Gopi Sundar: పదిలో ఫెయిల్‌.. సంగీతంలో హిట్‌!

సంగీత ప్రియులకు పరిచయం అక్కర్లేని పేరు అతనిది. కేరళ నేలపై విరబూసి, రెండు తెలుగు రాష్ట్రాల వరకు వ్యాపించిన సరికొత్త సంగీత పరిమళం ఆయన. పదో తరగతిలోనే ఫెయిలైనా.. మధురమైన  మెలోడీలు అందిస్తూ సినీ వినీలాకాశంలో సంగీత తారగా వెలుగొందుతున్న గోపి సుందర్‌ పుట్టినరోజు నేడు.

Updated : 30 May 2021 15:33 IST

 

సంగీత ప్రియులకు పరిచయం అక్కర్లేని పేరు అతనిది. కేరళ నేలపై విరబూసి, రెండు తెలుగు రాష్ట్రాల వరకు వ్యాపించిన సరికొత్త సంగీత పరిమళం ఆయన. పదో తరగతిలోనే ఫెయిలైనా.. మధురమైన  మెలోడీలు అందిస్తూ సినీ వినీలాకాశంలో సంగీత తారగా వెలుగొందుతున్న గోపి సుందర్‌ పుట్టినరోజు నేడు (30/05/21). ఈ సందర్భంగా ఆయన జీవితం, సినీ ప్రయాణంపై ఓ లుక్కేద్దాం. 

అమ్మతో రేడియో పాటలు విని..

గోపి సుందర్‌ స్వస్థలం కేరళలోని కొచ్చిన్‌. పుట్టింది, పెరిగింది, చదువుకుంది అంతా అక్కడే. ఎక్కువ సమయం అమ్మతో రేడియో పాటలు వినడం ద్వారా పాటలు, సంగీతంపై ప్రేమ పెరిగింది. తండ్రికి సొంత రికార్డింగ్‌ స్టూడియో ఉండేది. అందులో బాల్యం నుంచే పని చేయడంతో సంగీతంపై మరింత పట్టు సాధించాడు. పదో తరగతి పరీక్షల్లో ఫెయిల్‌ అయ్యాక సంగీతాన్నే జీవితంగా మలచుకోవాలని నిర్ణయించుకున్నాడు. అమ్మానాన్నల సహకారం లభించడంతో చైన్నైలోని ప్రభుత్వ సంగీత కళాశాలలో చేరాడు. అక్కడ సంతృప్తి చెందకపోవడంతో మధ్యలోనే ఇంటికొచ్చేశాడు. 

జింగిల్స్‌తో మొదలుపెట్టి...

సంగీత ప్రపంచంలోకి గోపి సుందర్‌ మొదట జింగిల్స్‌తోనే అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు యాడ్స్‌తో కలిపి 5వేలకు పైగా జింగిల్స్‌ స్వరపరిచాడు. ప్రముఖ సంగీత దర్శకుడు విశాల్‌ శేఖర్‌ దగ్గర కీబోర్డ్‌ ప్రోగ్రామర్‌గా పనిచేశారాయన. ఆ తర్వాత  ‘నోట్‌బుక్‌’ సినిమాకు అందించిన నేపథ్య సంగీతం మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. మోహన్‌లాల్‌ చిత్రం ‘ఫ్లాష్‌’తో పూర్తి స్థాయి సంగీత దర్శకుడిగా మారాడు. ‘అన్వర్’‌, ‘ఉస్తాద్‌ హోటల్‌’, ‘బెంగళూర్‌ డేస్’‌, ‘పులిమురుగున్’‌, ‘కామ్రేడ్‌ ఇన్‌ అమెరికా’, తదితర ఎన్నో సూపర్‌హిట్‌ సినిమాలకు స్వరాలు సమకూర్చాడు. అలా మలయాళంలో పాటలు కడుతూనే తమిళం, తెలుగు, హిందీ భాషల్లోనూ దూసుకుపోయాడు. 

తెలుగులో.. తేనెలాంటి పాటలతో..

క్రాంతి మాధవ్‌, శర్వానంద్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ సినిమాతో తెలుగులో అరంగేట్రం చేశాడు. తొలి చిత్రంతోనే తనకంటూ ప్రత్యేకమైన అభిమానులను సంపాదించుకున్నాడు. ‘ఎన్నో ఎన్నో వర్ణాల’, ‘వరించే ప్రేమ’ పాటలు తెలుగు హృదయాలపై తీయని సంగీత జల్లులు కురిపించాయి. ‘భలే భలే మగాడివోయ్’‌, ‘మజ్ను’, ‘ఊపిరి’, ‘గీతగోవిందం’ చిత్రాలతో తెలుగువారికి మరింత దగ్గరయ్యాడు. పాటలన్నీ సూపర్‌ హిట్లుగా మారి సినిమాల విజయంలో పాలు పంచుకున్నాయి. ‘మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్’‌, సుకుమార్‌ ‘18 పేజెస్‌’ ప్రస్తుతం గోపి సుందర్‌ చేతిలో ఉన్న తెలుగు సినిమాలు.

గాయకుడిగా.. గోపి

మలయాళంలో పదికిపైగా పాటలు పాడిన గోపి సుందర్‌ తననితాను గొప్ప సింగర్‌ అని చెప్పుకోడానికి ఇష్టపడడు. హిందీలో మాత్రం ఒకే ఒక్క పాట పాడారు. షారుఖ్‌ ఖాన్‌ చిత్రం ‘చెన్నై ఎక్స్‌ప్రెస్‌’లో చిన్మయ్‌తో కలిసి ‘తిత్లీ’ అనే పాటను ఆలపించారు. గోపి సుందర్‌ గొంతులో వైవిధ్యం ఉందని దర్శకులు విశాల్‌-శేఖర్‌ తొలిసారి హిందీలో పాడే అవకాశమిచ్చారు. తెలుగులో ‘గీత గోవిందం’ కోసం ‘కనురెప్పల కాలం’ అనే విషాద గీతాన్ని పాడారు. 

సిద్‌ శ్రీరామ్‌, గోపీ సుందర్‌ హిట్‌ పెయిర్

సంగీత ప్రపంచంలో సిద్‌ ఓ సంచలనం. ఆయనతో జతకట్టి గోపి సృష్టించిన గీతాలు శ్రోతలను ఊర్రూతలూగించాయి. ‘నిన్ను కోరి’ సినిమాలోని ‘అడిగా అడిగా’ అనే విషాద గీతం యువ హృదయాలను పిండేసింది. ‘గీత గోవిందం’లోని ‘ఇంకేం ఇంకేం కావాలే’, ‘వచ్చిందమ్మా..’ పాటలు కూడా బంపర్‌ హిట్‌ కావడంతో వీరిద్దరిది హిట్‌ పెయిర్‌ అన్న ముద్ర పడింది.  ‘శైలజా రెడ్డి అల్లుడు’, ‘చూసీ చూడంగానే’, ‘నిశ్శబ్దం’ సినిమాల్లో అదిరిపోయే పాటలిచ్చారు. ఆ గీతాలు యూట్యూబ్‌లో ఇంకా ట్రెండ్‌ అవుతున్నాయి. ‘మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్‌’లోని ‘మనసా మనసా’ ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది. కొత్త పాటలతో ఎప్పుడొస్తారని అభిమానులు ఎదురుచూసేంతగా ఈ జంట విజయవంతం అయింది. 

సంగీతానికి సొంత బ్యాండ్‌

గోపి సుందర్‌ ‘బ్యాండ్‌ బిగ్‌ జీ’ పేరుతో సొంత మ్యూజిక్‌ బ్యాండ్‌ ఏర్పాటు చేసుకున్నాడు. ఈ బ్యాండ్‌ ద్వారా విదేశాల్లో సంగీత ప్రదర్శనలు ఇస్తుంటాడు. మొదటి ప్రదర్శనను దుబాయిలో ఇచ్చారు. అలాగే ‘గోపి సుందర్‌ మ్యూజిక్‌ కంపెనీ’ అనే సంస్థను 2014లో ప్రారంభించారు. తక్కువ బడ్జెట్‌లో సంగీతం అందించి యువ సినీ ఔత్సాహికులకు తోడ్పాటు అందించడానికి దీన్ని మొదలుపెట్టారు. ఈ వేదికగానే కొత్త ప్రతిభను ప్రోత్సహిస్తున్నారు గోపి సుందర్‌.

అవార్డులు 

గోపి సుందర్ అందించిన పాటలు పలు అవార్డులు గెలుచుకున్నాయి. పార్వతి మీనన్‌ ‘టేక్‌ ఆఫ్‌’కు అందించిన నేపథ్య సంగీతానికి కేరళ అవార్డు వరించింది. అలాగే  ‘1983’ సినిమాకు నేపథ్య సంగీతానికి జాతీయ అవార్డు అందుకున్నాడు. ఇలా మరెన్నో అవార్డులు ఆయన్ను వరించాయి. 90వ ఆస్కార్‌ పోటీలకు బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌, ఒరిజినల్‌ స్కోర్‌ విభాగాలకు ‘పులిమురుగన్‌’ను మన దేశంనుంచి పంపించారు. అయితే నామినేషన్‌ మాత్రం దక్కలేదు. 

 

సంగీతం నుంచి నటనలోకి

సంగీత దర్శకుడిగా ఇన్నాళ్లు అలరించి ఇప్పుడు హీరోగా మెప్పించేందుకు సిద్ధమవుతున్నాడు గోపి సుందర్‌. హరిక్రిష్ణన్‌ దర్శకత్వంలో మలయాళంలో ‘టోల్‌గేట్‌’ అనే థ్రిల్లర్‌లో హీరోగా నటిస్తున్నాడు. ‘సలలా మొబైల్స్‌’, ‘మిస్టర్‌ ఫ్రాడ్‌’ లాంటి చిత్రాల్లో మెరిసిన ఈయన  పూర్తిస్థాయి హీరోగా నటించడం ఇదే తొలిసారి. ఈ ఏడాది చివర్లో విడుదల కానుంది. నటుడిగా కన్నా సంగీత దర్శకుడిగా కొనసాగడమే ఇష్టం అంటున్నాడు గోపి సుందర్‌.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts