Cinema News: సంక్షిప్త వార్తలు(7)

బాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు సల్మాన్‌ఖాన్‌, రేవతిలు గతంలో ‘లవ్‌’ అనే ప్రేమకథా చిత్రంలో నటించారు. అందులోని ‘సాథియా.. తునే క్యా కియా..’ అనే పాట ఉత్తరాదిని ఊపేసింది.

Updated : 28 Nov 2022 07:12 IST

32ఏళ్ల తర్వాత..

బాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు సల్మాన్‌ఖాన్‌ (Salman Khan), రేవతిలు (Revathi) గతంలో ‘లవ్‌’ అనే ప్రేమకథా చిత్రంలో నటించారు. అందులోని ‘సాథియా.. తునే క్యా కియా..’ అనే పాట ఉత్తరాదిని ఊపేసింది. 32 ఏళ్ల తర్వాత యశ్‌రాజ్‌ఫిల్మ్స్‌ నిర్మిస్తున్న యాక్షన్‌ చిత్రం ‘టైగర్‌ 3’ (Tiger 3)లో వీరిద్దరూ తెర పంచుకోనున్నారు. ‘ముప్ఫై రెండేళ్ల తర్వాత సల్మాన్‌ఖాన్‌, రేవతిలు ఒక సినిమాలో నటించనున్నారు. రేవతి పాత్ర వివరాలు ప్రస్తుతానికి సస్పెన్స్‌’ అంటూ ఓ మీడియా సంస్థ ప్రతినిధి ఆదివారం ట్వీట్‌ చేశారు. వచ్చే ఏడాది దీపావళికి విడుదల కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. దీనికి మనీష్‌శర్మ దర్శకుడు. ‘ఏక్‌ థా టైగర్‌’, ‘టైగర్‌ జిందా హై’ సిరీస్‌లో వస్తున్న మూడో చిత్రం ఇది. ఇందులో సల్మాన్‌కి జోడీగా కత్రినా కైఫ్‌ నటిస్తుండగా.. రణ్‌వీర్‌ షోరే, ఇమ్రాన్‌ హష్మీ, విశాల్‌ జెత్వా కీలక పాత్రలు పోషిస్తున్నారు. షారుక్‌ ఖాన్‌ ఓ అతిథి పాత్రలో మెరవనున్నారు.


బడేమియాకి జోడీగా?

క్షయ్‌కుమార్‌ (Akshay Kumar), టైగర్‌ష్రాఫ్‌ (Tiger Shroff), జాన్వీకపూర్‌లు (Janhvi Kapoor) ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘బడేమియా.. ఛోటేమియా’ (Bade Miyan Chote Miyan). అలీ అబ్బాస్‌ జఫార్‌ దర్శకుడు. ఈ రొమాంటిక్‌, కామెడీ యాక్షన్‌ థ్రిల్లర్‌లో రెండో కథానాయికగా మాజీ ప్రపంచ సుందరి మానుషి చిల్లర్‌ (Manushi Chillar) నటించనున్నట్టు సినీవర్గాలు తాజాగా ప్రకటించాయి. టైగర్‌ ష్రాఫ్‌కి జోడీగా జాన్వీకపూర్‌ ఆడి పాడనుందని గతంలోనే వెల్లడించారు. పూజా ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై ఈ సినిమాని వసూ భగ్నానీ, జక్కీ భగ్నానీ నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 15 నుంచి చిత్రీకరణ మొదలుకానున్నట్టు సమాచారం. డిసెంబరులో విడుదల చేయనున్నట్టు చిత్రవర్గాలు తెలిపాయి. ఇండియాలో కొంతభాగం షూటింగ్‌ జరిపిన తర్వాత.. ఏకధాటిగా వందరోజులపాటు ఐరోపా, యూఏఈలలో ఈ చిత్రం షూటింగ్‌ జరగనుంది.


