Love Today Review: రివ్యూ: ల‌వ్ టుడే

యువ ప్రేమకథా చిత్రం ‘లవ్‌ టుడే’ ఎలా ఉందంటే..?

Updated : 26 Nov 2022 12:04 IST

Love Today Review చిత్రం: లవ్‌ టుడే; న‌టీన‌టులు: ప‌్రదీప్ రంగ‌నాథ‌న్‌, ఇవానా, ర‌వీనా ర‌వి, యోగిబాబు, రాధిక శ‌ర‌త్‌కుమార్‌, స‌త్యరాజ్‌, అక్షయ ఉద‌య్‌కుమార్‌, త‌దిత‌రులు; ఛాయాగ్రహ‌ణం: దినేశ్ పురుషోత్తమ‌న్; కూర్పు: ప‌్రదీప్ ఇ.రాఘ‌వ్; సంగీతం: యువ‌న్ శంక‌ర్ రాజా; నిర్మాణం: క‌ల్పాతి ఎస్‌.అఘోరం, క‌ల్పాతి ఎస్‌.గ‌ణేశ్‌, క‌ల్పాతి ఎస్‌.సురేష్; ర‌చ‌న, దర్శక‌త్వం: ప‌్రదీప్ రంగ‌నాథ‌న్‌; తెలుగులో విడుదల‌: దిల్‌రాజు, విడుద‌ల తేదీ: 25-11-2022

త‌మిళంలో విజ‌య‌వంత‌మైన చిత్రం ‘ల‌వ్ టుడే’. ప్రదీప్ రంగ‌నాథ‌న్ స్వయంగా ర‌చించి, ద‌ర్శక‌త్వం వ‌హించిన ఈ సినిమాలో ఆయ‌నే న‌టుడు. న‌వ‌త‌రం ఆలోచ‌న‌లు, వాళ్ల ప్రేమ‌ల్ని ఆధారంగా చేసుకుని రూపొందిన ఈ సినిమాని తెలుగులో దిల్‌రాజు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఆస‌క్తి రేకెత్తించే  ట్రైల‌ర్, దిల్‌రాజు సంస్థ నుంచి విడుద‌ల‌వుతుండ‌డంతో సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు త‌గ్గట్టుగా సినిమా ఉందో? లేదో? తెలుసుకునే ముందు క‌థేమిటో చూద్దాం.

క‌థేమిటంటే: ఐటీ ఉద్యోగి అయిన ఉత్తమ‌న్ ప్రదీప్ (ప్రదీప్ రంగ‌నాథ‌న్‌), నిఖిత (ఇవానా) ప్రేమించుకుంటారు. గాఢమైన ప్రేమ‌లో మునిగి తేలుతున్న ఆ ఇద్దరూ పెళ్లితో ఒక్కటి కావాలనుకుంటారు. ఇంత‌లోనే ఆ జంట ప్రేమ విష‌యం నిఖిత ఇంట్లో తెలుస్తుంది. ఆమె తండ్రి శాస్త్రి (స‌త్యరాజ్‌) ఒక‌సారి  ప్రదీప్‌ని ఇంటికి తీసుకుర‌మ్మని చెబుతాడు. ఇద్దరి ప్రేమ‌ని అంగీక‌రిస్తాడు. అయితే.. ఓ ష‌ర‌తు విధిస్తాడు. ఒక రోజంతా ఒక‌రి ఫోన్‌ని మ‌రొక‌రు మార్చుకోవాల‌నేది ఆ ష‌రతు. ఒక‌రి ఫోన్లు మ‌రొక‌రు చూసుకున్నాక కూడా ఆ జంట పెళ్లికి సిద్ధమైందా? త‌న ప్రేయ‌సి ఫోన్లో అబ్బాయిల‌తో సందేశాలు చూశాక ప్రదీప్ ఎలా స్పందించాడు? ప‌్రదీప్ ఫోన్లో యాప్స్‌, ఇత‌ర‌ సందేశాలు చూశాక ఆమె ప‌రిస్థితి ఏమిటి? ఆ ఇద్దరూ ఫోన్లు మార్చుకున్నాక ఎలాంటి స‌మ‌స్యలు త‌లెత్తాయి? చివరికి ఇద్దరికీ పెళ్లైందా? లేదా? త‌దిత‌ర విష‌యాలతో మిగ‌తా క‌థ సాగుతుంది.

ఎలా ఉందంటే: క‌థంతా ట్రైల‌ర్‌లోనే చెప్పేశారు. మ‌రి ఈ అంశం చుట్టూ మిగ‌తా క‌థ‌ని ఎలా న‌డిపార‌నే ఆస‌క్తి స‌గ‌టు ప్రేక్షకుడిలో క‌లుగుతుంది. న‌వ‌త‌రం ప్రేమ‌లు, వాళ్ల సెల్‌ఫోన్ అల‌వాట్లనే నేప‌థ్యంగా ద‌ర్శకుడు ఈ క‌థ‌ని అల్లుకున్నాడు. ప్రేక్షకుల‌కు వెంట‌నే క‌నెక్ట్ అయ్యే క‌థ ఇది. మ‌నం ఏమిట‌నేది మ‌న ఫోన్లే చెబుతాయ‌నేది త‌ర‌చూ వినిపించే మాట‌. ఆ అంశాన్ని రెండు జంట‌ల‌తో ముడిపెట్టి  హాస్యభ‌రితంగా క‌థ‌నాన్ని తీర్చిదిద్దిన  విధానం బాగుంది. ప‌ది నిమిషాల్లోనే క‌థ‌లో లీనం చేస్తుందీ చిత్రం. నటీనటులు ఫోన్లు మార్చుకున్నాక అస‌లు సంఘ‌ర్షణ మొద‌ల‌వుతుంది. అప్పటిదాకా ఒకరికొక‌రు ఎలా క‌నిపించారు? సెల్‌ఫోన్లలో ఒక‌రు చేసిన ఛాటింగ్‌ని మ‌రొక‌రు చూశాక, ఒక‌రి బ్రౌజింగ్ హిస్టరీ మ‌రొక‌రు చూశాక ఒక‌రి అల‌వాట్లు మ‌రొక‌రికి తెలిసిన త‌ర్వాత వాళ్లు ఎలా మారారు? ఆ క్రమంలో పండే హాస్యం, భావోద్వేగాలు సినిమాకి హైలైట్‌గా నిలుస్తాయి. ఈ జంట ఒక్కటే కాదు, మ‌రో జంట చుట్టూ అల్లిన స‌న్నివేశాలతో ఉప‌క‌థ‌ని కూడా సినిమాలో మిళితం చేయ‌డం, న‌మ్మకం అనే విష‌యాన్ని స్పృశించడం బాగుంది. ప్రథ‌మార్ధం సినిమా వేగంగా సాగుతుంది, చ‌క్కటి హాస్యం పంచుతుంది. ద్వితీయార్ధంలో అక్కడ‌క్కడా సాగ‌దీత‌గా అనిపిస్తుంది. మంచి ర‌చ‌న ఈ సినిమాకి ప్రధాన బ‌లం. అంద‌రికీ తెలిసిన అంశమే అయినా ఆస‌క్తి, హాస్యం పండేలా స‌న్నివేశాల్ని తీర్చిదిద్దడం ద‌ర్శకుడి ప‌నిత‌నానికి తార్కాణం. క‌థ‌లు ఎక్కడి నుంచో పుట్టుకురావ‌ని, మ‌న చుట్టూనే ఉన్నాయ‌ని రుజువు చేసిన మ‌రో చిత్రమిది.

ఎవ‌రెలా చేశారంటే: ప్రదీప్ రంగ‌నాథ‌న్ ర‌చ‌యిత‌గా, ద‌ర్శకుడిగా ఎంత ప్రభావం చూపించాడో, న‌టుడిగా కూడా అంతే ఆక‌ట్టుకున్నాడు. స‌హ‌జ‌మైన ఈ క‌థ‌కి, పాత్రకి అతికిన‌ట్టు అనిపిస్తాడు. ఇవానా కూడా చ‌క్కటి అభిన‌యం ప్రద‌ర్శించింది. వేణు శాస్త్రిగా స‌త్యరాజ్ చిన్న పాత్రలోనే క‌నిపిస్తారు. కానీ క‌థ‌ని మ‌లుపు తిప్పే పాత్ర అది. రాధికా శ‌ర‌త్‌కుమార్ క‌థానాయ‌కుడి త‌ల్లిగా క‌నిపిస్తుంది. యోగిబాబు, ర‌వీనా పాత్రలు సినిమాకి ప్రధాన‌బ‌లం. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. ఎడిటింగ్‌, సంగీతం చాలా బాగా కుదిరాయి. ద‌ర్శకుడు ప్రదీప్ రంగ‌నాథ‌న్ ర‌చ‌నకి త‌గ్గట్టుగానే ఇత‌ర విభాగాల‌న్నీ ప‌నిచేశాయి. నిర్మాణం బాగుంది.

బలాలు
1.హాస్యం, 2.కథ, కథనం, 3.న‌టీన‌టులు

బ‌ల‌హీన‌త‌లు
1. ద్వితీయార్ధంలో సాగ‌దీత, 2. ఘాటుగా అనిపించే కొన్ని స‌న్నివేశాలు

చివ‌రిగా: ‘ల‌వ్ టుడే’.. న‌వ్వించే న‌వ‌త‌రం సినిమా

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని