raj and dk: బాలీవుడ్‌లో తెలుగోడి జెండా

ఇండియాలో వెబ్‌ సిరీస్‌ల స్థాయిని పెంచిన ఈ దర్శక ద్వయం సినీ ప్రయాణంపై ఓ ప్రత్యేక కథనం

Updated : 08 Jun 2021 09:11 IST

‘ఫ్యామిలీమ్యాన్‌’ దర్శకద్వయం రాజ్‌ అండ్‌ డీకేల సినీ ప్రయాణం

తెలుగువాళ్లై ఉండి బాలీవుడ్‌ బాట పట్టినప్పుడు అక్కడ నెగ్గుకు రాగలరా? అని సందేహపడ్డారు. సినిమాలు చేస్తున్న సమయంలో వెబ్‌ సిరీస్‌ల వైపు మళ్లినప్పుడు ఉన్న పేరు పోగొట్టుకుంటారని భయపెట్టిన వారున్నారు.  స్వతంత్ర చిత్రాల నిర్మాణం మొదలుపెట్టి ‘సినిమా బండి’ లాంటివి తీస్తామన్నప్పుడూ అంతే.. ఇలాంటి సినిమాలు ఆడతాయా? అని మొహం మీదే అన్నవారున్నారు. అందరి అంచనాలు పటాపంచలు చేస్తూ అన్నింటా విజయం సాధించి దూసుకుపోతున్నారు రాజ్‌ అండ్‌ డీకే.  కంటెంటున్నోడికి అడ్డంకులుండవని నిరూపిస్తున్నారు.  ప్రతీ మలుపులోనూ సాహోసపేతమైన నిర్ణయాన్నే ఎంచుకుంటూ సినీ రంగంలో తమదైన ముద్రవేస్తున్నారు.  తాజాగా  విడుదలైన ‘ది ఫ్యామిలీ మ్యాన్‌’ రెండో సీజన్‌ భారతీయులను విశేషంగా అలరిస్తోంది. ఇండియాలో వెబ్‌ సిరీస్‌ల స్థాయిని పెంచిన ఈ దర్శక ద్వయం సినీ ప్రయాణంపై ఓ ప్రత్యేక కథనం.

 

తిరుపతి, చిత్తూరు పిలకాయలు

రాజ్‌ నిడిమోరు, కృష్ణ దాసరి కొత్తపల్లి(డీకే) ఇద్దరూ చిత్తూరు జిల్లాకు చెందిన వారు. సినిమా మీద వ్యామోహంతో ఒక్కటయ్యారు. వాళ్లిద్దరి పేర్లు కూడా ఇప్పుడు విడదీయరానంత బలంగా కలిసిపోయాయి. రాజ్‌ అండ్‌ డీకే ఆ పేరు ఓటీటీ విపణిలో ఇప్పుడొక  బ్రాండ్‌. వీరిద్దరూ ఇంత పేరు సాధించడం వెనక అసామాన్య ప్రతిభతో పాటు, కష్టం కూడా దాగుంది. రాజ్‌ నిడిమోరుది తిరుపతి, కృష్ణ డీకే స్వస్థలం చిత్తూరు. శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌  వీరిద్దరిని కలిపింది. ఇద్దరూ కళా ప్రేమికులు కలిస్తే ఎలా ఉంటుంది. సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడలు, క్విజ్‌ ఇలా కార్యక్రమమేదైనా విజేతలు వీరే. కలిసి థియేటర్లకి వెళ్లడం, సినిమాలను విశ్లేషించుకోవడం ఓ దినచర్యలా మారిపోయింది.  అలా నాలుగేళ్లు తిరుపతిలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసి పై చదువుల కోసం అమెరికా బాట పట్టారు.

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం వదిలేసి..

అమెరికాకి వెళ్లాక సినిమాపై ఉన్న ఇష్టం కాస్త వ్యామోహంగా మారింది. రోడ్లపై ప్రయాణాలు చేస్తున్నప్పుడు, వారాంతాల్లో ఖాళీ సమయం చిక్కినప్పుడు కెమెరాతో వీడియోలు తీసి చూసుకునేవారు. రాబర్ట్ రోడ్రిగేజ్‌ రాసిన ‘రెబెల్‌ వితౌట్‌ ఎ క్రూ’ పుస్తకం చదివాక సినిమా తీయడంపై ఇంకాస్త అవగాహన పెరిగింది. ఎడిటింగ్‌, సంగీతం, స్ర్కీన్‌ రైటింగ్ ఇలా సినిమాకు సంబంధించిన ప్రతి విషయంపైనా పరిధిని పెంచుకున్నారు. కట్టుదిట్టమైన స్ర్కీన్‌ప్లేతో కథ రాసుకొని అక్కడున్న ఇండియన్స్‌తోనే వారాంతాల్లో లఘు చిత్రాలు తీయడం ప్రారంభించారు. అలా మొదట 8 నిమిషాల నిడివితో ‘జస్ట్‌ మీ’ అనే థ్రిల్లర్‌ను తెరకెక్కించారు. దానికి అవార్డులు వరించాయి.  ఆ తర్వాత ‘లవ్’‌, ‘షాది.కామ్‌’ లాంటి మరికొన్ని లఘు చిత్రాలను తీశారు. వీటితో పూర్తి సినిమా తీయాగలమనే ధైర్యం వచ్చింది. వెంటనే అనూప్‌ మిట్టల్‌తో కలిసి సొంత డబ్బులతో ‘ఫ్లేవర్స్‌’ అనే ఇండిపెండెంట్ సినిమాను తెరకెక్కించారు.  ఆ చిత్రం విడుదల కోసం స్వదేశానికొచ్చారు. అలా తమకిష్టమైన సినిమాకోసం సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాన్ని వదిలేశారు.

ఇండియా పయనం

‘ఫ్లేవర్స్‌’ ను విడుదల చేసి బాలీవుడ్‌లో రెండో సినిమా ప్రయత్నాలు చేద్దామని ఇండియాకు తిరిగొచ్చారు. అయితే వారికి కొన్ని అడ్డంకులెదురయ్యాయి. అప్పటికీ ఆ ఇద్దరికి హిందీ రాదు పైగా బాలీవుడ్‌లో తెలిసినవారు ఒక్కరూ కూడా లేరు. ఆరు నెలలు ఇక్కడే ఉండి అవకాశాల కోసం చూశారు.  ఫలితం లేకపోయింది. చెప్పే కథలు కొందరికి నచ్చుతున్న కూడా, బయటివాళ్లను నమ్మి డేట్స్ ఇచ్చేందుకు సుముఖంగా లేరు. దీంతో రాజ్‌ అండ్‌ డీకే ద్వయం  తిరిగి అమెరికా పయనమైంది. అక్కడ రెండేళ్లు కష్టపడి సినిమా నిర్మాణానికి కావాల్సినంత డబ్బులు సంపాదించారు. మళ్లీ సినిమా కలను మోసుకుంటూ ముంబయిలో వాలారు.  అనుపమ్‌తో కలిసి ‘99’ అనే థ్రిల్లర్‌ సినిమా తీశారు. అది కమర్షియల్‌గా సక్సెస్‌ సాధించడంతో పాటు అవార్డులనూ గెలుచుకుంది. దీంతో వారు తిరిగి అమెరికా విమానం ఎక్కాల్సిన అవసరం రాలేదు. ఇది విడుదలైన కొన్ని నెలలకే ‘షోర్‌ ఇన్‌ ది సిటీ’ హక్కులను ఏక్తా కపూర్‌ తీసుకుంది.  అదీ మంచి విజయం సాధించింది. ఆ తర్వాత తొలి ఇండియన్‌ జాంబీ చిత్రం ‘గో గోవా గాన్‌’ తీశారు.  రూ.పది కోట్ల బడ్జెట్‌తో తీస్తే రూ. 40 కోట్ల వసూళ్లు సాధించి పెట్టింది. దీంతో బాలీవుడ్‌లో బలమైన పునాది పడినట్లైంది. సినిమా కథ నచ్చి వెంటనే ఒప్పుకొన్న సైఫ్‌ అలీఖాన్‌ ఆ సినిమా నిర్మాణంలో భాగమయ్యారు. అలా ప్రతి సినిమాకు వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ బాలీవుడ్‌ చూపును తమవైపునకు తిప్పుకుందీ దర్శకద్వయం. ‘హ్యాపీ ఎండింగ్’, ‘స్త్రీ’, ‘ఏ జెంటిల్‌మాన్‌’ లాంటి సినిమాలు చేస్తూ బాలీవుడ్‌లో తెలుగోడి జెండాను బలంగా పాతారు. ప్రస్తుతం షాహిద్‌ కపూర్‌ డిజిటల్‌ అరంగేట్రానికి వీరే రంగం సిద్ధం చేస్తున్నారు. షారుఖ్‌ ఖాన్‌తోనూ ఓ సినిమా చేయననున్నట్లు సమాచారం.

తెలుగు సినిమా అంటే ప్రేమ

బాలీవుడ్‌లో విజయవంతమైన చిత్రాలు చేసినా.. ‘ఫ్యామిలీమ్యాన్‌’లాంటి వెబ్‌ సిరీస్‌లతో విశ్వవ్యాప్తమవుతున్నా.. టాలీవుడ్‌పై ప్రేమను చూపుతూనే ఉంటుందీ దర్శక జంట. ‘గో గోవా గాన్‌’ చిత్రం విజయం సాధించిన వెంటనే తెలుగులో ‘డీ ఫర్‌ దోపిడి’ని నిర్మించారు.  ‘సినిమా బండి’లాంటి  వినూత్నమైన చిత్రాన్ని అందించి స్వతంత్ర సినిమాలపై వారికున్న అభిరుచిని చాటుకున్నారు.  అంతేకాదు  శ్రేయా ధన్వంతరి, సందీప్‌ కిషన్‌, సమంత అక్కినేనిలాంటి ఇక్కడి నటులకు ‘ఫ్యామిలీ మ్యాన్‌’లో చోటిచ్చి  తెలుగు ప్రతిభను దేశవ్యాప్తం చేశారు. తెలుగులో ఎప్పటినుంచో సినిమా తీయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ‘ఫ్యామిలీ మ్యాన్’‌తో పాటు, హిందీలో ఒప్పుకున్న ఇంకొన్ని ప్రాజెక్టుల కారణంగా అవి సాధ్యపడలేదు. మహేశ్‌బాబు, విజయ్‌ దేవరకొండలతో కథా చర్చలు జరుగుతున్నాయి.

రెండు గంటల్లో చెప్పలేమని..

ఇండియన్‌ స్టైల్ లో ఓ భారీ స్పై థ్రిల్లర్‌ను తీయాలని చాన్నాళ్ల నుంచే వారికి ఆలోచన ఉంది. ‘ఏ జెంటిల్‌మ్యాన్‌’తో కొంత  ప్రయత్నం చేశారు. ముంబయి వీధుల్లో తిరిగే జేమ్స్‌బాండ్‌లాంటి కథను  రెండు గంటల్లో చెబితే తేలిపోతుందని రాజ్‌ అండ్‌ డీకే అభిప్రాయపడ్డారు. అందులోని భావోద్వేగాలు, సంఘర్షణలను పండించాలంటే  వెబ్‌ సిరీస్‌గా తీస్తేనే బాగుంటుందన్న భావనతో ‘ది ఫ్యామిలీ మ్యాన్‌’కి బీజం పడింది.  2019లో మొదటి సీజన్‌ అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా ప్రేక్షకుల ముందుకొచ్చింది.  విడుదలైన వారం రోజుల నుంచే ప్రశంసలు వెల్లువ కురిసింది. గూఢచారిగా మనోజ్‌ బాజ్‌పాయ్‌ నటనతో రక్తి కట్టించడంతో ఓటీటీ సూపర్‌స్టార్‌గా మారిపోయాడు.  రెండో సీజన్‌లో సమంతకు ఓ విభిన్న పాత్ర పోషించే అవకాశమిచ్చారు. తమిళనాడులో  వివాదాలు చుట్టుముట్టినా ఇది కూడా భారీ విజయాన్ని సాధించింది. విడుదలైన రోజు నుంచే మూడో సీజన్‌ ఎప్పుడంటూ దేశవ్యాప్తంగా అడుగుతున్నారంటే ఈ వెబ్‌ సిరీస్‌ ఎంతగా విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  ఈ ప్రశంసలు, అభినందనల జల్లులో తడుస్తూనే మూడో సీజన్‌ను మరింతగా రక్తికట్టించే పనుల్లో నిమగ్నమైపోయారు తిరుపతి, చిత్తూరు కుర్రాళ్లు రాజ్‌ నిడిమోరు, కృష్ణ డీకే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు