Chandrabose: సాహిత్యానికే కాదు.. సహనానికీ లభించిన పురస్కారం!

Chandrabose: భావాల పుట్ట... చంద్రబోస్‌. భావోద్వేగాలు పలికించడంలో చేయి తిరిగిన పాటకాడు ఆయన. వేల పాటలతో... రెండున్నర దశాబ్దాలుగా ప్రయాణం చేస్తూ శ్రోతల్ని అలరిస్తున్న అలుపెరగని పాటసారి.

Updated : 14 Mar 2023 07:22 IST

చంద్రబోస్‌

భావాల పుట్ట... చంద్రబోస్‌ (Chandrabose). భావోద్వేగాలు పలికించడంలో చేయి తిరిగిన పాటకాడు ఆయన. వేల పాటలతో... రెండున్నర దశాబ్దాలుగా ప్రయాణం చేస్తూ శ్రోతల్ని అలరిస్తున్న అలుపెరగని పాటసారి. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాలోని నాటు నాటు.. పాటతో ఆయన పేరు ప్రపంచస్థాయిలో మార్మోగిపోయింది. ఈ పాట రచనకి ఆస్కార్‌ అందుకున్న ఉద్విగ్న క్షణాల తర్వాత చంద్రబోస్‌ ‘ఈనాడు సినిమా’తో ప్రత్యేకంగా ముచ్చటించారు.

ఆస్కార్‌ వేదికెక్కినప్పుడు మీలో కలిగిన అనుభూతి ఎలాంటిది?

భారతదేశ కీర్తిని, తెలుగు సాహిత్య గౌరవాన్ని చేతిలో నిలుపుకున్నట్టుగా అనిపించింది. ఆ క్షణాలు అనిర్వచనీయమైన అనుభూతిని పంచాయి. గోల్డెన్‌ గ్లోబ్‌తోపాటు ఇతర అంతర్జాతీయ పురస్కారాలు వచ్చినప్పుడే ఆస్కార్‌ కూడా ఖాయం అనే ఓ భరోసా ఉండేది. అది సాకారమైన ఆ క్షణాలు భావోద్వేగానికి గురిచేశాయి.

ఇదివరకెప్పుడైనా ఆస్కార్‌ గురించి కలలుగనేవారా?

ఆస్కార్‌ ఆలోచన లేదు కానీ... జాతీయ పురస్కారం గురించైతే చాలా కలలుగన్నాను. ఒక్కసారైనా జాతీయ పురస్కారం అందుకోవాలనేది నా జీవిత లక్ష్యం, స్వప్నంగా ఉండేది. అది నెరవేరకముందే నాలుగు అంతర్జాతీయ పురస్కారాలు లభించాయి. గోల్డెన్‌ గ్లోబ్‌, క్రిటిక్స్‌ ఛాయిస్‌, హాలీవుడ్‌ క్రిటిక్స్‌ అసోసియేషన్‌తో పాటు ఆస్కార్‌ పురస్కారాలు  లభించాయి.

ఇదివరకు కూడా ఎన్నో గొప్ప పాటలు రాశారు. నాటు నాటు..’ పాటకి ఆస్కార్‌ దక్కడంపై మీ అభిప్రాయం?

ఈసారి సాహిత్యంతోపాటు సహనానికి కూడా లభించిన పురస్కారంగా భావిస్తా. నా 27 ఏళ్ల రచనా ప్రయాణంలో ఒక పాటని 19 నెలలు రాసిన సందర్భం ఒక్కటీ లేదు. ఏ పాటైనా నాలుగైదు రోజుల్లో పూర్తవ్వాలి.  మహా అంటే ఒక నెల. ‘నాటు నాటు...’ పాట పూర్తి కావడానికి మాత్రం 19 నెలలు పట్టింది. సహనాన్ని కోల్పోకుండా చాలా జాగ్రత్తగా ఒక్కొక్క పదం పేర్చుకుంటూ, కూర్చుకుంటూ రాశా. అందుకే సాహిత్యంతోపాటు, ఆ సహనానికి కూడా అదనంగా మార్కులు పడి ఈ పురస్కారం లభించిందని భావిస్తా.

తెలుగు సాహిత్యానిది ఆస్కార్‌ స్థాయి అని రుజువైంది. ఒక కవిగా భాష గురించి ఏం చెబుతారు?

భారతీయ సినిమాల్లోని సందర్భాలు, సన్నివేశాలు, ఆ భావోద్వేగాలు మరెక్కడా ఉండవేమో అనిపిస్తుంది. మన సినిమాల్లో అన్నన్ని రకాల పాటలు ఉంటాయంటే కారణం అదే. తెలుగులోనే తీసుకుంటే నేనే ఎన్నెన్ని సందర్భాలకి పాటలు రాశాననీ! స్ఫూర్తి, ప్రేరణ, భక్తి, ప్రేమ, విరహం, ఎడబాటు, శృంగారం, అల్లరి, భాష, కట్టూ బొట్టు, తమాషా, సరదా... ఇలా ఎన్ని సందర్భాలు ఉంటాయో అన్నిటికీ రాశా. మనం ఆ స్థాయికి చేరుకోవడానికి, ఆ మార్గం ఒకటి  ఉంటుందని తెలుసుకుని పట్టుకోవడానికి సమయం పట్టింది కానీ... మన సాహిత్యంలో కానీ, సందర్భాల్లో, భావాల్లో పరిపుష్టి లేక కాదు.

అంతర్జాతీయ స్థాయి భావాలు ఎక్కువగా  మన చిత్రాల్లోనే ఉంటాయి. మన పాటని అక్కడికి తీసుకెళ్లగలిగే మార్గం కావాలి, ఒక మార్గదర్శి కావాలి. అప్పుడే అన్నీ సాధ్యం అవుతాయి. ‘RRR’  చిత్రానికి నిజంగా అది సాధ్యమైంది. దర్శకుడు రాజమౌళి వల్ల ‘నాటు నాటు’ పాట అంతవరకు వెళ్లింది. మన పూర్వీకులు, నా సమకాలీకులు గొప్ప గొప్ప సందర్భాలకి, గొప్ప పాటలు రాశారు. గొప్ప సాహిత్య పరమైన, సంగీత పరమైన భాష మనదని ఆస్కార్‌ వేడుకలోనూ చెప్పా.

ఆస్కార్‌ పురస్కార విజేతగా ఆ ప్రభావం మీపైన, మీ రచనా ప్రస్థానంపైన ఏ రకంగా ఉంటుందని భావిస్తున్నారు?

ఆస్కార్‌ బరువు మూడున్నర కేజీలు, గోల్డెన్‌ గ్లోబ్‌ ఏడు కేజీలు, క్రిటిక్స్‌ ఛాయిస్‌ బరువు ఆరు కేజీలు. ఇప్పుడు నాపైన అదనంగా మరో 20, 30 కేజీల బరువు పడిపోయింది (నవ్వుతూ). అందుకే ఇంకా జాగ్రత్తగా అడుగులేస్తూ రాయాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు