Cinema News: సినీ ముచ్చట్లు.. కొత్త సినిమా విశేషాలు

తొలి చిత్రం ‘విక్కీ డోనర్‌’తో మంచి విజయాన్ని అందుకొని ఆ తర్వాత కూడా వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ స్టార్‌గా ఎదిగాడు ఆయుష్మాన్‌ ఖురానా. ‘బధాయి హో’ చిత్రానికి జాతీయ ఉత్తమ నటుడి పురస్కారం కూడా గెలుచుకున్నాడు.

Updated : 04 Dec 2022 07:27 IST

ఆ దెబ్బకు నా అహంకారం ఎగిరిపోయింది

తొలి చిత్రం ‘విక్కీ డోనర్‌’తో మంచి విజయాన్ని అందుకొని ఆ తర్వాత కూడా వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ స్టార్‌గా ఎదిగాడు ఆయుష్మాన్‌ ఖురానా (Ayushmann Khurrana). ‘బధాయి హో’ చిత్రానికి జాతీయ ఉత్తమ నటుడి పురస్కారం కూడా గెలుచుకున్నాడు. బుల్లితెరపై నుంచి సినిమాల్లోకి అడుగుపెట్టి తొలి సినిమా హిట్‌ కావడంతో ఆయుష్మాన్‌లో అహంకారం మొదలైంది. ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు. ‘‘నా తొలి సినిమా ‘విక్కీడోనర్‌’ హిట్‌ కాగానే నాలో అహంకారం మొదలైంది. ఇక నాకు తిరుగులేదు అనుకున్నాను. కానీ నేను ఆశించినస్థాయిలో కథలు నా వద్దకు రాలేదు. మళ్లీ ‘దమ్‌ లగాకే హైసా’ వచ్చే వరకూ సరైన హిట్‌ దక్కలేదు. తొలి సినిమా విజయంతో మొదలైన అహంకారం ‘దమ్‌ లగాకే...’విడుదల నాటికి మొత్తం పోయింది. ఎంత ఎదిగినా కాళ్లు ఉండాల్సింది భూమి మీదే అనే విషయం అర్థమైంది’’అని చెప్పారు ఆయుష్మాన్‌. ఆయన నటించిన ‘యాక్షన్‌ హీరో’ ఇటీవలే విడుదలైంది. త్వరలోనే ‘డ్రీమ్‌ గర్ల్‌ 2’తో ఆయన సందడి చేయనున్నారు.


అది ఎంత నిజమో.. ఇదీ అంతే!

ఆది సాయికుమార్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘టాప్‌గేర్‌’ (Top Gear). రియా సుమన్‌ కథానాయిక. కె.శశికాంత్‌ దర్శకత్వం వహిస్తున్నారు. కె.వి.శ్రీధర్‌రెడ్డి నిర్మాత. ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా టీజర్‌ని ప్రముఖ దర్శకుడు మారుతి విడుదల చేశారు. ‘విధిరాత నుంచి విష్ణుమూర్తి కూడా తప్పించుకోలేకపోయాడన్నది ఎంత నిజమో.. నా నుంచి నువ్వు తప్పించుకోలేవన్నది కూడా అంతే నిజం’ అంటూ మొదలై ఆసక్తిని రేకెత్తిస్తుందీ టీజర్‌. కథానాయకుడు టాక్సీ డ్రైవర్‌ పాత్రలో కనిపిస్తారు. యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న చిత్రమిది. ‘‘థ్రిల్లింగ్‌ అంశాలతో ఆద్యంతం ఆసక్తికరంగా సాగే చిత్రమిది. ఆది సాయికుమార్‌ కొత్తగా కనిపిస్తారు. ఛాయాగ్రాహకుడు సాయిశ్రీరామ్‌ విజువల్స్‌, హర్షవర్ధన్‌ రామేశ్వర్‌ సంగీతం చిత్రానికి ప్రధాన ఆకర్షణ. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, సిద్‌ శ్రీరామ్‌ ఆలపించిన పాట సినిమాపై మరిన్ని అంచనాల్ని పెంచాయి. అందుకు తగ్గట్టే సినిమా ఉంటుంద’’ని చిత్రవర్గాలు చెప్పాయి. బ్రహ్మాజీ, సత్యం రాజేష్‌, మైమ్‌ గోపి, నర్రా, శత్రు, బెనర్జీ, చమ్మక్‌ చంద్ర, హేమంత్‌ తదితరులు నటించారు.


వార్‌ చిత్రంలో నటిస్తారా?

విక్కీ కౌశల్‌ (Vicky Kaushal) ఆచితూచి కథల్ని ఎంచుకుంటున్నారు. ప్రస్తుతం లక్ష్మణ్‌ ఉత్రేకర్‌ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఓ చిన్న పట్టణం నేపథ్యంలో సాగే కథ ఇది. ఇప్పుడు మరోసారి లక్ష్మణ్‌తో కలిసి పనిచేయడానికి విక్కీ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. కానీ ఈసారి చిన్న సినిమా కాకుండా భారీస్థాయి కథను విక్కీకి వినిపించారట లక్ష్మణ్‌. వార్‌ నేపథ్యంలో సాగే ఈ కథను భారీస్థాయిలో తెరపై చూపించే అవకాశం ఉండటంతో విక్కీ కూడా సూత్రప్రాయంగా అంగీకరించినట్లు సమాచారం. మ్యాడ్‌డాక్‌ ఫిలిమ్స్‌పై దినేష్‌ విజన్‌ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ‘భారీ స్థాయి హంగులున్న కథ కావడంతో లక్ష్మణ్‌ ప్రత్యేకంగా స్క్రిప్టుని సిద్ధం చేస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది’ అని లక్ష్మణ్‌ సన్నిహిత వర్గాలు చెప్పినట్లు సమాచారం.


జమిందారీ వ్యవస్థపై పోరు

ఆదిత్య భరద్వాజ్‌, మహీరా జంటగా నటించిన చిత్రం ‘విప్లవ సేనాని వీర గున్నమ్మ’. గూన అప్పారావు స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. స్వాతంత్య్రానికి పూర్వం జరిగిన ఓ యథార్థ సంఘటన ఆధారంగా దీన్ని రూపొందించారు. ఈ సినిమా ప్రస్తుతం సెన్సార్‌ పనుల్లో ఉంది. ఈ సందర్భంగా దర్శక నిర్మాత అప్పారావు మాట్లాడుతూ.. ‘‘శ్రీకాకుళం జిల్లాలోని మందస ప్రాంతంలో జమిందారీ వ్యవస్థపై జరిగిన వ్యతిరేక పోరాటం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. 1940 ఏప్రిల్‌ 1న జరిగిన పోరాటంలో ఐదుగురు రైతులతో పాటు ఇద్దరు పోలీసులు మృతి చెందారు. ఆ తర్వాత మరో 15రోజుల్లో తీవ్రంగా గాయపడ్డ 25మంది రైతులు, ఏడుగురు పోలీసులు కన్నుమూశారు. దీంతో ఆ పోరాటంలో పాల్గొన్న 42మంది రైతులకు బ్రిటిష్‌ ప్రభుత్వం మరణ శిక్ష విధించింది. ఈ నేపథ్యాన్ని సినిమాలో ఎంతో సహజంగా చూపించనున్నాం. ఈ చిత్రాన్ని డిసెంబరు మూడో వారంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ సినిమాకి సంగీతం: వందేమాతరం శ్రీనివాస్‌, ఛాయాగ్రహణం: ఇజాజ్‌ వెంకట్‌ రవి.


సందేశాత్మక ప్రేమకథ

‘సంతోషం’, ‘మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌’ లాంటి విజయవంతమైన చిత్రాలతో మెప్పించిన దర్శకుడు కె.దశరథ్‌. ఇప్పుడాయన కథతో నిర్మితమైన చిత్రం ‘లవ్‌ యూ రామ్‌’ (Love You Ram). రోహిత్‌ బెహల్‌, అపర్ణ జనార్దనన్‌ జంటగా నటించారు. డీవై చౌదరి దర్శకుడు. ఆయన దశరథ్‌తో కలిసి నిర్మించారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను దర్శకుడు వి.వి.వినాయక్‌, థీమ్‌ వీడియోను తెలంగాణ ఎమ్మెల్సీ ఎల్‌.రమణ శనివారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. అనంతరం వినాయక్‌ మాట్లాడుతూ.. ‘‘నాకు మంచి మిత్రుడు దశరథ్‌. తను కథ రాసి.. చౌదరితో కలిసి తొలిసారి నిర్మాతగా మారారు. ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘దశరధ్‌ చాలా స్ఫూర్తిని నింపే కథ చెప్పారు. ఈతరం వాళ్లకు కావాల్సిన సందేశం ఈ సినిమాలో ఉంది. ప్రేమించడమే జీవితమని నమ్మే అమ్మాయి.. నమ్మించడమే జీవితమని భావించే అబ్బాయి మధ్య జరిగే ప్రేమకథ ఇది. మారేడుమిల్లి, ఖమ్మం, నార్వే లాంటి ప్రదేశాల్లో చిత్రీకరణ జరిపాం. దీన్ని ప్రేక్షకులు ఆదరించాలని కోరుతున్నా’’ అన్నారు చిత్ర దర్శక నిర్మాత డీవై చౌదరి. దర్శకుడు కె.దశరథ్‌ మాట్లాడుతూ.. ‘‘వినాయక్‌ ఇచ్చిన అద్భుతమైన సూచనలతో ఈ కథ సిద్ధం చేశాం. ఆయనకు కృతజ్ఞతలు. ఈ సినిమా కోసం చాలా మంది ప్రతిభ గల యువకులు పని చేశారు. మా ప్రయత్నం అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నా’’ అన్నారు. ఈ కార్యక్రమంలో రోహిత్‌, అపర్ణ, బెనర్జీ, సుధాకర్‌ బొర్రా తదితరులు పాల్గొన్నారు.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని