Cinema News: సినిమా ముచ్చట్లు

బాలీవుడ్‌లో తనకంటూ ఓ పేజీ లిఖించుకున్న దిగ్దర్శకుడు యశ్‌ చోప్రా (Yash Chopra). ‘దీవార్‌’, ‘సిల్‌సిలా’, చాంద్‌నీ’, ‘లమ్హే’, ‘దిల్‌ తో పాగల్‌ హై’, ‘మొహబ్బతే’ ‘ఫనా’లాంటి ఎన్నో మరపురాని ప్రేమకథా చిత్రాలను తెరకెక్కించారాయన.

Updated : 05 Feb 2023 06:58 IST

యశ్‌చోప్రాకి ప్రేమాంజలి..

బాలీవుడ్‌ (Bollywood)లో తనకంటూ ఓ పేజీ లిఖించుకున్న దిగ్దర్శకుడు యశ్‌ చోప్రా (Yash Chopra). ‘దీవార్‌’, ‘సిల్‌సిలా’, చాంద్‌నీ’, ‘లమ్హే’, ‘దిల్‌ తో పాగల్‌ హై’, ‘మొహబ్బతే’ ‘ఫనా’లాంటి ఎన్నో మరపురాని ప్రేమకథా చిత్రాలను తెరకెక్కించారాయన. ఆయన వారసుడు ఆదిత్య చోప్రా యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ పతాకంపై ఎన్నో సినిమాలు నిర్మించి, కొన్నింటికి దర్శకత్వం వహించారు. బాలీవుడ్‌ తెరపై చెరగని ముద్ర వేసిన ఈ ద్వయంలో యశ్‌చోప్రాని స్మరించుకుంటూ.. ఆదిత్య చోప్రా పనితనం వివరిస్తూ ‘ది రొమాంటిక్స్‌’ (The Romantics) పేరుతో దర్శకురాలు స్మృతి ముంద్రా ఓ డాక్యుమెంటరీ సిరీస్‌ రూపొందించారు. ఇందులో ఆ ఇద్దరితో కలిసి పనిచేసిన ఆమిర్‌ఖాన్‌, షారుక్‌ ఖాన్‌, సల్మాన్‌ఖాన్‌, అమితాబ్‌ బచ్చన్‌, రణ్‌బీర్‌ కపూర్‌, హృతిక్‌ రోషన్‌, కాజోల్‌లతో సహా.. ఎందరో నటీనటులు తమ అనుభవాలు పంచుకోనున్నారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న ఈ నాలుగు భాగాల డాక్యుమెంటరీ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇటీవల ట్రైలర్‌ విడుదల చేశారు. ఆ ట్రైలర్‌ని సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటూ ‘నా ఈ డాక్యుమెంటరీ యాభై ఏళ్ల బాలీవుడ్‌ సినిమాకి ఓ స్మృత్యాంజలి. తమ లెన్స్‌ ద్వారా మూడు తరాల నటులను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన ఇద్దరు సినీశిల్పుల వివరాలతో మొదటి భాగం మీ ముందుకొస్తోంది’ అంటూ కామెంట్‌ చేశారు స్మృతి.


‘ఏజెంట్‌’ రాక ఆరోజే

ఈ వేసవికి ‘ఏజెంట్‌’ (Agent)తో సినీప్రియుల్ని పలకరించనున్నారు అఖిల్‌ అక్కినేని (Akhil Akkineni). ఆయన హీరోగా నటిస్తున్న ఈ పాన్‌ ఇండియా చిత్రాన్ని సురేందర్‌ రెడ్డి తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. రామబ్రహ్మం సుంకర నిర్మాత. సాక్షి వైద్య కథానాయిక. మమ్ముట్టి కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాని ఏప్రిల్‌ 28న విడుదల చేయనున్నట్లు శనివారం అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ఓ యాక్షన్‌ గ్లింప్స్‌ను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. అందులో ఓ వ్యక్తి అఖిల్‌ను కుర్చీకి కట్టేసి, ముసుగేసి కొట్టడాన్ని చూపించారు. అతను తను పని చేస్తున్న ఏజెన్సీ గురించి ప్రశ్నించగా.. ‘ఒసామా బిన్‌ లాడెన్‌, గడాఫీ, హిట్లర్‌’ అని అఖిల్‌ బదులివ్వడం ఆసక్తిరేకెత్తించింది. స్టైలిష్‌ స్పై థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రంలో ఆయన శక్తిమంతమైన స్పైగా కనిపించనున్నారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు