oscar nominations 2023: ఇప్పటివరకూ ఆస్కార్‌కు నామినేట్‌ అయిన భారతీయ చిత్రాలివే!

oscar nominations 2023: భారత దేశం నుంచి ఇప్పటివరకూ ఆస్కార్‌కు నామినేట్‌ అయిన చిత్రాలు, వాటి వివరాలు ఇవే!

Published : 25 Jan 2023 01:21 IST

oscar nominations 2023: యావత్‌ సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా చూసిన ఆస్కార్‌ అవార్డుల నామినేషన్‌ ప్రక్రియ ముగిసింది. వివిధ కేటగిరిల్లో పలు చిత్రాలు నామినేషన్‌ దక్కించుకున్నాయి. ఈ ఏడాది వివిధ భాషల్లో దాదాపు 300ల సినిమాలు ఆస్కార్‌ నామినేషన్‌కు షార్ట్‌లిస్ట్‌ అవగా, వాటిలో ఉత్తమ చిత్రాలు ఇప్పుడు అవార్డుల బరిలో నిలిచాయి. భాషతో సంబంధం లేకుండా అందరినీ అలరించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) లోని ‘నాటు నాటు’ (Naatu Naatu) పాట ఉత్తమ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరిలో ఆస్కార్‌కు నామినేట్‌ అయింది. ఈ ఏడాది భారత ప్రభుత్వం అధికారికంగా గుజరాతీ చిత్రం ‘ఛెల్లో షో’ను నామినేషన్‌కు పంపినా తుది జాబితాలో చోటు దక్కించుకోలేకపోయింది. 1957 నుంచి ఇప్పటివరకూ మొత్తం 54 చిత్రాలు భారత్‌ నుంచి ఆస్కార్‌ షార్ట్‌లిస్ట్‌కు వెళ్లాయి. వాటిలో తెలుగు చిత్రం ‘స్వాతిముత్యం’ కూడా ఉంది. అయితే, ఆయా కేటగిరిల్లో తుది జాబితాలో నిలిచిన భారతీయ చిత్రాలు ఏవో తెలుసా?

మదర్‌ ఇండియా

భారతదేశం నుంచి తొలిసారి ఆస్కార్‌ అవార్డుల బరిలో నిలిచిన చిత్రం ‘మదర్‌ ఇండియా’(Mother india) (1957). మెహబూబ్‌ఖాన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నర్గీస్‌, సునీల్‌దత్‌, రాజేంద్రకుమార్‌, రాజ్‌కుమార్‌లు కీలక పాత్రలు పోషించారు. దేశంలోని గ్రామాల పరిస్థితులను ప్రతిబింబించేలా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. సగటు భారతీయ స్త్రీ, తన కుటుంబం కోసం, తన పిల్లలకోసం పడే కష్టాలను భావోద్వేగభరితంగా చూపించారు.


సలామ్‌ బాంబే

‘మదర్‌ ఇండియా’ తర్వాత ఆస్కార్‌కు మరో చిత్రం నామినేట్‌ అవడానికి చాలా కాలమే పట్టింది. 1988లో వచ్చిన బాలీవుడ్‌ చిత్రం ‘సలామ్‌ బాంబే’ (Salaam Bombay) ఆస్కార్‌కు నామినేషన్‌ సాధించింది. మీరా నాయర్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో షఫీక్‌ సయీద్‌, హంస విఠల్‌, చందా శర్మ, నానా పటేకర్‌, రఘువీర్‌యాదవ్‌, అనిత కన్వర్‌ కీలక పాత్రలు పోషించారు. అప్పటి ముంబయిలోని వీధి బాలల నుంచి స్ఫూర్తి పొంది ఈ సినిమాను తీర్చిదిద్దారు. మురికివాడల్లో నివశించే చిన్నారుల రోజువారీ జీవితాలను ఇందులో ప్రతిబింబించారు.


లగాన్‌

భారతదేశం నుంచి ఆస్కార్‌కు నామినేట్‌ అయిన మూడో చిత్రం ‘లగాన్‌’ (Lagaan). ఆమిర్‌ఖాన్‌ కీలకపాత్రలో అశుతోష్‌ గోవారికర్‌ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. గ్రేసీ సింగ్‌, రాచెల్‌ షెల్లీ, పాల్‌ బ్లాక్‌ థ్రోన్‌లు ముఖ్య పాత్రలు పోషించారు. 2001లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని అందుకోవడమే కాకుండా ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరిలో ఆస్కార్‌కు నామినేట్‌ అయింది. బ్రిటిషర్లు విధించే పన్ను నుంచి మినహాయింపు పొందడం కోసం ఓ భువన్‌ (ఆమిర్‌) అనే యువకుడు వారితో క్రికెట్‌ ఆడాల్సి వస్తుంది. క్రికెట్‌ బ్యాటు కూడా పట్టుకోవడం రాని కొందరు గ్రామస్థులను కూడదీసి, వారితో కలిసి బ్రిటిషర్లపై మ్యాచ్‌ ఆడి ఎలా నెగ్గాడు? ఈ క్రమంలో భువన్‌కు ఎదురైన పరిస్థితులు ఏంటి? తదితర అంశాలతో భావోద్వేగభరితంగా లగాన్‌ను తీర్చిదిద్దారు అశుతోష్‌ గోవారికర్‌.

‘లగాన్‌’ తర్వాత ఇప్పటివరకూ మరే భారతీయ చిత్రమూ ఆస్కార్‌ అవార్డుల తుదిపోరులో నిలవలేదు. ఆ సినిమా తర్వాత తెలుగు నుంచి ఇప్పుడు ‘RRR’ ఉత్తమ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరి తుది జాబితాలో చోటు దక్కించుకుని తెలుగువారి కీర్తిని మరింత పెంచింది. కీరవాణి స్వరాలు సమకూర్చిన ఈ పాటకు చంద్రబోస్‌ సాహిత్యం అందించగా, కాలభైరవ-రాహుల్‌ సిప్లిగంజ్‌ ఆలపించారు. ప్రేమ్‌ రక్షిత్‌ నృత్యరీతులు సమకూర్చారు. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కథానాయకులుగా నటించారు.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని