Cinema News: సంక్షిప్త వార్తలు

డెడ్‌పూల్‌ చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లను రాబట్టాయి. ఈ సిరీస్‌ చిత్రాల్లో వస్తోన్న మూడో చిత్రం ‘డెడ్‌పూల్‌ 3’. ర్యాన్‌ రైనాల్డ్స్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న ఈ సినిమాని 2024లో ప్రేక్షకుల ముందుకు తీసుకురాన్నుట్లు ఓ వీడియో ద్వారా

Updated : 29 Sep 2022 07:17 IST

డెడ్‌పూల్‌ 3.. 2024లో

డెడ్‌పూల్‌ చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లను రాబట్టాయి. ఈ సిరీస్‌ చిత్రాల్లో వస్తోన్న మూడో చిత్రం ‘డెడ్‌పూల్‌ 3’ (Deadpool 3). ర్యాన్‌ రైనాల్డ్స్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న ఈ సినిమాని 2024లో ప్రేక్షకుల ముందుకు తీసుకురాన్నుట్లు ఓ వీడియో ద్వారా ప్రకటించారు ర్యాన్‌ రైనాల్డ్స్‌. ఈసారి ఆయనతో పాటు హగ్‌ జాక్‌మ్యాన్‌ కూడా ఓ కీలక పాత్రలో నటించనున్నట్లు తెలిపారు. 2017లో వచ్చిన ‘లోగాన్‌’లో జాగ్‌ పోషించిన వాల్వరైన్‌ పాత్ర చనిపోతుంది. ఇప్పుడు మూడో డెడ్‌పూల్‌లో ఆయన అదే పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. స్వాన్‌ లెవీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.


కిల్లర్‌తో కాఫీ కబుర్లు

ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్‌.పి.పట్నాయక్‌ మళ్లీ మెగాఫోన్‌ అందుకున్నారు. ‘కాఫీ విత్‌ ఎ కిల్లర్‌’ (Coffee With A Killer) పేరుతో ఓ చిత్రం తెరకెక్కించారు. శ్రీనివాస్‌ రెడ్డి, రవి బాబు, సత్యం రాజేష్, రఘుబాబు తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. సెవెన్‌ హిల్స్‌ సతీష్‌ నిర్మించారు. ఈ చిత్ర ట్రైలర్‌ను దర్శకుడు అనిల్‌ రావిపూడి ఇటీవల విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘కొవిడ్‌ తర్వాత నుంచి కథా బలమున్న చిత్రాలకే ఆదరణ కనిపిస్తోంది. ఇప్పుడలాంటి ఛాయలు ఈ చిత్ర ట్రైలర్‌లో కనిపిస్తున్నాయి. ప్రచార చిత్రం చాలా వినోదాత్మకంగా ఉంది. నిజంగా ఓ కాఫీ షాప్‌లో ఇన్ని జరుగుతుంటాయి కాబోలు అని అర్థమైంది. ఈ చిత్రం విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘వినోదంతో నిండిన థ్రిల్లర్‌ కథ ఇది. సమష్ఠి కృషితో చిత్రాన్ని చక్కగా పూర్తి చేశాం. ఈ సినిమాలో ఓ సీక్రెట్‌ ఉంది. దాన్ని ప్రీరిలీజ్‌ వేడుకలో బయటపెడతాం. ఒక విభిన్నమైన.. కొత్తదనమున్న కథను ప్రయత్నించాం’’ అన్నారు చిత్ర దర్శకుడు ఆర్‌.పి.పట్నాయక్‌. చిత్ర నిర్మాత మాట్లాడుతూ.. ‘‘చిత్రీకరణ పూర్తయింది. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అన్నారు.


చైతూతో ఢీ

నాగచైతన్య (Naga Chaitanya) కథానాయకుడిగా వెంకట్‌ ప్రభు (Venkat Prabhu) దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ఓ ద్విభాషా చిత్రం రూపొందుతోంది. శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. కృతి శెట్టి (Krithi Shetty) కథానాయిక. ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇప్పుడీ చిత్రం కోసం ప్రతినాయకుడిగా అరవింద్‌ స్వామిని(Arvind Swamy) ఎంపిక చేశారని సమాచారం. ఈ ప్రాజెక్ట్‌ కోసం ఆయన ఇప్పటికే అధికారికంగా సంతకాలు చేసినట్లు తెలిసింది. త్వరలో మైసూర్‌లో ప్రారంభం కానున్న కొత్త షెడ్యూల్‌తో అరవింద్‌ ఈ చిత్ర సెట్లోకి అడుగు పెట్టనున్నట్లు తెలుస్తోంది. విభిన్నమైన యాక్షన్‌ థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందుతోన్న చిత్రమిది. ప్రియమణి, జీవా కీలక పాత్రల్లో కనిపించనున్నట్లు ప్రచారం వినిపిస్తోంది. అరవింద్‌ స్వామి చివరిగా తెలుగులో రామ్‌చరణ్‌ ‘ధృవ’ చిత్రంలో ప్రతినాయకుడిగా కనిపించి.. మురిపించారు. ఈ సినిమా బాక్సాఫీస్‌ ముందు విజయం సాధించింది.


తిరుపతిలో చకచకా..

‘భారతీయుడు2’ (Indian 2) చిత్రాన్ని శరవేగంగా పూర్తి చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నారు కమల్‌హాసన్‌ (Kamal Haasan). ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని శంకర్‌ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇది ‘భారతీయుడు’ సినిమాకి సీక్వెల్‌గా రూపొందుతోంది. లైకా ప్రొడక్షన్స్, రెడ్‌ జెయింట్‌ మూవీస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కాజల్‌ (Kajal) కథానాయిక. సిద్ధార్థ్, రకుల్‌ ప్రీత్‌ సింగ్, సముద్రఖని తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం తిరుపతి పరిసర ప్రాంతాల్లో శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ షెడ్యూల్‌లో భాగంగా కమల్‌ పోషిస్తున్న సేనాపతి పాత్రకు సంబంధించిన ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్స్‌ తెరకెక్కిస్తున్నట్లు తెలిసింది. దీంట్లో కాజల్‌తో పాటు ఇతర ప్రధాన తారాగణం కూడా పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్‌ మరికొన్ని రోజుల పాటు తిరుపతి పరిసర ప్రాంతాల్లోనే కొనసాగనుంది. ఈ చిత్రానికి సంగీతం: అనిరుద్, ఛాయాగ్రహణం: రత్నవేలు, రవి వర్మన్‌.


కార్తికి జోడీగా రెండోసారి?

ఇటు దక్షిణాదిలోనూ.. అటు ఉత్తరాదిలోనూ వరుస సినిమాలతో జోరు చూపిస్తోంది నటి రష్మిక (Rashmika). ప్రస్తుతం ఆమె హిందీలో నటించిన ‘గుడ్‌బై’, ‘మిషన్‌ మజ్ను’ చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. తెలుగులో ‘పుష్ప2’, ‘వారసుడు’ సినిమాల్లో సందడి చేస్తోంది. కాగా, ఇప్పుడామె డైరీలో కొత్తగా మరో చిత్రం చేరినట్లు తెలుస్తోంది. కార్తి కథానాయకుడిగా రాజు మురుగన్‌ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా.. అక్టోబరు తొలి వారంలో పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది. ఇప్పుడీ చిత్రం కోసం నాయికగా రష్మికను ఖరారు చేసినట్లు సమాచారం. రష్మిక - కార్తి గతంలో ‘సుల్తాన్‌’లో కలిసి నటించారు. ఇప్పుడీ చిత్రం కోసం ‘జపాన్‌’ అనే టైటిల్‌ పరిశీలనలో ఉంది.


 


హవీష్‌... ‘ఎస్‌ బాస్‌’

‘భాగమతి’ తర్వాత జి.అశోక్‌ ఆ సినిమాని హిందీలో ‘దుర్గామతి’ పేరుతో తెరకెక్కించారు. ఈ మధ్యలో కొంత విరామం తీసుకున్న ఆయన ఇప్పుడు హవీష్‌ (Havish) కథానాయకుడిగా ‘ఎస్‌ బాస్‌’ (S Boss) అనే సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. కోనేరు సత్యనారాయణ నిర్మాత. ప్రముఖ రచయిత ఆకుల శివ కత, మాటలు సమకూర్చారు. తొలి షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో బ్రహ్మానందం ముఖ్య పాత్ర పోషిసుతన్నారు. అక్టోబర్‌లో రెండో షెడ్యూల్‌ మొదలవుతుందని, త్వరలోనే ఫస్ట్‌ లుక్‌ విడుదల చేస్తామని సినీ వర్గాలు తెలిపాయి. ఈ చిత్రానికి సంగీతం: అనూప్‌ రూబెన్స్, ఛాయాగ్రహణం: సాయిప్రకాశ్‌.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని