Vijay Deverakonda: సినిమా వేడుకలు రద్దైతే నేను ఆనందిస్తా: విజయ్‌ దేవరకొండ

భారతీయ సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ‘లైగర్‌’ ఈ గురువారం విడుదలకాబోతుంది.  ప్రచారంతో చిత్ర బృందం ఫుల్‌ బిజీగా ఉంది. ఇప్పుటికే పలు నగరాల్లో నిర్వహించిన వేడుకల్లో పాల్గొని సందడి చేయగా ఇప్పుడు ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో సినిమా విశేషాలు పంచుకుంది.

Published : 23 Aug 2022 16:51 IST

ఇంటర్నెట్‌ డెస్క్: సినీ ప్రపంచంలో ప్రస్తుతం ఎక్కువగా వినిపిస్తున్న పేరు ‘లైగర్‌’. విజయ్‌ దేవరకొండ హీరోగా దర్శకుడు పూరి జగన్నాథ్‌ తెరకెక్కించిన పాన్‌ ఇండియా చిత్రమిది. భారీ అంచనాల నడుమ ఈ చిత్రం ఈ గురువారం విడుదలకాబోతుంది. ఇప్పుటికే పలు నగరాల్లో నిర్వహించిన వేడుకల్లో పాల్గొని సందడి చేసిన చిత్ర బృందం ఇప్పుడు ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో తళుక్కుమంది. సుమ హోస్ట్‌గా వ్యవహరించిన ఈ చిట్‌చాట్‌లో హీరోహీరోయిన్లు విజయ్‌ దేవరకొండ, అనన్య పాండే, దర్శకుడు పూరి జగన్నాథ్‌, నిర్మాత ఛార్మి, నటుడు విష్ణురెడ్డి పాల్గొని, పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. 

‘‘హైదరాబాద్‌ నుంచే ఈ సినిమా ప్రచారాన్ని మొదలుపెట్టాం. ట్రైలర్‌ విడుదలకు వచ్చిన అభిమానగణాన్ని చూసి షాక్‌ అయ్యా. ఇదే అభిమానం ఇతర నగరాల్లో కనిపిస్తుందా, లేదా? మన చిత్రాన్ని ఎలా ప్రమోట్‌ చేయాలి? అని టెన్షన్‌ పడ్డా. కానీ, ముంబయి సహా ఇతర సిటీల్లో ఎంతోమంది మమ్మల్ని చూసేందుకు వచ్చారు. ఆ జనసందోహాన్ని చూశాక ఏదో తెలియని ఫీలింగ్‌ కలిగింది. ఒకప్పుడు నేను నటుణ్ణి కాగలనా? అనే సందేహం ఉండేది. అలాంటిది ఇప్పుడు నాపై ఇంతమంది ప్రేమను కురిపిస్తుంటే మాటలు రావట్లేదు. వేదికలపై డ్యాన్స్‌ చేయడమంటే నాకు నచ్చదు. అందుకే కొన్ని సార్లు ఈవెంట్లు క్యాన్సిల్‌ అయితే ఆనందిస్తా (నవ్వుతూ..). ‘లైగర్‌’ తర్వాత నాలో చాలా మార్పులొచ్చాయి’’ అని విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) అన్నారు. 

‘‘ఇతర సినిమాల ట్రైలర్లలో కథనే ఎడిట్‌ చేసి చూపిస్తున్నారు. అందుకే మేం మా ట్రైలర్‌లో స్టోరీ గురించి చెప్పకుండా కొత్తగా ప్రయత్నించాం. ఈ సినిమాలోని కథానాయకుడిది కరీంనగర్‌. వాళ్లమ్మ తన కొడుకుని నేషనల్‌ ఛాంపియన్‌గా చూడాలనుకుంటుంది. అలా హీరో నేషనల్‌ కాదు ఇంటర్నేషనల్‌ స్థాయిలో మెరుస్తాడు. అతను అక్కడికి చేరుకునేందుకు ఎంత కష్టపడ్డాడు? తన ప్రేమ వ్యవహారం ఏంటి? మైక్‌ టైసన్‌ ఎందుకు వచ్చాడు? అనేది లైగర్‌ కథ. ప్రధానంగా లవ్‌, యాక్షన్‌ నేపథ్యంలో సాగుతుంది. మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ (ఎంఎంఏ) బ్యాక్‌డ్రాప్‌ ఉంటుంది. ఈ సినిమా గురించి చెప్పేందుకు సింపుల్‌గానే ఉంటుంది కానీ పాత్రల తీరు తెన్నులు వివరించటం, తెరకెక్కించటం చాలా కష్టం’’ అని పూరి జగన్నాథ్‌ (Puri Jagannadh) వెల్లడించారు.

‘‘ముందుగా ఈ చిత్రానికి ఫైటర్‌ అనే పేరు పెట్టాలనుకున్నాం. కానీ, రొటీన్‌గా ఉంటుందని ఖరారు చేయలేదు. కొన్ని రోజుల తర్వాత, ‘లైగర్‌’ అని పెడితే ఎలా ఉంటుంది? అని పూరి జగన్నాథ్‌ అడిగారు. దానర్థం తెలియగానే ‘ఇది కదా టైటిల్‌ అంటే’ అని అనిపించింది. నిర్మాత కరణ్‌ జోహార్‌, విజయ్‌ దేవరకొండకి ఈ టైటిల్‌ అనుకుంటున్నామని చెప్పగానే ఇద్దరూ అద్భుతంగా ఉందన్నారు. ఈ సినిమా ప్రచారం ప్రారంభించిన సమయంలో విజయ్‌కి జ్వరం వచ్చింది. నాకు ఫోన్‌ చేసి ‘ఛార్మీ.. రూమ్‌లో ఉండటం నా వల్ల కావట్లేదు. త్వరగా ప్రమోషన్‌ ప్రారంభిద్దాం’ అని అనేవాడు. మైక్‌ టైసన్‌కి భారతీయ వంటకాలంటే మహా ఇష్టం’’ అని ఛార్మి (Charmy Kaur) తెలిపారు.

లైగర్‌పై వచ్చిన మీమ్స్‌, ట్రోల్స్‌ చూసి చిత్ర బృందం ఎలా స్పందించింది? ఎన్టీఆర్ హీరోగా తాను దర్శకత్వం వహించిన ‘ఆంధ్రావాలా’ ఆడియో రిలీజ్‌ ఫంక్షన్‌ గురించి పూరి జగన్నాథ్‌ ఏం చెప్పారు? తదితర ఆసక్తికర విశేషాల కోసం వీడియోపై క్లిక్‌ చేయండి..

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts