Jailer: ‘జైలర్‌’ రాక ఆ రోజేనా!

రజనీకాంత్‌ సినిమా వస్తోందంటే అభిమానులకు పండగే. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘జైలర్‌’ చిత్రం వేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది.

Updated : 28 Oct 2022 08:51 IST

జనీకాంత్‌ (Rajinikanth) సినిమా వస్తోందంటే అభిమానులకు పండగే. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘జైలర్‌’ (Jailer) చిత్రం వేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా విడుదల తేదీపై చిత్రబృందం ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. తమిళ సంవత్సరాది సందర్భంగా వచ్చే ఏడాది ఏప్రిల్‌ 14న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ఆలోచనలో చిత్రబృందం ఉన్నట్లు తమిళ సినీ వర్గాలు చెబుతున్నాయి. వినోదం, థ్రిల్లింగ్‌ అంశాలతో పాటు రజనీ అభిమానులు కోరుకునే అన్ని అంశాలతో ఈ చిత్రం రూపొందుతోందని చిత్రబృందం చెబుతోంది. రమ్యకృష్ణ, శివరాజ్‌కుమార్‌ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తోన్న ఈ చిత్రంలో యువ కథానాయకుడు శివ కార్తికేయన్‌ అతిథి పాత్రలో మెరవనున్నాడు. ఆగస్టులో సెట్స్‌పైకి వెళ్లిన ఈ సినిమా చిత్రీకరణని 2023 ఆరంభంలో పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.


దైవిక అంశం.. 1989నాటి కుప్పం నేపథ్యం!

సుధీర్‌బాబు (Sudheer Babu) కొత్త చిత్రం ఖరారైంది. జ్ఞానసాగర్‌ ద్వారక తెరకెక్కించనున్న ఈ సినిమాని సుమంత్‌ జి.నాయుడు నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను గురువారం అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా చిత్ర కథా నేపథ్యాన్ని తెలియజేసే ఓ పోస్టర్‌ను సుధీర్‌ సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకున్నారు. ‘‘పిలిసినంక రాకుంటే ఎట్ల సెప్పండి. అందికే వస్తా ఉండా!’’ అంటూ ఆ పోస్ట్‌కు ఓ వ్యాఖ్యను కూడా జత చేశారు. ఇన్‌ లాండ్‌ లెటర్‌పై కథానాయకుడి పాత్ర పేరుతో పాటు.. అతని రాక కోసం సౌత్‌ బాంబేకు చెందిన అరుణ్‌ గౌలి అనే వ్యక్తి ఎదురు చూస్తున్నట్లుగా ఉత్తరం రూపంలో ప్రచార చిత్రాన్ని తీర్చిదిద్దిన తీరు ఆసక్తి రేకెత్తిస్తోంది. 1989 నాటి కుప్పం నేపథ్యంలో సాగే కథ ఇది. ఇందులో సుధీర్‌బాబు శివారెడ్డి తనయుడు సుబ్రమణ్యంగా కనిపించనున్నారు. పోస్టర్‌లో లెటర్‌పై ఉన్న దేవాలయం.. దాని పక్కనున్న పాత కాలం నాటి ఐదు వందల నోటు, మరో పక్కనున్న పాత ల్యాండ్‌ ఫోన్‌.. కింద ఉన్న ఆ కాలం నాటి పిస్తోల్‌.. ఇవన్నీ ఇదొక దైవిక అంశంతో ముడిపడిన యాక్షన్‌ కథాంశంతో రూపొందుతోన్న చిత్రమని స్పష్టత ఇస్తున్నాయి. ఇందులో సుధీర్‌ మునుపెన్నడూ చూడని సరికొత్త మాస్‌ లుక్‌లో కనిపించనున్నారు. ఈ సినిమా ఈనెల 31న లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఆరోజే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడికానున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని