Cinema News: సంక్షిప్త వార్తలు(4)

విష్వక్‌ సేన్‌ కథానాయకుడిగా నటిస్తూ.. స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘దాస్‌ కా ధమ్కీ’.

Updated : 25 Nov 2022 07:11 IST

ధమ్కీ ఇచ్చేది ఆరోజే

విష్వక్‌ సేన్‌ (Viswak Sen) కథానాయకుడిగా నటిస్తూ.. స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘దాస్‌ కా ధమ్కీ’ (Dhamki). కరాటే రాజు నిర్మాత. నివేదా పేతురాజ్‌ కథానాయిక. రావు రమేష్‌, రోహిణి, పృథ్వీరాజ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం గురువారం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు విడుదల తేదీతో కూడిన కొత్త పోస్టర్‌ను సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకున్నారు. ఆ పోస్టర్‌లో విష్వక్‌ చేతి కర్ర పట్టుకొని సీరియస్‌గా నడిచొస్తూ కనిపించారు. ‘‘యాక్షన్‌, థ్రిల్లర్‌ అంశాలతో నిండిన రొమాంటిక్‌ కామెడీ చిత్రమిది. చిత్రీకరణ పూర్తయింది. నిర్మాణాంతర పనులు జరుగుతున్నాయి’’ అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ సినిమాకి సంగీతం: లియోన్‌ జేమ్స్‌, కూర్పు: అన్వర్‌ అలీ, ఛాయాగ్రహణం: దినేష్‌ కె.బాబు.


ఆసుపత్రిలో చేరిన కమల్‌హాసన్‌

ప్రముఖ సినీ నటుడు, మక్కల్‌ నీది మయ్యం పార్టీ అధినేత కమల్‌హాసన్‌ (Kamal Haasan) బుధవారం రాత్రి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన చెన్నై పోరూర్‌లోని రామచంద్ర ఆసుపత్రిలో చేరారు. ఆయన జ్వరంతోపాటు దగ్గు, జలుబుతో ఇబ్బంది పడుతున్నారని ఆసుపత్రి వర్గాలు బులిటెన్‌ విడుదల చేశాయి. ఆయన రెండ్రోజుల్లోపు డిశ్చార్జి అవుతారని వెల్లడించాయి. కమల్‌ కొద్దిరోజులుగా విశ్రాంతి లేకుండా ఇండియన్‌-2, బిగ్‌బాస్‌ షూటింగుల్లో బిజీగా ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. బుధవారం ఉదయం హైదరాబాద్‌లో ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాథ్‌ను కలిసిన తర్వాత ఆయన చెన్నై చేరుకున్నారు. అనంతరం అనారోగ్యానికి గురైనట్లుగా సమాచారం.

న్యూస్‌టుడే, వేలచ్చేరి (చెన్నై)


శ్రీలంక అడవులకు పయనం

ప్రముఖ కథానాయకుడు సూర్య 42వ చిత్రం శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా తొలి షెడ్యూల్‌ను గోవా, చెన్నైల్లో పూర్తి చేశారు. కొత్త షెడ్యూల్‌ కోసం సూర్యతో (Suriya) పాటు చిత్రబృందం శ్రీలంక పయనం కానున్నట్లు తెలుస్తోంది. అక్కడి దట్టమైన అటవీ ప్రాంతాల్లో చిత్రీకరణ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారట. ఇందులో వెయ్యి సంవత్సరాల క్రితం నాటి సన్నివేశాలు కూడా ఉంటాయట. అవి చిత్రంలోనూ కీలకం కానున్నాయని సమాచారం. వచ్చే ఏడాది ఏప్రిల్‌ నాటి ఈ సినిమాని పూర్తి చేయనున్నారు. ఈ చిత్రంలో నాయికగా బాలీవుడ్‌ నాయిక దిశాపటానీ (Disha Patani) నటిస్తోంది. ఇది రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది.


అంతా డబ్బు చుట్టూనే..

శివ కంఠమనేని, సంజన గల్రాని(Sanjana Galrani) , ప్రియా హెగ్డే, చాణక్య ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మణిశంకర్‌’ (Manishankar). జి.వెంకట్‌ కృష్ణణ్‌ తెరకెక్కించారు. కె.ఎస్‌.శంకర్‌ రావు, శ్రీనివాసరావు, ఎం.ఫణిభూషణ్‌ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే గురువారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో శివ మాట్లాడుతూ.. ‘‘ఒక సంఘటన చుట్టూనే ఈ సినిమా మొత్తం తిరుగుతుంది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతూ.. ప్రేక్షకుల్ని కథలో లీనమయ్యేలా చేస్తుంది. సినిమా చాలా బాగా వచ్చింది. జనవరి తొలి వారంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ‘‘కొవిడ్‌ తర్వాత నాకీ సినిమాలో అవకాశం వచ్చింది. చక్కటి ప్రణాళికతో చిత్రాన్ని పూర్తి చేశారు. శివ ఎంతో అద్భుతంగా నటించారు’’ అంది నాయిక సంజన. దర్శకుడు జి.వెంకట్‌ మాట్లాడుతూ.. ‘‘డబ్బు చుట్టూ తిరిగే ఆసక్తికర కథతో ఈ సినిమా తెరకెక్కించాం. యాక్షన్‌కు ఎంతో ప్రాధాన్యముంది. పాటలు, ఫైట్లు కథలో భాగంగానే ఉంటాయి తప్ప ఎక్కడా ఇరికించినట్లు ఉండవు. రెండు గంటల పాటు అలరిస్తుంది. సంజన పాత్రలో చాలా కోణాలున్నాయి. సినిమా కోసం ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేశాం. అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఎం.ఎల్‌.రాజా, ఛాయాగ్రహణం: జె.ప్రభాకర్‌ రెడ్డి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు