Cinema News: సంక్షిప్త వార్తలు (5)

‘పార్టీ లేదా పుష్పా..’ అంటూ తెలుగువారికి దగ్గరైన విలక్షణ నటుడు ఫహద్‌ ఫాజిల్‌. దర్శకుడు పవన్‌కుమార్‌ తెరకెక్కించనున్న ‘ధూమమ్‌’తో కన్నడంలో తెరంగేట్రం చేయనున్నారు. ‘కేజీఎఫ్‌ 2’, ‘కాంతార’ సినిమాల్ని నిర్మించిన హోంబలే ఫిల్మ్స్‌ ఈ చిత్రాన్నీ నిర్మిస్తోంది. ఫహద్‌కి జోడీగా ‘ఆకాశమే నీ హద్దురా’ ఫేం అపర్ణ బాలమురళి నటించనున్నారు.

Updated : 10 Oct 2022 14:00 IST

ఫహద్‌ కన్నడ పరిచయం

‘పార్టీ లేదా పుష్పా..’ అంటూ తెలుగువారికి దగ్గరైన విలక్షణ నటుడు ఫహద్‌ ఫాజిల్‌ (Fahadh Fazil). దర్శకుడు పవన్‌కుమార్‌ తెరకెక్కించనున్న ‘ధూమమ్‌’తో కన్నడంలో తెరంగేట్రం చేయనున్నారు. ‘కేజీఎఫ్‌ 2’, ‘కాంతార’ సినిమాల్ని నిర్మించిన హోంబలే ఫిల్మ్స్‌ ఈ చిత్రాన్నీ నిర్మిస్తోంది. ఫహద్‌కి జోడీగా ‘ఆకాశమే నీ హద్దురా’ ఫేం అపర్ణ బాలమురళి నటించనున్నారు. అచ్యుత్‌ కుమార్‌, దేవ్‌ మోహన్‌, అనూ మోహన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. నిర్మాణసంస్థ ఈ విషయాలను ఆదివారం ట్విటర్‌లో పంచుకుంది. ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ కన్నడతోపాటు తెలుగు, తమిళ, మలయాళ భాషల్లోనూ ఏకకాలంలో రూపొందనుంది. వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేస్తామంటున్నారు నిర్మాతలు.


‘కాంతార’.. విడుదల ఖరారు

‘కేజీఎఫ్‌’ సిరీస్‌ సినిమాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించుకున్న నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్‌. ఇప్పుడీ సంస్థ నుంచి వస్తున్న మరో కొత్త చిత్రం ‘కాంతార’ (Kantara). రిషబ్‌ శెట్టి హీరోగా నటిస్తూ.. స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించారు. కిషోర్‌ కుమార్‌, అచ్యుత్‌ కుమార్‌, సప్తమి కీలక పాత్రలు పోషించారు. ఇటీవలే కన్నడలో విడుదలైన ఈ సినిమాని.. ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది గీతా ఫిల్మ్‌ డిస్ట్రిబ్యూషన్‌. ఈ నేపథ్యంలో ఆదివారం చిత్ర ట్రైలర్‌ విడుదల చేశారు. ఇదొక విభిన్నమైన యాక్షన్‌ థ్రిల్లర్‌ సినిమా. పూర్తిగా పల్లెటూరి నేపథ్యంలో సాగుతుంది. ఇందులో రిషబ్‌ స్మగ్లర్‌గా కనిపించనున్నట్లు ప్రచార చిత్రాన్ని బట్టి అర్థమవుతోంది. ఆయన్ని వేటాడే ఫారెస్ట్‌ ఆఫీసర్‌ పాత్రలో కిషోర్‌ కనిపించారు. కేరళలోని పల్లెటూరి వాతావరణాన్ని.. అక్కడి సంస్కృతి, సంప్రదాయాల్ని ట్రైలర్‌లో ఆసక్తికరంగా చూపించారు. ఈ చిత్రం ఈనెల 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకి సంగీతం: అజనీష్‌ లోకనాథ్‌, ఛాయాగ్రహణం: అరవింద్‌ ఎస్‌.కశ్యప్‌.


బయటికొచ్చిన ‘మాన్‌స్టర్‌’

లయాళ అగ్ర కథానాయకుడు మోహన్‌లాల్‌ (Mohanlal) ప్రధాన పాత్రధారిగా రూపొందుతున్న చిత్రం ‘మాన్‌స్టర్‌’ (Monster). మంచు లక్ష్మి కీలక పాత్ర పోషిస్తున్నారు. వైశాఖ్‌ దర్శకుడు. ఈ ఇన్వెస్టిగేషన్‌ థ్రిల్లర్‌లో మోహన్‌లాల్‌ లక్కీ సింగ్‌గా కనిపించనున్నారు. భారీ అంచనాలతో వస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ని ఆదివారం విడుదల చేశారు. ఒక నగరంలో చిన్న పాప, ఆమె తండ్రి కిడ్నాప్‌నకు గురవుతారు. అది లక్కీసింగ్‌ పనేనని పోలీసులు ఓ నిర్ణయానికొచ్చేస్తారు. అతడ్ని పట్టుకునే క్రమంలో ఎలాంటి ఊహించని మలుపులు ఎదురయ్యారు? అసలు కిడ్నాపర్‌ ఎవరు? అనేది కథాంశం. ఈ ట్రైలర్‌ని మోహన్‌లాల్‌ సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ఆశీర్వాద్‌ సినిమాస్‌ పతాకంపై ఈ చిత్రాన్ని ఆంటోనీ పెరంబవూర్‌ నిర్మిస్తున్నారు.


200ఏళ్ల క్రితం..

విశ్వజిత్‌ హీరోగా సుధీర్‌ తెరకెక్కించిన చిత్రం ‘కౌశిక వర్మ దమయంతి’. గీతా కౌషిక్‌ నిర్మాత. అర్చనసింగ్‌, ఊర్వశి రాయ్‌, రఘుదీప్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాలోని ‘‘పదరా పదరా వేటకు వెళ్దాం’’ అనే గీతాన్ని నిర్మాత సి.కల్యాణ్‌ ఇటీవల విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘పాట చాలా బాగుంది. యస్‌.యస్‌.ఆత్రేయ మంచి స్వరాలందించారు. హేమచంద్ర చక్కగా ఆలపించారు. ఇది పెద్ద విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘200ఏళ్ల క్రితం జరిగిన కథను.. వర్తమానంలో సాగే కథతో ముడిపెడుతూ సినిమాని ఆసక్తికరంగా తెరకెక్కించాం. నవంబర్‌లో విడుదలకి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు హీరో విశ్వజిత్‌. కార్యక్రమంలో రఘుదీప్‌, జిన్నా, లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు.


హృదయాల్ని హత్తుకునే ‘పంచతంత్రం’

బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతి రెడ్డి, శివాత్మిక రాజశేఖర్‌, రాహుల్‌ విజయ్‌, నరేష్‌ అగస్త్య తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘పంచతంత్రం’ (Panchatantram). హర్ష పులిపాక తెరకెక్కించారు. అఖిలేష్‌వర్ధన్‌, సృజన్‌ ఎరబోలు సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా డిసెంబరు 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం ఆదివారం అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. ‘‘మంచి కథతో హృదయాల్ని హత్తుకునేలా తెరకెక్కించిన చిత్రమిది. వేదవ్యాస్‌ పాత్రలో బ్రహ్మానందం జీవించారు. ఆయనకు స్వాతి రెడ్డికి మధ్య వచ్చే సన్నివేశాలు ఎంతో హృద్యంగా ఉంటాయి. వీరి పాత్రలు ప్రేక్షకుల మదిపై చెరగని ముద్ర వేస్తాయి’’ అన్నారు. ‘‘సినిమా చాలా బాగా వచ్చింది. ఇందులో అందరూ చాలా బాగా నటించారు. నిర్మాణాంతర పనులు ముగింపు దశలో ఉన్నాయి’’ అన్నారు నిర్మాతలు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని