Tollywood: సంక్షిప్త వార్తలు (5)

‘‘సర్దార్‌’ని చాలా ప్రతిష్ఠాత్మకంగా చేశాం. దీనికోసం ఓ యుద్ధంలా పనిచేశాం. మేము పడ్డ కష్టానికి ఇప్పుడు ప్రేక్షకులు మంచి ఫలితం అందించారు. చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు కార్తి. ఆయన కథానాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని పిఎస్‌.మిత్రన్‌ తెరకెక్కించారు.

Updated : 23 Oct 2022 14:01 IST

మరోసారి నిరూపించారు

‘‘సర్దార్‌’ని (Sardar) చాలా ప్రతిష్ఠాత్మకంగా చేశాం. దీనికోసం ఓ యుద్ధంలా పనిచేశాం. మేము పడ్డ కష్టానికి ఇప్పుడు ప్రేక్షకులు మంచి ఫలితం అందించారు. చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు కార్తి (Karthi). ఆయన కథానాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని పిఎస్‌.మిత్రన్‌ తెరకెక్కించారు. తెలుగులో నాగార్జున విడుదల చేశారు. ఇది ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన నేపథ్యంలో శనివారం హైదరాబాద్‌లో సక్సెస్‌మీట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో కార్తి మాట్లాడుతూ.. ‘‘కొత్తగా చేస్తే ఆదరిస్తామని ‘సర్దార్‌’తో ప్రేక్షకులు మరోసారి నిరూపించారు. ఈ చిత్రం చూశాక నీళ్ల బాటిల్‌ చూస్తే భయపడుతున్నారు. సినిమా అనేది మన కల్చర్‌గా ఉన్న ఈ దేశంలో ఒక నటుడిగా ఉండటం నా అదృష్టంగా భావిస్తున్నా’’ అన్నారు. ‘‘ఎక్కడ మంచి సినిమా ఉన్నా చూసేది తెలుగు ప్రేక్షకులే. నిజంగా వీళ్లు దేవుళ్లు’’ అన్నారు నిర్మాత సుప్రియ.


రచయిత.. సోనూసూద్‌

దేంటి ఆయన నటుడు కదా అనుకుంటున్నారా...కానీ ఈసారి నటనతో పాటు స్క్రిప్ట్‌, స్క్రీన్‌ప్లే పైనా దృష్టిపెట్టారు. తనదైన నటనతో పాటు, సేవా కార్యక్రమాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న సోనూ (Sonu Sood) తొలిసారి రచయితగా మారి స్రిప్ట్‌ని సిద్ధం చేయడమే కాదు స్క్రీన్‌ప్లే కూడా అందించారు. అదే ఆయన ప్రధాన పాత్రలో నటిస్తోన్న ‘ఫతే’ చిత్రం. భారీ యాక్షన్‌ చిత్రంగా తెరకెక్కనుంది. దీని గురించి సోనూ మాట్లాడుతూ ‘‘ఈ కథపై ఏడాదిన్నరగా పనిచేస్తున్నాను. ఈ సినిమా స్క్రిప్ట్‌, స్క్రీన్‌ప్లే కోసం చాలా కష్టపడ్డాను. గతంలో కూడా పలు చిత్రాలకు పనిచేసినా ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లేకు నా పేరు వేస్తున్నారు’’అని చెప్పారు. డిజిటల్‌ మోసాల నేపథ్యంలో సాగే కథ ఇది. అభినందన్‌ గుప్తా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా డిసెంబరులో సెట్స్‌పైకి వెళ్లనుంది.


ఓ మంచి సాహసయాత్రలా..!

‘‘ఆద్యంతం వినోదాత్మకంగా సాగే చిత్రం ‘లైక్‌ షేర్‌ అండ్‌ సబ్‌స్క్రైబ్‌’ (Like Share Sunscribe). మంచి అడ్వంచరస్‌, థ్రిల్‌ ట్రిప్‌లా ఉంటుంది’’ అన్నారు దర్శకుడు మేర్లపాక గాంధీ. సంతోష్‌ శోభన్‌ (Santosh Sobhan), ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన చిత్రమిది. వెంకట్‌ బోయనపల్లి నిర్మించారు. ఈ సినిమా నవంబరు 4న విడుదల కానుంది. ఈ విషయాన్ని శనివారం అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో హీరో సంతోష్‌ మాట్లాడుతూ.. ‘‘మేర్లపాక ఇచ్చిన కథతో ‘ఏక్‌ మినీ కథ’ చేశా. మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఆయన దర్శకత్వంలో నటించా. చాలా సంతోషంగా ఉంది. ఈనెల 25న ప్రభాస్‌ చేతుల మీదుగా చిత్ర ట్రైలర్‌ విడుదల చేయనున్నాం’’ అన్నారు. ‘‘ఈ చిత్రంలో సంతోష్‌, ఫరియా ట్రావెల్‌ వ్లోగ్గేర్‌గా కనిపిస్తారు. అందుకే ఈ సినిమాకి ‘లైక్‌ షేర్‌ అండ్‌ సబ్‌స్కైబ్‌’ అనే టైటిల్‌ పెట్టాం’’ అన్నారు చిత్ర దర్శకుడు గాంధీ. ఈ కార్యక్రమంలో వెంకట్‌ బోయనపల్లి, బ్రహ్మాజీ, ఫరియా తదితరులు పాల్గొన్నారు. 


ఆ ఆలోచనే ‘ప్రిన్స్‌’కు స్ఫూర్తి

‘‘ప్రస్తుత పరిస్థితుల్లో దేశభక్తి కంటే మానవత్వం గొప్పదనే ఆలోచనే ‘ప్రిన్స్‌’ (Prince) కథకు స్ఫూర్తి. దీన్ని వినోదాత్మకంగా చెప్పాలనుకున్నాం. మేము చేసిన ఈ ప్రయత్నానికి ఇప్పుడు ఊహించిన దానికంటే ఎక్కువ స్పందన వస్తోంది’’ అన్నారు అనుదీప్‌ (Anudeep). ఆయన దర్శకత్వంలో శివ కార్తికేయన్‌ హీరోగా నటించిన చిత్రమే ‘ప్రిన్స్‌’. సునీల్‌ నారంగ్‌, డి.సురేష్‌బాబు, పుస్కూర్‌ రామ్‌ మోహన్‌రావు నిర్మించారు. మరియా ర్యాబోషప్క కథానాయిక. ఈ చిత్రం ఇటీవల విడుదలైన నేపథ్యంలో శనివారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు అనుదీప్‌ మాట్లాడుతూ.. ‘‘ఈ చిత్రానికి అన్ని చోట్ల నుంచి మంచి స్పందన లభిస్తోంది. చాలా ఆనందంగా ఉంది. ప్రస్తుతం కొన్ని కథలు సిద్ధంగా ఉన్నాయి. హారిక హాసిని, మైత్రీ మూవీ మేకర్స్‌లో సినిమాలు చేయాలి. తర్వాతి ప్రాజెక్ట్‌పై 15రోజుల్లో స్పష్టత ఇస్తా’’ అన్నారు.


ప్రేమ ఓడిపోదు

హేమలత రెడ్డి కథానాయికగా నటిస్తూ.. స్వయంగా నిర్మించిన చిత్రం ‘నిన్నే చూస్తు’. కె.గోవర్ధనరావు తెరకెక్కించారు. శ్రీకాంత్‌ గుర్రం హీరో. సుమన్‌, సుహాసిని, భానుచందర్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఈనెల 27న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల హైదరాబాద్‌లో విడుదల ముందస్తు వేడుక నిర్వహించారు. ‘‘ప్రేమించే మనుషులు, మనసులు ఉన్నంత వరకు ప్రేమ ఎప్పుడూ ఓడిపోదు’ అని చెప్పే ప్రేమకథా చిత్రమిది. దీన్ని ప్రేక్షకులు ఆదరించి.. ఆశీర్వదించాలని కోరుతున్నా’’ అన్నారు దర్శకుడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని