Bimbisara: రాక్షసుడివో... రక్షకుడివో

రాజులు... రాజ్యాలు అంటూ నాటి వాతావరణాన్ని కళ్లకు కడుతున్నాయి సినిమాలు. మగధ రాజ్యాధిపతి బింబిసారుడిగా కల్యాణ్‌రామ్‌ తెరపై సందడి చేయనున్నాడు.

Updated : 17 Jul 2022 12:47 IST

భువిపై ఎవడూ కని విని ఎరుగని
అద్భుతమే జరిగెనే..
దివిలో సైతం కథగా రాని విధి లీలే వెలిగెనే
నీకు నువ్వే దేవుడన్న భావనంతా గతమున కథే...  
నిన్ను మించే రక్కసులుండే
నిన్ను ముంచే లోకం ఇదే
ఏ కాలమో విసిరిందిలే
నీ పొగరు తలకు తగిన వలయమే
ఈశ్వరుడే ఈశ్వరుడే చేసినాడు కొత్త గారడే...
సాక్ష్యమిదే సాక్ష్యమిదే భిక్షువయ్యే బింబిసారుడే..  ।।ఈశ్వరుడే।।

చరణం: 1
రాజభోగపు లాలస బ్రతుకే మట్టి వాసన రుచి చూసినదే
రక్త దాహం మరిగిన మనసే గుక్క నీళ్లకు పడి వేచినదే
ఏది ధర్మం ఏది న్యాయం తేల్చువాడొక్కడున్నాడులే
లెక్క తీసి శిక్ష రాసే కర్మఫలమే ఒకటుందిలే
ఏ జన్మలో నీ పాపమో ఆ జన్మలోనే పాప ఫలితమే  ।।ఈశ్వరుడే।।

చరణం: 2
నరకమిచ్చిన నరకుడి వధతో దీప పండుగ మొదలయ్యినదే
నీతి మరిచిన రావణ వధతో కొత్తచరితే చిగురించినదే
రాక్షసుడివో రక్షకుడివో అంతు తేలని ప్రశ్నవి నువ్వే
వెలుగు పంచే కిరణమల్లే ఎదుగుతావో తెలియని కలే
ఏ క్షణం ఏ వైపుగా అడుగేయనుందో నీ ప్రయాణమే ।।ఈశ్వరుడే।।

రాజులు... రాజ్యాలు అంటూ నాటి వాతావరణాన్ని కళ్లకు కడుతున్నాయి సినిమాలు. మగధ రాజ్యాధిపతి బింబిసారుడిగా కల్యాణ్‌రామ్‌ (Kalyan Ram) తెరపై సందడి చేయనున్నాడు. ఆయన కథానాయకుడిగా వశిష్ఠ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బింబిసార’ (Bimbisara). ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ సినిమా ప్రచారానికి ఇటీవలే విడుదలైన ‘ఈశ్వరుడే...’  పాట ఊపుని తీసుకొచ్చింది. ఈ సందర్భంగా ఆ పాట ప్రయాణం గురించి రచయిత శ్రీమణి (Srimani) ‘ఈనాడు సినిమా’ ప్రత్యేకంగా ముచ్చటించారు. ఆ విషయాలివీ...  
‘‘ఒక పాట కథని ముందుకు నడిపిస్తోందంటే అది గొప్ప రచన అని నమ్ముతా. ఈ పాట నాకు అలాంటి అవకాశాన్నే ఇచ్చింది. అంతకుముందు ఎప్పుడూ ఎక్కడా జరగని ఓ సంఘటన తర్వాత వచ్చే పాట ఇదంటూ దర్శకుడు వశిష్ఠ్‌ ఈ సందర్భాన్ని చాలా స్పష్టంగా వివరించారు. కథానాయకుడి జీవితం ఓ ఘటనతో ఊహించని మలుపు తీసుకుంటుంది. ఇది జరగముందు అతని జీవితం ఒకలా ఉంటే, జరిగాక మరోలా మారుతుంది. అదంతా అతను చేసిన పనులవల్లే. అందుకే కర్మ సిద్ధాంతాన్ని ఈ పాటతో గుర్తు చేసేందుకు ప్రయత్నించా.

‘భువిపై ఎవడూ కని విని ఎరుగని అద్భుతమే జరిగెనే..
దివిలో సైతం కథగా రాని విధి లీలే వెలిగెనే..’ అంటూ పాటని మొదలు పెట్టి తనకి తాను దేవుడు అనుకునే కథానాయకుడిని మించిన దేవుడు మరొకరు ఉన్నారని చెబుతూ ‘నీకు నువ్వే దేవుడన్న
భావనంతా గతమున కథే...’ ‘ఈశ్వరుడే చేసినాడు కొత్త గారడే’ అనే పంక్తుల్ని పల్లవిలో రాశా.

* రాజభోగాలు అనుభవించిన కథానాయకుడి గత జీవితానికీ, ఆ సంఘటన తర్వాత ప్రస్తుతం నడుస్తున్న జీవితానికీ తేడాని చూపిస్తూ ఒకటో చరణం మొదలుపెట్టా. మిగిలిన యుగాలన్నిటిలోనూ దేవుడు, దేవతలు, మునులు, రుషులు శాపాలు పెడితే వాటి విముక్తి కోసం మరో జన్మ  ఎత్తేవారు. కలియుగంలో ఎప్పుడు చేసిన పాపాలకి అప్పుడే శిక్ష అని కర్మ సిద్ధాంతం చెబుతోంది. అదే యుగధర్మం. ఆ విషయాన్ని గుర్తు చేస్తూ...
‘‘ఏది ధర్మం ఏది న్యాయం తేల్చువాడొక్కడున్నాడులే
లెక్క తీసి శిక్ష రాసే కర్మఫలమే ఒకటుందిలే
ఏ జన్మలో నీ పాపమో ఆ జన్మలోనే పాప ఫలితమే’’ అంటూ రాశా.
రాక్షస సంహారం జరిగాక ప్రతిసారీ దానికి ప్రతీకగా మనకొక పండగ వచ్చింది. రావణ సంహారం జరిగాక కొత్త చరిత్ర వెలుగులోకి వచ్చింది. మరి నీ కథ ఏం ఇస్తుంది? నువ్వేం  కానున్నావు? ఎటు వెళుతున్నావని ప్రశ్నిస్తూ పాటని ముగించా.  
ఓ సందర్భం స్ఫూర్తిని నింపిందంటే దాని కోసం ఏ స్థాయికైనా వెళ్లి, ఎన్ని సవాళ్లైనా స్వీకరించి పాట రాయాలనిపిస్తుంది. ‘మహర్షి’లో పదర పదర, ఇదే కదా..., ‘అత్తారింటికి దారేది’లో ఆరడుగుల బుల్లెట్టు... ఈ పాటల్ని ఛాలెంజ్‌గా తీసుకుని రాశా. వాటిని దాటితే రచయితగా మరో మెట్టు ఎక్కుతానని తెలుసు. అలా రచనా పరంగా, శైలి, పోలికల పరంగా, రచయితగా కథని విస్తృతం చేయడం పరంగా నన్ను మరో మెట్టు ఎక్కించిన పాట ఇది. గాయకుడు కాలభైరవ పాటకి ప్రాణం పోశారు. భాషా పరిణతి ఉన్నవాళ్లలా పాటని అర్థం చేసుకుని చిరంతన్‌ భట్‌ బాణీ ఇచ్చారు. సుద్దాల అశోక్‌తేజ ఫోన్‌ చేసి ‘మంచి సాహిత్యం రాశావురా నాన్నా..’ అంటూ మెచ్చుకున్నారు’’.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని