Updated : 20 May 2022 08:10 IST

Cinema News: కొత్తగా ప్రయత్నిస్తున్నా..

‘‘ట్విస్ట్‌లు.. మలుపులతో ఆద్యంతం అలరించే చిత్రం ‘ధగడ్‌ సాంబ’’ అన్నారు హీరో సంపూర్ణేష్‌బాబు. ‘హృదయ కాలేయం’, ‘కొబ్బరిమట్ట’ వంటి వినోదభరిత చిత్రాలతో అలరించిన ఆయన.. ఇప్పుడు ‘ధగడ్‌ సాంబ’గా వినోదాలు పంచేందుకు సిద్ధమయ్యారు. ఎన్‌.ఆర్‌.రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రం ఈనెల 20న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే గురువారం హైదరాబాద్‌లో విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకున్నారు సంపూర్ణేష్‌బాబు.

‘‘కొబ్బరిమట్ట’ తర్వాత కొన్ని పెద్ద బ్యానర్స్‌లో సినిమా అవకాశాలొచ్చాయి. కొన్ని కారణాల వల్ల అవి ఆలస్యమయ్యాయి. ఇంతలో దర్శకుడు యన్‌.ఆర్‌.రెడ్డి ఈ కథ చెప్పారు. ఈ సినిమాలో హీరో చిన్నప్పుడు ఓ చిన్న సమస్య వల్ల తన ఆస్తి అంతా కోల్పోతాడు. దాన్ని తిరిగి సంపాదించుకోవడానికి మళ్లీ అతనేం చేశాడు? ఎదురైన సవాళ్లేంటి? అన్నది చిత్ర కథాంశం’’.

* ‘‘నేనిప్పటి వరకు ఎక్కువగా కామెడీ పాత్రలే పోషించాను. ఇందులో తొలిసారి కాస్త సీరియస్‌గా సాగే పాత్ర పోషించా. సంభాషణలు కొత్తగా, భిన్నంగా ఉంటాయి. హీరోగా వచ్చి నాకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్నా. దాన్ని నిలబెట్టుకోడానికి కొత్తగా ప్రయత్నిస్తూనే వస్తున్నా’’. ‘‘నేను హీరోగా ప్రస్తుతం ‘బ్రిలియంట్‌ బాబు’, ‘సన్నాఫ్‌ తెనాలి’, ‘దాన వీర శూరకర్ణ’, ‘మిస్టర్‌ బెగ్గర్‌’ చిత్రాలు చేస్తున్నా. ఈశ్వర్‌ దర్శకత్వంలోనూ ఓ చిత్రం చేస్తున్నా. తమిళంలోనూ హీరోగా ఓ సినిమా చేస్తున్నాను’’.


‘విక్రమ్‌’.. విచ్చేస్తున్నారు

కమల్‌హాసన్‌ కథానాయకుడిగా లోకేష్‌ కనగరాజ్‌ తెరకెక్కించిన చిత్రం ‘విక్రమ్‌’. విజయ్‌ సేతుపతి, ఫహాద్‌ ఫాజిల్‌ కీలక పాత్రలు పోషించారు. సూర్య అతిథి పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్ర తెలుగు హక్కులను హీరో నితిన్‌ సొంత బ్యానర్‌ శ్రేష్ఠ్‌ మూవీస్‌ దక్కించుకుంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ గురువారం అధికారికంగా ప్రకటించింది. ‘‘సరికొత్త యాక్షన్‌ థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందిన చిత్రమిది. తెలుగులో భారీ స్థాయిలో విడుదల చేస్తున్నాం’’ అని శ్రేష్ఠ్‌ మూవీస్‌ సంస్థ తెలిపింది. ఈ సినిమా జూన్‌ 3న తమిళ, తెలుగు భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం: అనిరుధ్‌, కూర్పు: ఫిలోమిన్‌ రాజ్‌, ఛాయాగ్రహణం: గిరీష్‌ గంగాధరన్‌.  

 


నవ్వించే ‘క్రేజీ ఫెలో’

ఆది సాయికుమార్‌ హీరోగా ఫణికృష్ణ సిరికి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. కె.కె.రాధామోహన్‌ నిర్మాత. దిగంగన సూర్యవంశి, మర్నా మీనన్‌ కథానాయికలు. ఈ సినిమాకి ‘క్రేజీ ఫెలో’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. గురువారం ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ప్రచార చిత్రంలో ఆది చేష్టలు టైటిల్‌కు తగ్గట్లుగానే క్రేజీగా ఉన్నాయి. ‘‘ఆద్యంతం వినోదాత్మకంగా సాగే చిత్రమిది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది. ప్రస్తుతం నిర్మాణాంతర పనులు జరుగుతున్నాయి’’ అని చిత్ర బృందం తెలిపింది. సంగీతం: ఆర్‌ఆర్‌ ధృవన్‌, ఛాయాగ్రహణం: సతీష్‌ ముత్యాల.

Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని