Published : 02 Apr 2022 01:43 IST

Mishan Impossible Review: రివ్యూ: మిషన్‌ ఇంపాజిబుల్‌

చిత్రం: మిష‌న్ ఇంపాజిబుల్‌; న‌టీన‌టులు: తాప్సీ ప‌న్ను, ర‌వీంద‌ర్ విజ‌య్‌, రోష‌న్‌, భాను ప్రకాష్‌, జైతీర్థ‌, రిష‌బ్ శెట్టి, హ‌రీష్ ప‌రేడి త‌దిత‌రులు; సంగీతం: మార్క్ కె.రాబిన్‌; కూర్పు: ర‌వితేజ గిరిజాల‌; ఛాయాగ్రహ‌ణం: దీప‌క్ యెర‌గ‌రా; ద‌ర్శకుడు: స్వరూప్ ఆర్‌.ఎస్‌.జె; నిర్మాతలు: నిరంజ‌న్ రెడ్డి, అన్వేష్ రెడ్డి; విడుద‌ల తేదీ: 01-04-2022

‘ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ’ చిత్రంతో తొలి అడుగులోనే సినీప్రియుల మెప్పు పొందిన‌ ద‌ర్శకుడు స్వరూప్ ఆర్‌ఎస్‌జే. విభిన్నమైన నాయికా ప్రాధాన్య క‌థ‌లు ఎంచుకుంటూ వ‌రుస విజ‌యాల‌తో దూసుకెళ్తున్న న‌టి తాప్సీ. ఇప్పుడీ ప్రత్యేక‌మైన కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకున్న చిత్రమే ‘మిష‌న్ ఇంపాజిబుల్‌’. ప్రముఖ నిర్మాణ సంస్థ మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ నిర్మించింది. చిత్ర టైటిల్‌కు త‌గ్గట్లుగానే టీజ‌ర్, ట్రైల‌ర్లు ఆస‌క్తిక‌రంగా ఉండ‌టంతో సినీప్రియుల దృష్టి ఈ చిత్రంపై ప‌డింది. మ‌రి ప్రచార చిత్రాల‌తోనే అంత‌గా ఆక‌ట్టుకున్న ఈ సినిమా వెండితెర‌పై ఎలా క‌నిపించింది? చాలా రోజుల త‌ర్వాత తెలుగులో న‌టించిన తాప్సీకి ఈ చిత్రంతో విజ‌యం ద‌క్కిందా?ద‌ర్శకుడు స్వరూప్ ద్వితీయ విఘ్నాన్ని దిగ్విజ‌యంగా దాటాడా? తెలుసుకుందాం ప‌దండి.

క‌థేంటంటే: తిరుప‌తి ద‌గ్గర్లోని వ‌డమాల పేటలో ఉన్న ర‌ఘుప‌తి (హ‌ర్ష రోష‌న్‌), రాఘ‌వ (భాను ప్రకాష్‌), రాజారామ్ (జైతీర్థ‌) అనే ముగ్గురు పిల్లల క‌థ ఇది. ఈ ముగ్గురిని స్నేహం ఒక్కటి చేసింది. వీరివి వేరు వేరు ల‌క్ష్యాలైనా ఆశ‌యం మాత్రం ఒక్కటే.. చాలా ఫేమ‌స్ అవ్వాలి, బోలెడంత డ‌బ్బు సంపాదించాలి. ఈ క‌ల‌ను నిజం చేసుకోవ‌డం కోసం త‌మ అమాయ‌క‌త్వంతో ఓ మిష‌న్ మొద‌లు పెడ‌తారు. మోస్ట్ వాంటెడ్ క్రిమిన‌ల్ దావూద్ ఇబ్రహీంను ప‌ట్టుకొని పోలీస్‌ల‌కు అప్పజెప్పడం, అత‌నిపైనున్న రూ.50 ల‌క్షల రివార్డ్‌ను తెచ్చుకోవ‌డం.. ఇదీ ఆ మిష‌న్ ల‌క్ష్యం. దీనికోస‌మే ముగ్గురు ఇంట్లో వాళ్లకు చెప్పకుండా ముంబ‌యి బ‌య‌లుదేరుతారు. కానీ, దారిత‌ప్పి బెంగ‌ళూరులో దిగుతారు. మ‌రి ఆ త‌ర్వాత ఏమైంది? దావూద్‌ను ప‌ట్టుకోవాల‌న్న ల‌క్ష్యంతో వ‌చ్చిన ఆ ముగ్గురు పిల్లలతో.. ఇన్వెస్టిగేటివ్ జ‌ర్నలిస్ట్ శైల‌జ (తాప్సీ ప‌న్ను) చేయించిన సాహ‌సాలేంటి? చిన్నపిల్లల అక్రమ‌ర‌వాణా కేసుకు, వీళ్లకు ఉన్న లింకేంటి? అన్నది మిగ‌తా క‌థ‌.

ఎలా సాగిందంటే: పిల్లలు.. అమాయ‌క‌త్వంతో వాళ్లు చేసే సాహ‌సాలు.. ఈ క్రమంలో ఎదుర‌య్యే స‌వాళ్లు.. ఈ త‌ర‌హా క‌థ‌లు తెలుగు తెర‌కు కొత్తేమీ కాదు. అయితే ‘లిటిల్ సోల్జర్స్’ త‌ర్వాత అంత పూర్తి స్థాయిలో పిల్లల చిత్రాలేవీ రాలేదు. ఇప్పుడా లోటును ‘మిష‌న్ ఇంపాజిబుల్’ కాస్త భ‌ర్తీ చేస్తుంద‌నే చెప్పొచ్చు. 2014లో జ‌రిగిన ఓ వాస్తవ సంఘ‌ట‌న ఆధారంగా ఈ చిత్రం తెర‌కెక్కించారు ద‌ర్శకుడు స్వరూప్‌. అండ‌ర్ వ‌ర‌ల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంను ప‌ట్టుకుంటే భారీ మొత్తంలో డ‌బ్బులు ఇస్తామ‌ని పేప‌ర్‌లో వ‌చ్చిన ప్రక‌ట‌న చూసి ప‌ట్నాకు చెందిన ముగ్గురు పిల్లలు ముంబ‌యి వెళ్లారు. ఈ సంఘ‌ట‌న‌కు పిల్లల అక్రమ‌ర‌వాణా అంశాన్ని జ‌త చేసి ఆ క‌థ‌ను వినోదాత్మకంగా తెర‌పై వ‌డ్డించే ప్రయ‌త్నం చేశారు స్వరూప్‌. నిజానికి రెండో సినిమాతోనే ఇలాంటి క‌థ‌తో ప్రయోగం చేయ‌డ‌మంటే కాస్త రిస్కీ వ్యవ‌హార‌మ‌నే చెప్పాలి. పిల్లల్లో దాగి ఉండే అమాయ‌క‌త్వాన్ని స‌రిగ్గా ప‌ట్టుకొని దాన్ని తెర‌పై అంతే స‌హ‌జంగా ఆవిష్కరించ‌గ‌లిగిన‌ప్పుడే సినిమా స‌రిగ్గా వ‌ర్కౌట్‌ అవుతుంది. ఈ విష‌యంలో స్వరూప్ చాలా చోట్ల మెప్పించాడు. ఓ హ‌త్య‌ జరగడం.. ఆ వెంట‌నే చైల్డ్ ట్రాఫికింగ్‌ ముఠా నాయ‌కుడి కోసం శైలు స్కెచ్ వేయ‌డంలాంటి మిష‌న్‌తో సినిమాని ప్రారంభించిన తీరు ఆస‌క్తిరేకెత్తిస్తుంది. ఆ వెంట‌నే ర‌ఘుప‌తి, రాఘ‌వ‌, రాజారాంల క‌థ మొద‌ల‌వుతుంది. ఈ ముగ్గురి నేప‌థ్యాలు.. వారి ప‌రిచ‌య స‌న్నివేశాల‌తో క‌థ‌నం స‌ర‌ద స‌ర‌దాగా ప‌రుగులు తీస్తుంది. ముఖ్యంగా దావూద్‌ను ప‌ట్టుకోవ‌డం కోసం ఆ ముగ్గురు పిల్లలు వేసే స్కెచ్చులు.. ఈ క్రమంలో వాళ్లు ప‌లికే సంభాష‌ణలు.. చేసే అల్లరి.. ప్రతిదీ ప్రేక్షకుల‌కు చ‌క్కటి వినోదాన్ని పంచుతుంది. ఆ ముగ్గురూ ఇంట్లో చెప్పకుండా ముంబ‌యికి బ‌య‌లు దేర‌డం.. దారి త‌ప్పి బెంగళూరుకు చేర‌డం.. అదే స‌మయంలో త‌న మిష‌న్ కోసం బెంగ‌ళూరు వ‌స్తుండ‌గా శైలుకు యాక్సిడెంట్ కావ‌డం.. ఇలా ఆస‌క్తిక‌రంగా ప్రథమార్ధం ముగుస్తుంది.

నిజానికి ప్రథమార్ధంలో క‌థ‌నం చాలా వ‌ర‌కూ లాజిక్‌కు దూరంగా సాగినా.. పిల్లలు పంచే న‌వ్వుల మ‌ధ్య అది పెద్దగా క‌నిపించ‌దు. కానీ, ద్వితీయార్ధంలో మాత్రం ఆ లోపం స్పష్టంగా క‌నిపిస్తుంది. దావూద్‌ను ప‌ట్టుకోవ‌డం కోసం ముగ్గురు పిల్లలు పడే క‌ష్టాలు.. చైల్డ్ ట్రాఫికింగ్ ముఠాని ప‌ట్టుకోవ‌డం కోసం శైలు చేసే ప్రయ‌త్నాలు చాలా నిరుత్సాహంగా సాగుతాయి. రాజారామ్ కిడ్నాప్ అవ్వడం, అదే స‌మ‌యంలో శైలుని ర‌ఘుప‌తి, రాఘ‌వ క‌ల‌వ‌డంతో క‌థ కాస్త ఆస‌క్తిక‌రంగా మారుతుంది. ఇక పిల్లల స‌హాయంతో ముఠాని ప‌ట్టుకునేందుకు శైలు వేసే ఎత్తుగ‌డ‌లు చాలా సాదాసీదాగా అనిపిస్తాయి. ఏ ఒక్క ఎపిసోడ్‌లోనూ సంఘ‌ర్షణ క‌నిపించ‌దు. ఇది ముగింపు పైనా తీవ్ర ప్రభావం చూపించింది.

ఎవ‌రెలా చేశారంటే: తాప్సీ పాత్ర ఈ చిత్రానికి ప్రధాన ఆక‌ర్షణ. నిజానికి ఆ పాత్రకు క‌థ‌లో ఉన్న ప్రాధాన్యత చాలా త‌క్కువే. న‌ట‌న ప‌రంగానూ పెద్దగా స్కోప్ లేదు. కాక‌పోతే ఆ పాత్రను తాప్సీ చేయ‌డం వ‌ల్ల సినిమాకి స్టార్ బ‌లం తోడైన‌ట్లయింది. నిజానికి ఈ పాత్రను మ‌రింత బ‌లంగా తీర్చిదిద్దుకొని ఉంటే బాగుండేది. ర‌ఘుప‌తి, రాఘ‌వ‌, రాజారాం పాత్రలు సినిమాకి బ‌లంగా నిలిచాయి. ఆయా పాత్రల్లో ముగ్గురు పిల్లల న‌ట‌న ప్రతిఒక్కరినీ ఆక‌ట్టుకుంటుంది. స్వరూప్ ఎంచుకున్న క‌థా నేప‌థ్యం బాగున్నా.. దాన్ని ఆస‌క్తిక‌రంగా తీర్చిదిద్దుకోవ‌డంలో పూర్తిగా త‌డ‌బ‌డ్డాడు. ద్వితీయార్ధం పూర్తిగా తేలిపోయింది. ర‌వీంద‌ర్ విజ‌య్, హ‌రీష్ పేర‌డి త‌దిత‌రుల పాత్రలు ప‌రిధి మేరకు ఉంటాయి. మార్క్ కె.రాబిన్ నేప‌థ్య సంగీతం బాగుంది. దీప‌క్ ఛాయాగ్రహ‌ణం ఆక‌ట్టుకుంటుంది. క‌థ‌కు త‌గ్గట్లుగా నిర్మాణ విలువ‌లు బాగున్నాయి.

బ‌లాలు

క‌థా నేప‌థ్యం
తాప్సీ, ముగ్గురు పిల్లల నటన, వినోదం

బ‌ల‌హీన‌త‌లు
ఊహ‌కు త‌గ్గట్లుగా సాగే క‌థ‌నం
- ద్వితీయార్ధం

చివ‌రిగా: కాసేపు కాల‌క్షేపాన్నిచ్చే పిల్లల మిష‌న్‌

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని