అసలు మనిషిని ఆవిష్కరించే ప్రయత్నమే ‘అన్‌స్టాపబుల్‌’: బాలకృష్ణ

‘ప్రతి మనిషి జీవితంలో ఒక ప్రయాణం ఉంటుంది. రాయికి ఎన్నో దెబ్బలు తగిలితేనే శిల్పం అవుతుంది. అలాగే ప్రతి మనిషి

Published : 15 Oct 2021 01:48 IST

హైదరాబాద్‌: ‘ప్రతి మనిషి జీవితంలో ఒక ప్రయాణం ఉంటుంది. రాయికి ఎన్నో దెబ్బలు తగిలితేనే శిల్పం అవుతుంది. అలాగే ప్రతి మనిషి జీవితంలో ఎత్తు పల్లాలుంటాయి. వాటిని అధిగమించి ఒక లక్ష్యాన్ని చేరడమే ‘అన్‌స్టాపబుల్‌’. ఆ కాన్సెప్ట్‌ నాకు నచ్చింది. అందుకే ఈ కార్యక్రమం ఒప్పుకొన్నా’  అని అన్నారు నందమూరి బాలకృష్ణ. ఆయన వ్యాఖ్యాతగా ‘ఆహా’ ఓటీటీలో ప్రసారం కానున్న కార్యక్రమం ‘అన్‌స్టాపబుల్‌’.  నవంబరు 4వ తేదీ నుంచి ఈ షో ప్రారంభం కానుంది. గురువారం ఈ కార్యక్రమం కర్టెన్‌ రైజర్‌ జరిగింది.

ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. ‘‘సాంఘికం, జానపదం, సోషియో ఫాంటసీ, కుటుంబ కథాచిత్రాల్లో వివిధ పాత్రలు పోషించి మీకు వినోదాన్ని అందించటానికి ప్రయత్నిస్తున్నా. మీరు అంతులేని ప్రేమాభిమానాలతో నన్ను ఆదరిస్తున్నారు. ఇంకా ఎంతో చేయాలని ప్రేరణ ఇస్తోంది మన తెలుగు జాతి. ‘ఆహా’ ఓటీటీ మాధ్యమం అల్లు అరవింద్‌ మానస పుత్రిక. అంతర్జాతీయ ఓటీటీలకు దీటుగా ‘ఆహా’ను స్థాపించారు. అల్లు రామలింగయ్యగారికి మాత్రమే అమ్మానాన్నల దగ్గర చనువు ఉండేది. ఇండస్ట్రీలో ఆ స్థాయి చనువు మరెవరికీ లేదు. దర్శకుడు ప్రశాంత్‌ వర్మతో సహా ఎంతో మంది ఈ షోకు కష్టపడి పనిచేస్తున్నారు. ఒక మనిషి ప్రజెంటేషన్‌ ఆహాలో వస్తున్న ‘అన్‌స్టాపబుల్’. నటన అంటే ఒక పాత్రలోకి వెళ్లడం. దాని ఆత్మలోకి ప్రవేశించటం. ఎంతో ఒత్తిడితో కూడుకున్నది. తెలుగువారు గర్వించదగ్గ ఓటీటీ ‘ఆహా’. ప్రతి రంగంలోనూ పోటీ ఉంటుంది. అది ఉన్నప్పుడే అసలు మజా ఉంటుంది. మనుషులుగా మనమంతా ఒకటే. బావిలో కప్పలా ఉండకుండా బయటకు వచ్చినప్పుడు అసలు మనిషి ఆవిష్కరించబడతాడు. అలా ఆవిష్కరించే ప్రయత్నమే ‘అన్‌స్టాపపబుల్‌’. మనిషి మనిషికీ జీవితంలో ఒక ప్రయాణం ఉంటుంది. రాయికి ఎన్నో దెబ్బలు తగిలితేనే శిల్పం అవుతుంది. అలాగే ప్రతి మనిషి జీవితంలో ఎత్తు పల్లాలుంటాయి. వాటిని అధిగమించి ఒక లక్ష్యాన్ని చేరడమే ‘అన్‌స్టాపబుల్‌’. ఇది నాకు నచ్చింది. అందుకే ఈ కార్యక్రమం ఒప్పుకొన్నా. ఈ కార్యక్రమానికి వచ్చే నటీనటులతో కలిసి మాట్లాడతా. వాళ్ల భావోద్వేగాలు పంచుకుంటా. మాటలతో వాళ్లను ట్విస్ట్‌ చేస్తా. కలుద్దాం ‘ఆహా’లో అన్‌స్టాపబుల్‌’’ అని బాలకృష్ణ అన్నారు.

ఉన్నది ఉన్నట్లు మాట్లాడే వ్యక్తి బాలకృష్ణ: అల్లు అరవింద్‌

ఈ సందర్భంగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ మాట్లాడుతూ.. ‘‘బాలకృష్ణ వెండితెరపై నటుడేమో కానీ, నిజ జీవితంలో కాదు. భావోద్వేగాలను దాచుకోరు. కోపం, బాధ, ప్రేమ, నవ్వు ఏదైనా ఉన్నది ఉన్నట్లు చూపిస్తారు. అలాంటి వ్యక్తి వ్యాఖ్యాతగా ‘అన్‌స్టాపబుల్’ చేయడం నిజంగా ఆనందంగా ఉంది. ఒకరోజు ‘ఆహా’ టీమ్‌తో కలిసి ఏదో మాట్లాడుతూ.. ‘బాలకృష్ణతో షో చేస్తే ఎలా ఉంటుంది’ అని అన్నాను. అందరూ అరుపులు, ఈలలు వేశారు. మరో క్షణం ఆలోచించకుండా వెంటనే బాలకృష్ణకు ఫోన్‌ చేశా. ఆయన కూడా ఓకే అన్నారు. అలా ఈ షో పట్టాలెక్కింది. ఇక ఆహాకు 1.5మిలియన్‌ సబ్‌స్క్రైబర్స్‌ ఉన్నారు. ఈ ఏడాది చివరి నాటికి 2 మిలియన్‌ సబ్‌స్క్రైబర్స్‌ లక్ష్యం. పెద్ద పెద్ద  సంస్థలు కూడా పొందలేని నెంబర్లు ‘ఆహా’కు వస్తున్నాయి. ఇది తెలుగువారి ఘనత. మనవాళ్లు ఎంటర్‌టైన్‌మెంట్‌కు ఎంతో ప్రాధాన్యం ఇస్తారు. తెలుగు ఇండస్ట్రీ అంటే ఒక గౌరవంతో చూస్తున్నారు. అన్ని పరిశ్రమలకన్నా తెలుగు పరిశ్రమ గొప్పదని బాలీవుడ్‌ వాళ్లకు అనిపించింది. అందుకు కారణంగా మీరు(ప్రేక్షకులు) అందించే ప్రోత్సాహమే. అతి పెద్ద బడ్జెట్‌ సినిమాలు ఇక్కడే తీస్తున్నారు. ఎందుకంటే తెలుగువారి సినిమాలను దేశవ్యాప్తంగా చూస్తున్నారు. తెలుగు సినిమాకు దేశవ్యాప్తంగా ‘బాహుబలి’ ఎంతో గౌరవాన్ని తెచ్చింది. అలాంటి గౌరవాన్ని నిలబెట్టేందుకే ‘ఆహా’ కూడా ఉంటుందని మనస్ఫూర్తిగా చెబుతున్నా’’ అని అల్లు అరవింద్‌ అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని