Like Share Subscribe review: రివ్యూ: లైక్‌ షేర్‌ అండ్‌ సబ్‌స్క్రైబ్‌

Like Share Subscribe review: సంతోష్‌శోభన్‌, ఫరియా అబ్దుల్లా, బ్రహ్మాజీ, సుదర్శన్‌ కీలక పాత్రల్లో మేర్లపాక గాంధీ తెరకెక్కించిన ఈ సినిమా ఎలా ఉందంటే?

Published : 04 Nov 2022 15:02 IST

Like Share Subscribe review; చిత్రం: లైక్‌ షేర్‌ అండ్‌ సబ్‌స్క్రైబ్‌; నటీనటులు: సంతోష్‌ శోభన్‌, ఫరియా అబ్దుల్లా, నెల్లూరు సుదర్శన్‌, బ్రహ్మాజీ, దయానంద్‌ రెడ్డి, మైమ్‌ గోపీ, గోవింద్‌ పద్మసూర్య, సప్తగిరి తదితరులు; సంగీతం: ప్రవీణ్‌ లక్కరాజు, రామ్‌ మిర్యాల; ఛాయాగ్రహణం: ఎ.వసంత్‌; కూర్పు: రామ్‌ తూము; రచన, దర్శకత్వం: మేర్లపాక గాంధీ; నిర్మాత: వెంకట్‌ బోయనపల్లి; విడుదల తేదీ: 04-11-2022

తెలుగు చిత్రసీమలో అగ్రతారల చూపంతా క్రిస్మస్‌, సంక్రాంతి సీజన్లపైనే పడింది. దీంతో ఇప్పుడు బాక్సాఫీస్‌ ముందు చిన్న సినిమాల సందడి కనిపిస్తోంది. ఈ వారం దాదాపు అరడజనుకు పైగా చిత్రాలు థియేటర్‌ ముందుకు వరుస కట్టాయి. అందులో ఒకటి ‘లైక్‌ షేర్‌ అండ్‌ సబ్‌స్క్రైబ్‌’. ‘ఏక్‌ మినీ కథ’తో మెప్పించిన సంతోష్‌ శోభన్‌ హీరోగా నటించిన చిత్రమిది. వినోదాత్మక చిత్రాలకు చిరునామాగా నిలిచే మేర్లపాక గాంధీ తెరకెక్కించారు. ప్రభాస్‌, నాని వంటి స్టార్‌ హీరోలు ఈ సినిమాకి ప్రచారం చేయడం.. టీజర్‌, ట్రైలర్లు వినోదాత్మకంగా ఉండి అందరి దృష్టినీ ఆకర్షించడంతో దీనిపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. (Like Share Subscribe review) మరి ఈ చిత్ర కథేంటి? ప్రచార చిత్రాలతో నవ్వించిన ఈ సినిమా థియేటర్లలో ఏ స్థాయిలో వినోదం పంచింది?

కథేంటంటే: విప్లవ్‌ ఓ ట్రావెల్‌ వ్లాగర్‌. గువ్వ విహారి అనే యూట్యూబ్‌ ఛానెల్‌ను నడుపుతుంటాడు. రకరకాల ప్రాంతాలు తిరిగి వీడియోలు తీసి.. వాటిని తన ఛానెల్‌లో అప్‌లోడ్‌ చేస్తుంటాడు. ఇలా తన వీడియోలతో మిలియన్ల కొద్దీ సబ్‌స్క్రైబర్స్‌ను సంపాదించుకొని పాపులర్‌ యూట్యూబర్‌గా పేరు తెచ్చుకోవాలని కలలు కంటుంటాడు. ఈ క్రమంలోనే ప్రకృతి అందాల్ని తన కెమెరాలో బంధించేందుకు అరకు వెళ్తాడు. అక్కడికి వసుధ (ఫరియా అబ్దుల్లా) కూడా వస్తుంది. ఆమె కూడా ఓ ట్రావెల్‌ వ్లాగరే. తన ఛానెల్‌కు 3మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్స్‌ ఉంటారు. ఆమెనే విప్లవ్‌ కూడా స్ఫూర్తిగా భావిస్తుంటాడు. అంతేకాదు ఆమె పెట్టే ట్రావెల్‌ వీడియోలు చూసి ఆమెతో ప్రేమలో పడతాడు. తొలుత విప్లవ్‌ను ద్వేషించిన వసుధ తర్వాత అతన్ని ఇష్టపడటం మొదలు పెడుతుంది. అయితే కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల వాళ్లు పీపుల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ (పీపీఎఫ్‌) అనే ఓ నక్సల్‌ దళం చేతుల్లో చిక్కుతారు. మరి వీరికి నక్సల్స్‌కు ఉన్న సంబంధం ఏంటి? వాళ్లు వసుధ తండ్రిని ఎందుకు చంపాలనుకుంటుంటారు? (Like Share Subscribe review) వీరి నుంచి విప్లవ్‌, వసుధ ఎలా తప్పించుకున్నారు? ఈ క్రమంలో వాళ్లకు ఎదురైన సవాళ్లేంటి? వీరి ప్రయాణంలో బ్రహ్మన్న (బ్రహ్మాజీ), జువ్వా దివాకరం (సుదర్శన్‌)ల పాత్రేంటి? అన్నది తెరపై చూసి తెలుసుకోవాలి.

ఎలా ఉందంటే: ఓ సీరియస్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగే వినోదాత్మక చిత్రమిది. ఇందులో ఓవైపు నక్సల్‌ ఉద్యమానికి సంబంధించిన ఓ సీరియస్‌ కథ నడుస్తుంటుంది. మరోవైపు ఒక ట్రావెల్‌ వ్లాగర్స్‌ జంట సాగించే వినోదాత్మక ప్రయాణం కనిపిస్తుంటుంది. ఇలా రెండు విభిన్న ధ్రువాల్లాంటి నేపథ్యాల్ని సరైన రీతిలో మిక్స్‌ చేసి ఓ కథగా చెప్పాలంటే చాలా నేర్పు ఉండాలి. కథలోని సీరియస్‌నెస్‌ను.. వినోదాన్ని సరైన రీతిలో బ్యాలెన్స్‌ చేయలేకపోతే మొదటికే మోసం వస్తుంది. ఆ సినిమా ఇటు వినోదం పంచలేక.. అటు థ్రిల్‌ చేయలేక రెండిటికీ చెడ్డ రేవడిలా తయారవుతుంది. ఈ ‘లైక్‌ షేర్‌ అండ్‌ సబ్‌స్క్రైబ్‌’ చిత్ర విషయంలో అదే జరిగింది. దర్శకుడు ఓ సీరియస్‌ బ్యాక్‌డ్రాప్‌ను ఎంచుకొని దాన్ని పూర్తి వినోదాత్మకంగా వడ్డించే ప్రయత్నం చేశాడు. అయితే ఇటు నక్సల్స్‌ కథలో సరైన సంఘర్షణ లేకపోవడం.. అటు విప్లవ్‌ - వసుధల కథలో సరైన వినోదం, భావోద్వేగాలు పండకపోవడంతో సినిమా గాడితప్పింది. 90ల నాటి పీపుల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ (పీపీఎఫ్‌) నక్సల్‌ ఉద్యమ నేపథ్యంతో సినిమాని ప్రారంభించిన తీరు ఆకట్టుకుంటుంది. శాంతి చర్చల పేరుతో ప్రభుత్వం వారితో చర్చలు జరపాలనుకోవడం.. ఆ చర్చల్లో పాల్గొనడానికి వచ్చిన నక్సల్‌ నాయకులు కనిపించకుండా పోవడం.. దీంతో పోలీసు వ్యవస్థపై, ప్రభుత్వంపై పీపీఎఫ్‌ ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధమవ్వడం.. వంటి సన్నివేశాలతో సినిమా తొలి 15నిమిషాలు ఆసక్తిరేకెతిస్తూ సాగిపోతుంది.

ఇక ఆ తర్వాత నుంచి విప్లవ్‌ ట్రావెల్‌ వ్లాగింగ్‌ కథ మొదలవుతుంది. అతని పరిచయ సన్నివేశాలు..  యూట్యూబ్‌ ఛానెల్‌ను పాపులర్‌ చేయడం కోసం తను పడే పాట్లను వినోదాత్మకంగా చూపించే ప్రయత్నం చేశారు. అందులో కొన్ని నవ్వులు పంచగా.. మరికొన్ని  అతిగా అనిపిస్తాయి. విప్లవ్‌ అరకు వెళ్లడం.. అక్కడ వసుధ పరిచయమవ్వడం.. ప్రేమ పేరుతో అతను ఆమె వెంట తిరగడం.. వంటి ఎపిసోడ్లన్నీ మరీ రొటీన్‌గా అనిపిస్తాయి. విరామానికి ముందు వసుధ తండ్రిపై పీపీఎఫ్‌ నక్సల్స్‌ గ్రూప్‌ కాల్పులు జరపడం.. ఆ వెంటనే అరకులో విప్లవ్‌, వసుధ అనుకోకుండా పీపీఎఫ్‌ సభ్యులైన బ్రహ్మన్న (బ్రహ్మాజీ) బృందానికి చిక్కడంతో ద్వితీయార్ధం ఏం జరగనుందా? అన్న ఆసక్తి మొదలవుతుంది. బ్రహ్మాన్న బృందంతో ప్రయాణం ప్రారంభించాక విప్లవ్‌, వసుధకు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? పోలీసులకు నక్సల్స్‌కు మధ్య జరుగుతున్న పోరాటంలో ఎవరు పైచేయి సాధించారు? అన్నది సెకండాఫ్‌లో కీలకం. నిజానికి సీరియస్‌గా సాగాల్సిన ఈ  సిల్లీ కామెడీ ఎపిసోడ్స్‌తో మరీ చప్పగా మార్చేశారు దర్శకుడు గాంధీ. పతాక సన్నివేశాల్లో వచ్చే యాక్షన్‌ ఎపిసోడ్‌, సినిమాని ముగించిన తీరు ప్రేక్షకుల్ని ఏమాత్రం మెప్పించవు.

ఎవరెలా చేశారంటే: ట్రావెల్‌ వ్లాగర్‌ విప్లవ్‌ పాత్రలో సంతోష్‌ శోభన్‌ చక్కగా ఒదిగిపోయారు. ఆయన డైలాగ్‌ డెలివరీ, కామెడీ టైమింగ్‌ ఆకట్టుకున్నాయి. వసుధ పాత్రలో ఫరియా ఫర్వాలేదనిపించింది. కథలో ఆమె పాత్రను బలంగా తీర్చిదిద్దుకునే అవకాశమున్నా.. అంతగా వాడుకోలేదు. పీపీఎఫ్‌ దళ సభ్యుడు బ్రహ్మన్నగా బ్రహ్మాజీ, పైరసీ వీడియోగ్రాఫర్‌ జువ్వా దివాకరంగా సుదర్శన్‌ అక్కడక్కడా నవ్వులు పంచారు. మిగిలిన పాత్రలన్నీ పరిధి మేరకే ఉంటాయి. దర్శకుడు గాంధీ రాసుకున్న కథలో సరైన సంఘర్షణ కనిపించలేదు. సీరియస్‌గా సాగాల్సిన నక్సల్‌ నేపథ్యాన్ని జబర్దస్త్‌ కామెడీ స్కిట్‌లా మార్చేయడంతో ప్రేక్షకులు ఏ దశలోనూ వారి కథతో కనెక్ట్‌ కాలేరు. దీనికి తోడు విప్లవ్‌, వసుధ ప్రేమకథలోనూ సరైన భావోద్వేగాలు కనిపించవు. రొటీన్‌ కామెడీ ట్రాక్స్‌ ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడతాయి. పాటల్లో ఒకటి రెండు బాగున్నాయి. నేపథ్య సంగీతం ఓకే అనిపించే స్థాయిలో ఉంది. వసంత్‌ ఛాయాగ్రహణం బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

బలాలు

+ సంతోష్‌, ఫరియా నటన

+ బ్రహ్మాజీ పాత్ర

బలహీనతలు

- స్క్రీన్‌ప్లే

- రొటీన్‌ కామెడీ

- ద్వితీయార్ధం,ముగింపు

చివరిగా: లైక్‌ అండ్‌ సబ్‌స్క్రైబ్‌ చేయడం కష్టమే!

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని