Cobra: ‘కోబ్రా’ వచ్చేది ఆరోజే

విక్రమ్‌ హీరోగా ఆర్‌.అజయ్‌ జ్ఞానముత్తు తెరకెక్కించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘కోబ్రా’. ఎస్‌.ఎస్‌.లలిత్‌ కుమార్‌ నిర్మించారు. శ్రీనిధి శెట్టి కథానాయిక. ఈ సినిమా ఆగస్ట్‌ 11న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం శుక్రవారం

Updated : 21 May 2022 08:05 IST

విక్రమ్‌ హీరోగా ఆర్‌.అజయ్‌ జ్ఞానముత్తు తెరకెక్కించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘కోబ్రా’. ఎస్‌.ఎస్‌.లలిత్‌ కుమార్‌ నిర్మించారు. శ్రీనిధి శెట్టి కథానాయిక. ఈ సినిమా ఆగస్ట్‌ 11న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు సామాజిక మాధ్యమాల ద్వారా విడుదల తేదీతో కూడిన కొత్త పోస్టర్‌ పంచుకుంది. సినిమాలో ఆయన దాదాపు 25 గెటప్పుల్లో దర్శనమివ్వనున్నట్లు సమాచారం. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడించనున్నట్లు నిర్మాత తెలిపారు. దీనికి ఏఆర్‌.రెహమాన్‌ స్వరాలు  సమకూర్చారు. హరీశ్‌ కణ్ణన్‌  ఛాయాగ్రహణం అందించారు.


కార్తికేయన్‌.. ‘మావీరన్‌’

రుస సినిమాలతో జోరు చూపిస్తున్నారు తమిళ కథానాయకుడు శివ  కార్తికేయన్‌. ఇటీవలే ‘డాన్‌’గా ప్రేక్షకుల్ని పలకరించిన ఆయన.. ప్రస్తుతం కె.వి.అనుదీప్‌ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతోన్న ఈ సినిమా ముగింపు దశకు చేరుకుంది. ఇది పూర్తయిన వెంటనే శివ కార్తికేయన్‌, కమల్‌హాసన్‌ నిర్మాణంలో ఓ చిత్రం చేయనున్నారు. రాజ్‌ కుమార్‌ పెరియస్వామి తెరకెక్కించనున్నారు. ఇటీవలే అధికారికంగా ప్రకటించిన ఈ సినిమాకి ‘మావీరన్‌’ అనే టైటిల్‌ ఖరారు చేసినట్లు సమాచారం. ఇందులో కార్తికేయన్‌ శక్తిమంతమైన ఆర్మీ అధికారిగా కనిపించనున్నారు. స్క్రిప్ట్‌ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. పూర్వ నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. సెప్టెంబర్‌ నుంచి చిత్రీకరణ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఇందులో సాయిపల్లవి నాయిక.


థ్రిల్లింగ్‌ ప్రయాణం

నిఖిల్‌ కుమార్‌, షిఫా జంటగా మోహన్‌ శ్రీవత్స తెరకెక్కించిన చిత్రం ‘కరణ్‌ అర్జున్‌’. సోమేశ్వరరావు పొన్నాన, బాలకృష్ణ ఆకుల, సురేష్‌, రామకృష్ణ, క్రాంతి కిరణ్‌ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్ర ట్రైలర్‌ను దర్శకుడు అనిల్‌ రావిపూడి ఇటీవల విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ట్రైలర్‌ చాలా బాగుంది. విజువల్స్‌ నమ్మకాన్ని పెంచుతున్నాయి. ఎంతో రిస్క్‌ చేసి పాకిస్థాన్‌ బోర్డర్‌లో చిత్రీకరణ జరిపారు. ట్రైలర్‌ లాగే సినిమా బాగుంటుందని ఆశిస్తున్నా’’ అన్నారు. ‘‘మూడు పాత్రలతో రోడ్‌ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ప్రతి సన్నివేశం ఎవరూ ఊహించని విధంగా ఉంటుంది. థియేటర్లో ప్రేక్షకుల్ని అలరిస్తుంది. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అన్నారు దర్శకుడు. ఈ సినిమాకి సంగీతం: రోషన్‌ సాలూరి, ఛాయాగ్రహణం: మురళికృష్ణ వర్మన్‌.  


వినూత్నమైన ప్రేమకథతో..

క్షిత్‌ శశికుమార్‌, కీర్తి కల్కరే జంటగా నటించిన చిత్రం ‘ఓ మై లవ్‌’. స్మైల్‌ శ్రీను దర్శకుడు. జి.రామాంజని నిర్మించారు. ఈ సినిమా త్వరలో తెలుగు, కన్నడ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్ర టీజర్‌ను దర్శకుడు కె.రాఘవేంద్రరావు ఇటీవల హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘టీజర్‌ చూస్తే.. అందమైన ప్రేమకథతో సినిమా తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. నిర్మాతకు మంచి లాభాలు దక్కాలని కోరుకుంటున్నా’’ అన్నారు. సంగీతం: చరణ్‌ అర్జున్‌, ఫైట్స్‌: రియల్‌ సతీష్‌.


‘రుద్ర సింహ’.. ప్రతీకార కథ

సంతోష్‌, స్నేహ, మైత్రి నాయకానాయికలుగా నటిస్తున్న చిత్రం ‘రుద్ర సింహ’. మనోహర్‌ కాటేపోగు దర్శకుడు. ధరగయ్య బింగి, ఆంజనేయులు నంధవరం, కోటేశ్వర్‌రావు జింకల, మనోహర్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవలే చిత్రీకరణ పూర్తయింది. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ.. ‘‘ప్రతీకార కథతో రూపొందుతోన్న యాక్షన్‌ చిత్రమిది. ఏడు పాటలు, ఐదు ఫైట్లు ఉన్నాయ’’న్నారు. సంగీతం: టి.రాజేష్‌ రాజ్‌, ఛాయాగ్రహణం: జి.ఉదయ్‌ కుమార్‌.


వెంటపడే ఆ చిన్నాడెవడు?

తేజ్‌ కూరపాటి, అఖిల  ఆకర్షణ జంటగా వెంకట్‌ వందెల తెరకెక్కించిన ప్రేమ కథా చిత్రం ‘నా వెంటపడుతున్న చిన్నాడెవడమ్మా’. ముల్లేటి కమలాక్షి, గుబ్బల వెంకటేశ్వరావు సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హీరో తేజ్‌ మాట్లాడుతూ.. ‘‘ఒక అమ్మాయికి తెలియకుండా ఓ అబ్బాయి వెంటపడుతుంటాడు. ఆ విషయం ఆమెకి తప్ప ఊర్లో ఉన్న వాళ్లందరికీ తెలుస్తుంది. దాని వల్ల ఆ అమ్మాయికి వచ్చే సమస్యలేంటి? ఈ అమ్మాయి ఆ అబ్బాయిని ఎలా కలిసింది? అన్నది మిగతా చిత్ర కథ. ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతుంది. వెంకట్‌ సినిమాని అద్భుతంగా తెరకెక్కించారు. సందీప్‌ అందించిన పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి’’ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని