్‌ని అనుకున్నా ఆయన కాల్షీట్లు సర్దుబాటు కాకపోవడంతో అవకాశం విశాల్‌కి వచ్చినట్లుగా తెలుస్తోంది. తను విజయ్‌ అంటే ఎంతో ఇష్టమని పలు సందర్భాల్లో విశాల్‌ వెల్లడించారు.


మల్లయోధుడి ‘మట్టికుస్తీ’

విష్ణు విశాల్‌ (Vishnu Vishal) కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘మట్టి కుస్తీ’ (Matti Kusthi). ఐశ్వర్య లక్ష్మి కథానాయిక. చెల్లా అయ్యావు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ కథానాయకుడు రవితేజతో కలిసి విష్ణు విశాల్‌ స్వయంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ని గురువారం కథానాయకుడు రవితేజ విడుదల చేశారు. ‘‘గ్రామీణ నేపథ్యంలో సాగే కథ ఇది. విష్ణు విశాల్‌ మల్లయోధుడిగా తెరపై సందడి చేస్తారు. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. డిసెంబరులో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామ’’ని సినీ వర్గాలు తెలిపాయి. ఈ చిత్రానికి సంగీతం: జస్టిన్‌ ప్రభాకరన్‌, ఛాయాగ్రహణం: రిచర్డ్‌ ఎం.నాథన్‌.


ఈఫిల్‌ టవర్‌ సాక్షిగా ఐ లవ్‌ యు

అందమైన ఈఫిల్‌ టవర్‌ సాక్షిగా అంతకంటే అందమైన అమ్మాయికి తన ప్రేమను వ్యక్తం చేసి తనను పెళ్లి చేసుకోమని కోరుతున్నాడు ఓ ప్రేమికుడు. అతడే వ్యాపారవేత్త సోహైల్‌ కతురియా. అందాల కథానాయిక హన్సికను (Hansika) ఆయన వివాహం చేసుకోనున్నారు. ఇందులో భాగంగా నిశ్చితార్థం కార్యక్రమాన్ని కాస్త వైవిధ్యంగా ప్లాన్‌ చేశారు సోహైల్‌. ఈఫిల్‌ టవర్‌కు దగ్గర్లో ఉన్న ఓ ప్రదేశంలో పువ్వులు, కొవ్వొత్తుల నడుమ ‘మ్యారీ మీ’ అంటూ అలకరించి వాటి మధ్యలో హన్సికకు తన ప్రేమను వ్యక్తం చేశారు సోహెల్‌. హన్సిక ఈ ఫొటోలను ఇన్‌స్టాలో పంచుకుంది. డిసెంబరు 4న రాజస్థాన్‌లో వీళ్ల పెళ్లి జరిగే అవకాశం ఉంది.


మెర్క్యురీ సూరి

‘తిమ్మరుసు’ తర్వాత కథానాయకుడు సత్యదేవ్‌ (Satyadev) - దర్శకుడు శరణ్‌ కొప్పిశెట్టి కలిసి చేస్తున్న చిత్రం ‘ఫుల్‌బాటిల్‌’ (Full Bottle). ఎస్‌.డి.కంపెనీతో కలిసి స్రవంత్‌ రామ్‌ క్రియేషన్స్‌ పతాకంపై రామాంజనేయులు జవ్వాజి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో సత్యదేవ్‌ పోషించిన మెర్క్యూరీ సూరి పాత్రకి సంబంధించిన లుక్‌ని బుధవారం విడుదల చేశారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: సుజాత సిద్ధార్థ్‌.


‘భేడియా’ హంగామా

నిర్మాత దినేశ్‌ విజన్‌ హారర్‌ కామెడీ ప్రపంచంలో భాగంగా రూపుదిద్దుకున్న చిత్రం ‘భేడియా’ (Bhediya). వరుణ్‌ ధావన్‌ కథానాయకుడు. కృతిసనన్‌ కథానాయిక.   అమర్‌ కౌశిక్‌ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఈ నెల 25న హిందీతోపాటు, తమిళం, తెలుగు భాషల్లోనూ ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగులో గీత ఫిల్మ్‌ డిస్ట్రిబ్యూషన్‌ సంస్థ విడుదల చేస్తోంది. ‘‘తోడేలు కాటుకు గురైన భాస్కర్‌ అనే యువకుడిగా వరుణ్‌ ధావన్‌... డాక్టర్‌ అనిక పాత్రలో కృతిసనన్‌ నటించిన చిత్రమిది. నిర్మాతలు అల్లు అరవింద్‌, బన్నీ వాస్‌ మరోసారి కథాబలం ఉన్న ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నార’’ని సినీ వర్గాలు తెలిపాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని