Tollywood: రజనీకాంత్‌, నాని పూర్తి చేశారు.. బెల్లంకొండ ప్రారంభించారు.. నిఖిల్‌ ‘స్వయంభూ’

రజనీకాంత్‌, నాని, బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, నిఖిల్‌ కొత్త చిత్రాల అప్‌డేట్స్‌ ఇవి. ఏ హీరో ఏం అప్‌డేట్‌ ఇచ్చారంటే?

Published : 01 Jun 2023 20:19 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఓ వైపు క్లాప్‌ బోర్డు సౌండ్‌, కెమెరా క్లిక్‌లతో.. మరోవైపు కేక్‌ కటింగ్‌లతో టాలీవుడ్‌, కోలీవుడ్‌లో గురువారం సందడి నెలకొంది. ప్రముఖ హీరో రజనీకాంత్‌ (Rajinikanth) తన కొత్త సినిమా చిత్రీకరణ పూర్తి చేశారు. నాని (nani) హీరోగా నటిస్తోన్న సినిమాకి సంబంధించి ఓ షెడ్యూల్‌ పూర్తయింది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ (Bellamkonda Sai Sreenivas) కొత్త చిత్రాన్ని ప్రారంభించారు. నిఖిల్‌ (Nikhil Siddhartha) ఓ సినిమా ఖరారు చేశారు. ఇంకెందుకు ఆలస్యం ఆ వివరాలపై ఓ లుక్కేయండి..

జైలర్‌ షూట్‌ కంప్లీట్‌

రజనీకాంత్‌ హీరోగా దర్శకుడు నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ ‘జైలర్‌’ (jailor) సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణ తాజాగా ముగిసింది. ఈ సందర్భంగా చిత్ర బృందం సెట్స్‌లో భారీ కేక్‌ను కట్‌ చేసి, ఆనందం వ్యక్తం చేసింది. సంబంధిత ఫొటోలను సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ఈ సినిమాలో మోహన్‌లాల్‌, శివ రాజ్‌కుమార్‌ కీలక పాత్రలు పోషించారు. తమన్నా, రమ్యకృష్ణ, సునీల్‌, జాకీ ష్రాఫ్‌, యోగిబాబు తదితరులు ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమా ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ముంబయిలో నాని..

నాని, మృణాళ్‌ ఠాకూర్‌ జంటగా నూతన దర్శకుడు శౌర్యువ్‌ ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. #Nani30 వర్కింగ్‌ టైటిల్‌తో రూపొందుతోన్న ఈ సినిమా.. ముంబయిలో ఓ షెడ్యూల్‌ని పూర్తి చేసుకుంది. మరో షెడ్యూల్‌ షూటింగ్‌కి చిత్ర బృందం ప్లాన్‌ చేస్తోంది. తండ్రీ కూతుళ్ల బంధం ప్రధానంగా సాగే ఈ చిత్రం డిసెంబరు 21న విడుదల కానుంది.

నిఖిల్‌.. ‘స్వయంభూ’

తన పుట్టినరోజు సందర్భంగా నిఖిల్‌ మరో పాన్‌ ఇండియా చిత్రాన్ని ప్రకటించారు. ‘స్వయంభూ’ (Swayambhu) అనే పేరు టైటిల్‌గా ఖరారైన ఈ సినిమాకి భరత్‌ కృష్ణమాచారి దర్శకత్వం వహించనున్నారు. ఈ మేరకు విడుదల చేసిన పోస్టర్‌ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభంకానుంది. కొన్ని రోజుల క్రితమే నిఖిల్‌.. ‘ది ఇండియా హౌస్‌’ సినిమాని ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ‘స్పై’ చిత్రంతో బిజీగా ఉన్నారు. జూన్‌ 29న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

#BSS10 షురూ..

బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ హీరోగా దర్శకుడు సాగర్‌. కె. చంద్ర ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. పూజా కార్యక్రమాలతో ఆ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. దర్శకులు హరీశ్‌ శంకర్‌, పరశురామ్‌ తదితరులు హాజరై, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. #BSS10 వర్కింగ్‌ టైటిల్‌తో రెగ్యులర్‌ షూటింగ్‌ త్వరలోనే ప్రారంభంకానుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని