Tollywood: ‘శివపుత్రుడు’, ‘లైగర్‌’ కాంబినేషన్‌ రిపీట్‌.. ప్రవీణ్‌ సత్తారుతో వరుణ్‌తేజ్‌!

యువ నటులు వరుణ్‌తేజ్‌, విజయ్‌ దేవరకొండ తమ కొత్త చిత్రాల అప్‌డేట్‌ పంచుకున్నారు. సూర్య సరసన కథానాయికగా కృతిశెట్టి ఎంపికైంది. ఆ సినిమాల విశేషాలివీ.. 

Published : 28 Mar 2022 17:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: యువ నటులు వరుణ్‌తేజ్‌, విజయ్‌ దేవరకొండ తమ కొత్త చిత్రాల అప్‌డేట్‌ పంచుకున్నారు. సూర్య సరసన కథానాయికగా కృతిశెట్టి ఎంపికైంది. ఆ సినిమాల విశేషాలివీ.. వరుణ్‌తేజ్‌ హీరోగా ప్రవీణ్‌ సత్తారు తెరకెక్కిస్తున్న చిత్రం సోమవారం లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి వరుణ్‌ తండ్రి, నటుడు నాగబాబు క్లాప్‌ కొట్టగా తల్లి పద్మజ కెమెరా స్విచ్ఛాన్‌ చేశారు. అనంతరం, చిత్ర బృందానికి స్క్రిప్టును అందించారు. ఈ చిత్రాన్ని బాపినీడు, బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ‘వీటీ 12’ వర్కింగ్‌ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాకి సంగీతం: మిక్కీ జె. మేయర్‌, ఛాయాగ్రాహణం: ముఖేష్‌, కళ: అవినాష్‌ కొల్లా. నాయిక, ఇతర నటులు, టైటిల్‌ వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

18 ఏళ్ల తర్వాత..

సూర్య, విక్రమ్‌ ప్రధాన పాత్రల్లో దర్శకుడు బాలా తెరకెక్కించిన తమిళ చిత్రం ‘పితామగన్‌’. తెలుగులో ‘శివ పుత్రుడు’ పేరుతో విడుదలై, ఇక్కడా ఘన విజయం అందుకుంది. సుమారు 18 ఏళ్ల తర్వాత సూర్య- బాలా కాంబినేషన్‌లో మరో చిత్రం ఖరారైన సంగతి తెలిసిందే. ఈ సినిమా ‘సూర్య 41’ వర్కింగ్‌ టైటిల్‌తో కన్యాకుమారిలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా కథానాయిక, సంగీత దర్శకుడి వివరాల్ని చిత్ర బృందం సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించింది. ఈ విభిన్న కథా చిత్రంలో సూర్య సరసన కృతిశెట్టి సందడి చేయబోతుంది. జీవీ ప్రకాశ్‌ కుమార్‌ సంగీత దర్శకుడు.


ఆసక్తికర కాంబో.. మరోసారి

విడుదలకు ముందే ‘లైగర్‌’తో ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తిస్తోన్న పూరి జగన్నాథ్‌- విజయ్‌ దేవరకొండ కాంబోలో మరో చిత్రం పట్టాలెక్కనుంది. ఈ క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించిన తొలి అప్‌డేట్‌ను చిత్ర బృందం మంగళవారం పంచుకోనుంది. ఈ మేరకు ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. పోస్టర్‌ను బట్టి ఈ సినిమా సైన్స్‌ ఫిక్షన్‌ నేపథ్యంలో రూపొందే అవకాశాలున్నాయని తెలుస్తోంది. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందిన ‘లైగర్‌’ చిత్రం ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకురానుంది. ధర్మ ప్రొడక్షన్స్‌, పూరి కనెక్ట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో అనన్య పాండే కథానాయిక.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని