Updated : 17 Aug 2022 10:20 IST

Tollywood: ‘హైవే’.. ప్రయోగాత్మక చిత్రం

ఆనంద్‌ దేవరకొండ (Anand Deverakonda), మానస (Manasa) జంటగా నటించిన చిత్రం ‘హైవే’ (High way). కె.వి.గుహన్‌ తెరకెక్కించారు. ఈ సినిమా ఆగస్టు 19న ఓటీటీ వేదిక ఆహాలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం హైదరాబాద్‌లో హీరో నాగశౌర్య చిత్ర ట్రైలర్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ట్రైలర్‌ చూస్తుంటే ఒక ‘ఆవారా’, ఓ ‘రాక్షసన్‌’ చిత్రం చూసినట్లుంది. ఈ చిత్ర టైటిల్‌ వినగానే చాలా పాజిటివ్‌గా వినిపించింది. ఇలాంటి సినిమాలు తీస్తున్నందుకు నిర్మాత వెంకట్‌కు థ్యాంక్స్‌. నాకు ప్రేక్షకులు లవర్‌ బాయ్‌ అని ట్యాగ్‌ తగిలించారు. ఆనంద్‌ మాత్రం ఒక్కో చిత్రం ఒక్కో జానర్‌లో చేస్తూ వైవిధ్యభరితంగా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. తన స్క్రిప్ట్‌ సెలక్షన్‌ అద్భుతంగా ఉంటుంది’’ అన్నారు. ‘‘ఇదొక ప్రయోగాత్మక చిత్రం. ప్రేక్షకుల్ని సీటు అంచున కూర్చోబెడుతుంది. ఈ చిత్రం కోసం కొవిడ్‌ టైమ్‌లో చాలా కష్టపడ్డాం. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ.. అతి తక్కువ మందితో షూట్‌ చేసి, అద్భుతమైన ఔట్‌పుట్‌ తీసుకొచ్చాం’’ అన్నారు హీరో ఆనంద్‌ దేవరకొండ. దర్శకుడు కె.వి.గుహన్‌ మాట్లాడుతూ.. ‘‘ఓటీటీల వల్ల కొత్త జానర్లు ప్రయత్నించే అవకాశం వచ్చింది. ఈ కథ చెప్పగానే ఆనంద్‌ ఓకే చెప్పారు. ఇది రెగ్యులర్‌ హీరోయిక్‌ సినిమాల్లా ఉండదు’’ అన్నారు. కార్యక్రమంలో శరత్‌ మరార్‌, కార్తీక్‌, మానస తదితరులు పాల్గొన్నారు.


ప్రేమ.. దేశభక్తి

యం.డి.నజీరుద్దీన్‌, సీతా మహాలక్ష్మీ జంటగా డి.యస్‌.రాథోడ్‌ తెరకెక్కించిన చిత్రం ‘భారత్‌ కీ నారీ’ (Bharat Ki Nari). యం.డి.నమీరుద్దీన్‌ అహ్మద్‌ నిర్మించారు. ఈ సినిమా తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో రూపొందుతోంది. చిత్ర మోషన్‌ పోస్టర్‌, ఫస్ట్‌లుక్‌ను మంగళవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. ‘‘దేశాన్ని కాపాడటానికి సరిహద్దుల్లో సైనికులు ఎంత బాధ్యతగా వ్యవహరిస్తారో.. అదే విధంగా వారి సతీమణులు ఒంటరిగా జీవిస్తూ తమ కుటుంబాల్ని అంతే బాధ్యతగా చూసుకుంటుంటారు. ఇలా ప్రేమ, దేశభక్తి అంశాల మేళవింపుతో రూపొందిన చిత్రమిది. దీన్ని దేశ సైనికుల సతీమణులకు, తల్లిదండ్రులకు అంకితమిస్తున్నా. ఇప్పటికే 50 శాతం చిత్రీకరణ పూర్తయింది. నెలాఖరు నాటికి పూర్తి చేసి, సెప్టెంబర్‌లో విడుదల చేస్తామ’’న్నారు. ఈ కార్యక్రమంలో బెక్కెం వేణుగోపాల్‌, సుభద్ర రెడ్డి, మారి ప్రవీణ్‌ కుమార్‌, కల్నల్‌ రామారావు తదితరులు పాల్గొన్నారు.


సందేశాత్మకం ‘కమిట్‌మెంట్‌’

తేజస్వి మదివాడ, అన్వేషి జైన్‌, సీమర్‌ సింగ్‌, తనిష్క్‌ రాజన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘కమిట్‌మెంట్‌’ (Commitment). లక్ష్మికాంత్‌ చెన్న దర్శకుడు. బల్‌దేవ్‌ సింగ్‌, నీలిమ.టి సంయుక్తంగా నిర్మించారు. అమిత్‌ తివారి, సూర్య శ్రీనివాస్‌, అభయ్‌ సింహారెడ్డి కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఆగస్టు 19న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం హైదరాబాద్‌లో విడుదల ముందస్తు వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా అమిత్‌ తివారి మాట్లాడుతూ.. ‘‘సినిమా చాలా బాగా వచ్చింది. ఇందులో మంచి మెసేజ్‌ ఉంది’’ అన్నారు. ‘‘దీంట్లో కొన్ని బోల్డ్‌ సీన్స్‌ ఉన్నా.. అవి ఎందుకున్నాయి అన్నది సినిమా చూస్తే అర్థమవుతుంది’’ అన్నారు నిర్మాత నీలిమ. నాయిక తనిష్క్‌ రాజన్‌ మాట్లాడుతూ.. ‘‘ఈ చిత్రం చూశాక చాలా మంది నా క్యారెక్టర్‌కు కనెక్ట్‌ అవుతారు. ప్రతి మహిళా చూడాల్సిన చిత్రమిది’’ అంది. కార్తీక్‌, సూర్య శ్రీనివాస్‌, అహమ్మద్‌ తదితరులు పాల్గొన్నారు.


స్వచ్ఛమైన హాస్యంతో ‘కళాపురం’

సత్యం రాజేష్‌ (Satyam Rajesh), చిత్రం శ్రీను, కషిమా రఫీ ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘కళాపురం’ (Kalapuram). ఇక్కడ అందరూ కళాకారులే.. అనేది ఉపశీర్షిక. కరుణ  కుమార్‌ దర్శకుడు. జీ స్టూడియోస్‌తో కలిసి ఆర్‌ 4 ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రజనీ తాళ్లూరి నిర్మించారు. ఈనెల 26న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం నిర్వహించారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఆరోగ్యవంతమైన హాస్యంతో సినిమా చేయాలని ఈ కథ రాసుకున్నా. హింస, అశ్లీలత లేకుండా తెరకెక్కించాం. మంచి కంటెంట్‌తో కూడిన ఈ సినిమాకి ప్రేక్షకుల ప్రోత్సాహం లభిస్తుందని ఆశిస్తున్నా’’ అన్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘‘చిత్రీకరణని ఆస్వాదిస్తూ పక్కా ప్రణాళికతో పూర్తి చేశాం. ప్రేక్షకులకి తప్పకుండా నచ్చుతుంది’’ అన్నారు. ‘‘అందమైన హాస్యంతో కూడిన చిత్రమిది. దాదాపు ఏడాదిన్నర కాలం ఈ బృందంతో కలిసి ప్రయాణం చేస్తున్నా. వంద శాతం ప్రేక్షకులకు వినోదాన్ని పంచే చిత్రమిది’’ అన్నారు సత్యం రాజేష్‌. చాలా రోజుల తర్వాత ఓ మంచి పాత్రని ఇందులో చేశానని, చూసిన ప్రతి ఒక్కరూ కడుపుబ్బా నవ్వుకుంటారన్నారు చిత్రం శ్రీను. జీ స్టూడియోస్‌ నిమ్మకాయల ప్రసాద్‌తోపాటు చిత్రబృందం పాల్గొంది.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని