Lokesh Kanagaraj: ‘రోలెక్స్‌’ పాత్రతో మూవీ.. లోకేశ్‌ కనగరాజ్‌ ప్లాన్‌ మామూలుగా లేదుగా..!

కమల్‌హాసన్‌ (kamal haasan) కీలకపాత్రలో నటించిన ‘విక్రమ్‌’లో రోలెక్స్‌గా సూర్య (suriya) కనిపించిన సంగతి తెలిసిందే. ఆ పాత్ర నేపథ్యంలో ఒక మూవీ ఉంటుందని దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌ (Lokesh Kanagaraj) వెల్లడించారు.

Updated : 13 Dec 2022 10:49 IST

హైదరాబాద్‌: ప్రస్తుతం భారతీయ సినీ పరిశ్రమలో క్రేజ్‌ ఉన్న దర్శకుల్లో లోకేశ్‌ కనగరాజ్‌ (Lokesh Kanagaraj) ఒకరు. తీసింది తక్కువ సినిమాలే అయినా, మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఈ ఏడాది ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘విక్రమ్‌’ (Vikram) పాన్‌ ఇండియా మూవీగా అదరగొట్టింది. ప్రస్తుతం విజయ్‌ (Vijay) కథానాయకుడిగా లోకేశ్‌ కనగరాజ్‌ ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. దీని తర్వాత ఆయన చేయబోయే సినిమా వివరాలను తాజాగా పంచుకున్నారు. అంతేకాదు, మైండ్‌ బ్లోయింగ్‌ విషయాలను కూడా చెప్పారు. రాబోయే పదేళ్లకు సరిపడా సినిమాల షెడ్యూల్‌ తన వద్ద ఉన్నట్లు చెప్పారు. ఇటీవల ఓ ఆన్‌లైన్‌ ఫిల్మ్‌ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కమల్‌హాసన్‌తో కలిసి పాల్గొన్న ఆయన ఈ విషయాలను తెలిపారు.

‘‘ప్రస్తుతం ఇళయదళపతి విజయ్‌ హీరోగా ఓ సినిమా చేస్తున్నా. దీని తర్వాత కమల్‌హాసన్‌ సర్‌తో కూర్చొని మాట్లాడతా. ఆ తర్వాత ‘ఖైదీ2’ మొదలు పెడతా. అది పూర్తయిన వెంటనే ‘విక్రమ్‌’ సీక్వెల్‌ ఉంటుంది. అంతేకాదు, రోలెక్స్‌ (Rolex- విక్రమ్‌లో సూర్య పోషించిన పాత్ర) నేపథ్యంలో మూవీ కూడా ఉంటుంది. పరిస్థితులను బట్టి ఈ చిత్రాలు అటూ ఇటూ కావచ్చు. ఇది మల్టీ యూనివర్స్‌. దీంతో ఏ సినిమా ఎప్పుడు వస్తుందో ఇప్పుడే చెప్పలేను. అది ప్రీక్వెల్‌ లేదా సీక్వెల్‌ కూడా అవ్వవచ్చు. వచ్చే పదేళ్లకు వరకూ నేను సెటిల్‌ (నవ్వులు) ’’ అని వివరించారు.

‘విక్రమ్‌’ మూవీలో డ్రగ్‌ మాఫియాను శాసించే రోలెక్స్‌ పాత్రలో తళుక్కున మెరిశారు సూర్య. క్లైమాక్స్‌లో ఆయన కనిపించింది కొద్ది సేపే అయినా, థియేటర్‌ దద్దరిల్లిపోయింది. ఈ మూవీ తర్వాత ‘ఖైదీ2’ ఉంటుందని అందరూ ఆశించారు. ముఖ్యంగా అన్నదమ్ములైన సూర్య, కార్తి వెండితెరపై ఒకే ఫ్రేమ్‌లో కనపడితే చూద్దామని ఎంతోకాలంగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే, విజయ్‌తో మూవీ ప్రకటించి లోకేశ్‌ అభిమానులను ఇంకాస్త వెయిటింగ్‌లో పెట్టారు. ఇది కూడా లోకేశ్‌ కనగరాజ్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌ మూవీ కావడంతో విజయ్‌ను ఏ పాత్రలో చూపిస్తారోనని ఆసక్తిగా చూస్తున్నారు. మరోవైపు రోలెక్స్‌ పాత్రతో సింగిల్‌ మూవీ చేయనున్నట్లు ప్రకటించడం ఈ యూనివర్స్‌కు మరింత హైప్‌ తెస్తోంది. ‘సింహం వేటాడేటప్పుడు అడవి ప్రకాశంగా ఉంటుందట. అప్పుడది ఆకలితో ఉన్నప్పుడు.. అడవి కూడా పస్తు ఉండాలి. 27ఏళ్లు అయింది ఈ సామ్రాజ్యాన్ని స్థాపించి, వాడు.. వాడి బాబు ఊరికే ఇచ్చింది కాదు’ అని ‘విక్రమ్‌’ క్లైమాక్స్‌లో అంటాడు సూర్య.. అంటే రోలెక్స్‌ జీవితం ఎలా మొదలు పెట్టాడు? ఎలా డ్రగ్‌ మాఫియా డాన్‌ అయ్యాడో ‘రోలెక్స్‌’లో చూపించే అవకాశం ఉంది. లోకేశ్‌ చెప్పినట్లు వరుసగా ఈ సినిమాలన్నీ వస్తే, ప్రేక్షకులకు ఆయన ట్రేడ్‌ మార్క్‌ ‘బిర్యానీ’తో పాటు ‘ఎంటర్‌టైన్‌ 10 ఇయర్స్‌ సెటిల్‌మెంట్‌’ చేసినట్లే!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని