James cameron: డ్రైవింగ్ నుంచి దర్శకత్వం దాకా.. జేమ్స్ కామెరూన్ లైఫ్ జర్నీ ఇది!
సినిమాలపై మక్కువతో హాలీవుడ్‌కు వచ్చిన జేమ్స్ కామెరూన్ (James cameron) అసిస్టెంట్ డైరెక్టర్, ఆఫీస్ అసిస్టెంట్‌గా కెరీర్‌ను ప్రారంభించి యావత్ ప్రపంచం మెచ్చుకునే దర్శకుడిగా ఎదిగారు.
‘టైటానిక్’ లాంటి చరిత్రాత్మక బ్లాక్ బ్లస్టర్‌ను అందించిన జేమ్స్ కామెరూన్ (James cameron)... ‘అవతార్’ సినిమాతో ప్రపంచ సినీ చరిత్రనే తిరగరాశాడు. ‘అవతార్ 2’ (Avatar The Way Of Water) తో సుదీర్ఘకాలం తర్వాత మళ్లీ మన ముందుకు రాబోతున్నాడు. డిసెంబరు 16న విడుదలయ్యే ఈ సినిమా కోసం ప్రపంచమంతా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలో ఆ సినిమా దర్శకబ్రహ్మ కామెరూన్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు..
జేమ్స్ కామెరూన్ పుట్టి పెరిగింది కెనడాలోని ఓ మధ్యతరగతి కుటుంబంలో. తండ్రి ఇంజినీర్, తల్లి గృహిణి. చదువంటే ఆసక్తిలేని కామెరూన్‌కి చిన్నతనంలో ఫిజిక్స్, ల్యాబ్‌లో ప్రయోగాలు తెగ నచ్చేవి. అందుకోసమే స్కూల్‌కి వెళ్లేవాడు. అంతేకాదు, తల్లి కథలు బాగా చెప్పేది. ఆమె ద్వారానే పుస్తకాలు చదవడానికి అలవాటు పడ్డ కామెరూన్‌కి క్రమంగా సైన్స్ ఫిక్షన్ కథల మీద ఆసక్తి పెరిగింది.
చదువు మానేసి...
కామెరూన్‌ని బాగా చదివించి తనలానే ఇంజినీర్ చేయాలనుకున్నాడు తండ్రి. హైస్కూల్ చదువయ్యాక స్థోమతకు మించి ఓ మంచి కాలేజీలో చేర్పించాడు. కానీ చదువు, ఉద్యోగం పట్ల ఆసక్తి లేక మధ్యలోనే మానేశాడు. అలాగని, తల్లిదండ్రులకు భారం కాకుండా ట్రక్ డ్రైవర్‌గా పనిచేస్తుండేవాడు. కామెరూన్ తల్లికి మాత్రం కొడుకు డ్రైవర్‌గా పనిచేయడం నచ్చేది కాదు. ఆ పని కాకుండా వేరే ఏదైనా చేయమని బతిమాలేది. ‘నచ్చిన పని చేయడంలోనే ఆనందం’ అంటూ కామెరూన్ డ్రైవర్‌గానే చేసేవాడు.
అదే మలుపు...
ఖాళీ సమయాల్లో కవితలూ, కథలూ రాసుకునేవాడు కామెరూన్. తనకి ఏదైనా రాయాలనిపిస్తే ట్రక్‌ను పక్కకు ఆపేసి రాసుకునేవాడు. మిగతా డ్రైవర్లు ఆయన్ని విచిత్రంగా చూసేవారు. అయితే 1977లో ‘స్టార్‌వార్స్’ ఫ్రాంచైజీ సినిమాలు చూశాక కామెరూన్‌కీ అలాంటి సినిమాలు తీయాలనిపించింది. లక్ష్యం పట్ల ఓ స్పష్టత తెచ్చుకుని, అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేయాలనుకున్నాడు.
చేతకాదన్నారు....
హాలీవుడ్‌లో దాదాపు రెండేళ్లపాటు ప్రయత్నాలు చేసిన కామెరూన్‌కి ఓ ప్రొడక్షన్ సంస్థలో పనిచేసే అవకాశం వచ్చింది. కొన్నాళ్లు అక్కడ సినిమా పనులతో పాటు ఆఫీస్ అసిస్టెంట్‌గానూ చేసేవాడు. అయితే అనుకోకుండా ఆ ప్రొడక్షన్ వాళ్లు తీసే ‘పిర్హనా’ అనే సినిమాకి దర్శకత్వం వహించే అవకాశం వచ్చింది. కానీ పదిరోజులపాటు ఆ సినిమాకోసం పనిచేసిన కామెరూన్‌కి దర్శకత్వం చేసే సామర్థ్యం లేదంటూ నిర్మాతలు మరొకరికి ఆ అవకాశం ఇచ్చారు.
నిరూపించుకున్నాడు...
అలాగని కామెరూన్ కోపంతో ఆ సంస్థను వదల్లేదు. ఆ సినిమాను ఎలా తీస్తున్నారో అక్కడే ప్రొడక్షన్ అసిస్టెంట్‌గా ఉండి గమనించాడు. అనుకోకుండా నిర్మాతలు ‘పిరన్హా2’కీ ప్లాన్ చేశారు. ముందే అనుకున్న దర్శకుడు కొంత కాలానికి ఆ సినిమా చేయనని చెప్పడంతో నిర్మాణ సంస్థ ‘నువ్వేంటో నిరూపించుకో’ అంటూ కామెరూన్‌కి ఆ బాధ్యత అప్పగించింది. దాంతో ప్రాణం పెట్టి తీశాడు. అది బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఇతర నిర్మాణ సంస్థలూ కామెరూన్‌ని నమ్మడం మొదలుపెట్టాయి.
కలనే కథగా రాసి
‘పిరన్హా’ షూటింగ్‌లో ఉన్నప్పుడు ఒకసారి ఫుడ్ పాయిజన్ అయితే కొన్నిరోజులు విశ్రాంతి తీసుకున్నాడు. ఆ సమయంలో ఒకరోజు ఇన్విజిబుల్ రోబో ఒకటి తనపైన దాడి చేసినట్టు పీడకల వచ్చింది. దిగ్గున లేచి కలను గుర్తు తెచ్చుకున్న కామెరూన్ రోబో కథాంశంతో కథ రాసుకుని, సినిమా తీశాడు. అదే ‘ది టెర్మినేటర్’... ఆ హిట్ కామెరూన్ జీవితాన్నే మార్చేసింది. దిగ్గజ దర్శకుల్లో ఒకడిగా నిలిపింది.
ముఖాన్నే చెప్పిందట
ఈత, వాటర్ స్పోర్ట్స్, సాహసాలంటే కామెరూన్‌కు చాలా ఇష్టం. నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్‌కోసం కొన్ని డాక్యుమెంటరీలు కూడా తీసేవాడు. అవి తీస్తున్నప్పుడే ‘టైటానిక్’ తీయాలనే ఆలోచన వచ్చింది. షూటింగ్‌కి ముందు టైటానిక్ షిప్పును చూడ్డానికి అట్లాంటిక్ మహా సముద్రం దిగువకు అనేక సార్లు డైవ్ చేశాడు. షిప్పును చూస్తూనే డైలాగులు కూడా ఆలోచించుకునేవాడట కామెరూన్. ఇక, పనిపట్ల నిబద్ధత, రాజీ పడని ధోరణి వల్ల కామెరూన్ షూటింగ్‌లో నటీనటుల పట్ల దూకుడుగా వ్యవహరించేవాడు. దాంతో చాలామంది నటీనటులు కామెరూన్‌తో రెండోసారి నటించడానికి ఇష్టపడేవారు కాదట. ‘టైటానిక్’లో హీరోయిన్‌గా చేసిన కేట్ విన్ల్సెట్ అదే మాట ఆయన ముఖాన్నే చెప్పేసిందట. చాలాసార్లు సినిమా అవకాశమిచ్చినా ఒప్పుకోలేదట. ‘అవతార్’ విడుదల తరవాత ఆమె తన అభిప్రాయం మార్చుకుని సీక్వెల్‌లో పనిచేయడానికి ఒప్పుకొందట.
కూల్‌గా మారిపోయి
‘టైటానిక్’ విడుదలకు ముందు వరకూ కామెరూన్‌కి సినిమాలే ప్రపంచం. తాను తీసిన సినిమానే తన జీవితంలో పెద్ద మార్పు తెచ్చింది అంటుంటాడు. ’‘టైటానిక్’ సినిమాను ప్రేక్షకుడిగా చూశాక మనుషులూ, జీవితం అంతకంటే ముఖ్యమని తెలుసుకున్నా’ అనే కామెరూన్ అప్పటివరకూ కోపంగా అందరిపై అరిచే ధోరణిని మార్చుకుని కూల్‌పర్సన్‌గా మారిపోయాడు. అంతేకాదు, సినిమాల నుంచి కాస్తదూరం జరిగి కొన్నాళ్లు కేవలం సముద్రాల్లో ఈదడాన్నే పనిగా పెట్టుకున్నాడు. దాదాపు మూడు గంటలపాటు సముద్రంలో గడిపి ఓ రికార్డును కూడా సృష్టించాడు.
కారులో సంభాషణలు
కామెరూన్ 1999లోనే ‘అవతార్’ కథలు సిద్ధం చేసుకున్నాడు. డబ్బులూ, టెక్నాలజీ పరంగా ఇబ్బందులు తలెత్తడంతో కాస్త విరామం తీసుకున్నాడు. అంతేకాదు, చాలా ప్రొడక్షన్ హౌస్‌లకి ‘అవతార్’ కథ నచ్చినా సినిమా తీయడం సాధ్యం కాదనేవారట. దాంతో కామెరూన్ కొన్ని ఆస్తులు అమ్ముకుని, అప్పులు చేసీ సొంతంగా నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి ‘అవతార్’ తీసి తానేంటో ప్రపంచానికి మరోసారి చూపించాడు. కారులో లాంగ్ డ్రైవ్‌లకు వెళ్లడానికి ఇష్టపడే కామెరూన్ ఆ కథకోసం సంభాషణలు కారులో కూర్చునే రాసుకున్నాడట.
మాంసం తినడు
చిన్నతనం నుంచీ కామెరూన్ జంతుప్రేమికుడు. అందుకే మాంసాహారం ముట్టడు. చివరికి పాలూ, వాటితో తయారైన పదార్థాలూ కూడా తీసుకోడు. సినీ రంగంలోకి వచ్చాక మొక్కల ఆధారిత మాంసం, చీజ్, డెయిరీ ఉత్పత్తులు తయారు చేయాలని ఓ స్టార్టప్‌నూ మొదలుపెట్టాడు. కామెరూన్ భార్య సుజీ అమీస్ ఆ వ్యాపారాలన్నీ చూసుకుంటుంది. ఇక, కామెరూన్‌కి హిందూత్వం అంటే అభిమానం. అందుకే ‘అవతార్’ పేరును సంస్కృతం నుంచి తీసుకున్నాడు. మన పురాణాల్లోని రాముడు, కృష్ణుడు, విష్ణుమూర్తి రూపాల స్ఫూర్తితో ‘అవతార్’ క్యారెక్టర్లకు నీలం రంగును ఎంచుకున్నాడు.
నీళ్లలోనే షూటింగ్
‘అవతార్2’లో పండోరాలాంటి ప్రపంచాన్ని ఈసారి నీళ్లలో సృష్టించాడు కామెరూన్. అందుకే అధిక భాగం నీళ్లలోనే చిత్రీకరణ జరిగింది. అందుకోసం 90 లక్షల గ్యాలన్ల నీళ్లను నిల్వ చేయగల వాటర్ ట్యాంకుల్ని ప్రత్యేకంగా తయారు చేయించాడు. చిత్రీకరణకు ముందు నటీనటులకూ, టెక్నీషియన్లకూ ఫ్రీ డైవింగ్, స్కూబా డైవింగ్ నేర్పించాడు. షూటింగ్ జరిగినన్ని రోజులూ వైద్యుల్నీ అందుబాటులో ఉంచాడు.
-ఈనాడు సండే డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
ODI WC 2023: ఈ తరం అత్యుత్తమ క్రికెటర్ అతడే.. మరెవరూ పోటీలేరు: యువరాజ్ సింగ్
-
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Gautham Menon: ‘లియో’.. మైండ్ బ్లోయింగ్ మూవీ: గౌతమ్ మేనన్
-
glasgow: ఖలిస్థానీల తీరును ఖండించిన గ్లాస్గో గురుద్వారా..!
-
GPS Spoofing: దారి తప్పుతున్న విమానాలు.. ఇంతకీ అక్కడ ఏం జరుగుతోంది?
-
Anganwadi Teachers: అంగన్వాడీ టీచర్లకు గుడ్‌న్యూస్.. ఇకపై వారూ పీఆర్సీ పరిధిలోకి..