థ్రిల్‌ పంచే ‘అథర్వ’

కార్తీక్‌ రాజు (Karthik Raju) కథానాయకుడిగా మహేష్‌ రెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘అథర్వ’ (Atharva). సుభాష్‌ నూతలపాటి నిర్మించారు. సిమ్రాన్‌ చౌదరి కథానాయిక. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఏక కాలంలో రూపొందుతోన్న ఈ సినిమా ఇటీవలే చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆదివారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. కార్తీక్‌ రాజు మాట్లాడుతూ.. ‘‘మంచి సినిమా చేయాలని ఎదురు చూస్తున్న సమయంలో ఈ కథ విన్నా. బాగా నచ్చడంతో.. ఇందులో భాగమయ్యా. శ్రీచరణ్‌ పాకాల మంచి సంగీతాన్ని అందించారు’’ అన్నారు. ‘‘యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన ఇన్వెస్టిగేషన్‌ థ్రిల్లర్‌ ఇది. చాలా కొత్తగా ఉంటుంది’’ అన్నారు దర్శకుడు మహేష్‌. నిర్మాత సుభాష్‌ మాట్లాడుతూ.. ‘‘సినిమా ఫిబ్రవరిలో విడుదల చేయనున్నాం’’ అన్నారు.


అందరికీ నచ్చే ‘శాసనసభ’

ఇంద్రసేన, ఐశ్వర్యరాజ్‌ జంటగా వేణు మడికంటి తెరకెక్కించిన పాన్‌ ఇండియా చిత్రం ‘శాసనసభ’ (Sasanasabha). తులసీరామ్‌ సాప్పని, షణ్ముగం సాప్పని సంయుక్తంగా నిర్మించారు. రాజేంద్రప్రసాద్‌, సోనియా అగర్వాల్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా డిసెంబరు 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆదివారం హైదరాబాద్‌లో ట్రైలర్‌ విడుదల వేడుక నిర్వహించారు. ఏపీ మంత్రి రోజా, నిర్మాత సతీష్‌ వేగేశ్న, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్‌, దర్శకుడు చిన్నికృష్ణ ముఖ్య అతిథులుగా పాల్గొని.. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ ట్రైలర్లు విడుదల చేశారు. అనంతరం మంత్రి రోజా మాట్లాడుతూ.. ‘‘ట్రైలర్‌ ప్రభావవంతంగా ఉంది. ఇందులో రాజేంద్రప్రసాద్‌ మంచి పాత్ర పోషించారు. ఇంద్రసేనని చూసి.. యష్‌ వచ్చాడేమో అనుకున్నా. ఆయన చక్కగా నటించార’’న్నారు. ‘‘సినిమా విడుదలయ్యాక మా ‘శాసనసభ’లో జరిగే దాని గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటారు’’ అన్నారు దర్శకుడు వేణు. ‘‘ఈ సినిమాకి సంగీతంతో ప్రాణం పోశారు రవి బస్రూర్‌’’ అన్నారు ఇంద్రసేన. ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్‌, రాఘవేంద్రరెడ్డి, రవి బస్రూర్‌, ఐశ్వర్య తదితరులు పాల్గొన్నారు.


ఇది ఓ భావోద్వేగ ప్రయాణం

వీఆర్‌ఎల్‌ కంపెనీ వ్యవస్థాపకుడు.. పద్మశ్రీ విజయ్‌ శంకేశ్వర్‌ జీవిత కథతో తెరకెక్కిన పాన్‌ ఇండియా చిత్రం ‘విజయానంద్‌’. టైటిల్‌ పాత్రను నిహాల్‌ రాజ్‌పూత్‌ పోషించారు. రిషికా శర్మ తెరకెక్కించారు. ఆనంద్‌ శంకేశ్వర్‌ నిర్మాత. సిరి ప్రహ్లాద్‌ కథానాయిక. అనంత నాగ్‌, భరత్‌ బోపన తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా డిసెంబరు 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఆదివారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం నిర్వహించారు. నిహాల్‌ మాట్లాడుతూ.. ‘‘విజయ్‌ శంకేశ్వర్‌.. ఆయన తనయుడు ఆనంద్‌ శంకేశ్వర్‌ పేరు మీదుగా ‘విజయానంద్‌’ (Vijayanand) టైటిల్‌ పెట్టాం. తండ్రీకొడుకుల అనుబంధాన్ని.. వారి ప్రయాణాన్ని ఇందులో చూపిస్తున్నాం. ఓ సామాన్యుడిగా ప్రయాణాన్ని ప్రారంభించిన విజయ్‌.. దేశంలోనే పెద్దదైన లాజిస్టిక్‌ కంపెనీ అధినేతగా ఎలా ఎదిగారు? ఈ క్రమంలో ఆయనకు ఎదురైన సవాళ్లేంటి? అన్నది చిత్ర కథాంశం. ఇందులో నా పాత్ర మూడు కోణాల్లో కనిపిస్తుంది’’ అన్నారు. ‘‘మహానటి’ స్ఫూర్తితోనే.. మేము ఈ సినిమా తెరకెక్కించాô. అవకాశమిచ్చిన విజయ్‌ శంకేశ్వర్‌కు కృతజ్ఞతలు’’ అన్నారు దర్శకురాలు రిషికా. ‘‘మా నాన్న ప్రయాణం 1950లో మొదలైంది. 1976లో ఒక ట్రక్కుతో ప్రయాణం మొదలై.. ఇప్పుడు ఐదు వేలకు చేరింది. నాన్నది ఓ స్ఫూర్తిదాయక ప్రయాణం’’ అన్నారు ఆనంద్‌ శంకేశ్వర్‌. కార్యక్రమంలో సిరి, రాంబాబు గోసాల, భరత్‌, లక్ష్మణ్‌, అనీష్‌ కురివిల్లా తదితరులు పాల్గొన్నారు.


చెప్పాలని ఉంది.. నీకోసం!

‘నీ కోసం నేనే కదిలాకా... ఈ లోకం మొత్తం వెదికాక... ఏ దూరం నన్ను ఆపేది లేక.. పంపిస్తుందేమో నీ దాకా...’ అంటూ ఓ కుర్రాడు పాడుకున్న పాట ఎవరి కోసమో తెలియాలంటే ‘చెప్పాలని ఉంది’ (Cheppalani Vundi) చూడాల్సిందే. యష్‌ పూరి, స్టెఫీ పటేల్‌ జంటగా నటించిన చిత్రమది. ఒక మాతృభాష కథ అనేది ఉపశీర్షిక. అరుణ్‌ భారతి.ఎల్‌ దర్శకత్వం వహించారు. వాకాడ అంజన్‌కుమార్‌, యోగేష్‌ కుమార్‌ నిర్మాతలు. సూపర్‌ గుడ్‌ ఫిలింస్‌ పతాకంపై ఆర్‌.బి.చౌదరి సమర్పిస్తున్నారు. డిసెంబరు 9న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సినిమాలోని ‘నీకోసం...’ పాటని ఇటీవలే విడుదల చేశారు. అస్లాం కేయి స్వరకల్పనలోని ఈ గీతాన్ని హరిచరణ్‌ ఆలపించారు. ‘‘ప్రేమికుల ఎడబాటు నేపథ్యంలో సాగే గీతం ఇది. మనసుల్ని హత్తుకునే ఈ పాట విడుదలైన తర్వాత శ్రోతల నుంచి మంచి స్పందన లభించింది. తెరపై యష్‌, స్టెఫీ మధ్య కెమిస్ట్రీ కూడా ఆకట్టుకుంటుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌ ప్రేక్షకుల్లో అంచనాల్ని పెంచింద’’ని సినీవర్గాలు తెలిపాయి. సునీల్‌, సత్య, పృథ్వీ, మురళీశర్మ, తనికెళ్ల భరణి తదితరులు నటించిన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: ఆర్‌.పి.


మూడో దృశ్యం కోసం...

హిందీలో ఇటీవలే ‘దృశ్యం 2’ (Drishyam 3) విడుదలై విశేషంగా ఆదరణ పొందుతోంది. విజయవంతమైన ఈ ఫ్రాంచైజీకి ఆద్యుడైన మలయాళ దర్శకుడు జీతూ జోసెఫ్‌ మూడో దృశ్యం కోసం ఇప్పటికే రంంలోకి దిగినట్టు తెలుస్తోంది. హిందీలో రెండో చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడైన అభిషేక్‌ పాఠక్‌ మాటలు కూడా అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. మూడో సినిమా కోసం ప్రేక్షకుల నుంచి డిమాండ్‌ గట్టిగా వినిపిస్తోంది, కచ్చితంగా ఆ సినిమా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. థ్రిల్లర్‌ కథలతో రూపొందుతున్న ఈ చిత్రాల్ని ఈసారి అన్ని భాషల్లో ఒకేసారి విడుదల చేసే వ్యూహాన్ని రచిస్తున్నట్టు తెలిసింది. ప్రేక్షకుల్ని కథతో మరింతగా థ్రిల్‌ చేయడానికి, మంచి వసూళ్లని రాబట్టడానికి ఇదే సరైన ప్రణాళిక అని దర్శకనిర్మాతలు ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఈ చిత్రాల్ని మలయాళంలో మోహన్‌లాల్‌, తెలుగులో వెంకటేష్‌ చేస్తున్నారు. హిందీలో అజయ్‌ దేవగణ్‌ కథానాయకుడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని