ఆ రెండు కుదిరితేనే మంచి పాటలు

‘‘పాట అనేది సమష్టి కృషి ఫలితం. సాహిత్యం.. స్వరం.. గాత్రం.. అన్నీ కలిస్తేనే పాట అవుతుంది. ఒక పాట పాపులర్‌ అయితే.. ఏ ఒక్కరికో దాని క్రెడిట్‌ ఇవ్వకూడదు. దానికోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ అందులో భాగం ఉంటుంద’’న్నారు శ్రీమణి...

Published : 19 Mar 2021 10:23 IST

హైదరాబాద్‌: ‘‘పాట అనేది సమష్టి కృషి ఫలితం. సాహిత్యం.. స్వరం.. గాత్రం.. అన్నీ కలిస్తేనే పాట అవుతుంది. ఒక పాట పాపులర్‌ అయితే.. ఏ ఒక్కరికో దాని క్రెడిట్‌ ఇవ్వకూడదు. దానికోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ అందులో భాగం ఉంటుంద’’న్నారు శ్రీమణి. ఎన్నో వైవిధ్యభరిత గీతాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాలపై చెరగని ముద్ర వేసిన యువ గీత రచయిత ఆయన. ఇప్పుడు ‘రంగ్‌ దే’ చిత్రంలో నాలుగు గీతాలు రాశారు. నితిన్, కీర్తి సురేష్‌ జంటగా నటించిన చిత్రమిది. ఈ చిత్రం ఈనెల 26న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో విలేకర్లతో మాట్లాడారు శ్రీమణి.

‘‘ఈరోజుల్లో ఒక అమ్మాయికీ.. అబ్బాయికీ మధ్య ఉండే ఎమోషన్స్‌ ఎలా ఉంటున్నాయి? అనేది కొత్త కోణంలో చూపించే కథ ఇది. యువతరం ఆలోచనలకు అద్దం పట్టేలా ఉంటుంది. దర్శకుడు వెంకీ అట్లూరితో ‘తొలిప్రేమ’ నుంచి పని చేస్తున్నా. అందుకే ఆయన సినిమాలో ఒక్క పాట రాసినా.. దాని సిచ్యువేషన్‌తో పాటు కథ మొత్తం చెబుతుంటారు. ఈ చిత్రంలో దేవిశ్రీ ప్రసాద్‌ చాలా విభిన్న వేరియేషన్స్‌లో ట్యూన్స్‌ సెట్‌ చేశారు. ఒక ఆల్బమ్‌లో ఇన్ని విభిన్నమైన పాటలు కుదరడం అరుదు’’.

ముందు సాహిత్యం రాసి.. తర్వాత ట్యూన్‌

‘‘ఇప్పుడెక్కువగా ట్యూన్స్‌కి తగ్గట్లుగానే పాటలు రాస్తున్నారు. ఈ చిత్రంలో సాహిత్యం రాసి.. ట్యూన్స్‌ సెట్‌ చేసిన గీతాలూ ఉన్నాయి. ‘‘చూసి నేర్చుకోకు’’, ‘‘ఏమిటో ఇది’’, ‘‘బస్టాండే బస్టాండే’’..ఇవన్నీ సాహిత్యానికి తగ్గట్లు బాణీ కట్టినవే. ఇలా స్వేచ్ఛగా రాసే పాటలకి  సన్నివేశ బలం, చక్కటి సాహిత్యం తోడైతే అవి సంగీత ప్రియులపై మరింత ప్రభావం చూపిస్తాయి. కొన్నిసార్లు ట్యూన్‌కి తగ్గట్లు సాహహిత్యమందిస్తేనే ఆకర్షణీయంగా ఉంటుంది.’’

ప్రతి పాట సవాలే

‘‘ఒక రచయిత సమాజాన్ని చూసే కోణం వేరు. ఒక దర్శకుడు సినిమా తీస్తున్నప్పుడు సమాజాన్ని చూసే కోణం వేరు. ఈ రెండూ సరిగ్గా కుదిరినప్పుడు మంచి సాహిత్యంతో నిండిన పాటలొస్తాయి. నా దృష్టిలో ప్రతి పాట ఓ సవాల్‌తో నిండినదే’’.

జానపదంతో కొత్త విషయాలు

‘‘సినిమా రూపంలో జానపదాల్ని తెరపైకి తీసుకురావడం మంచి విషయం. ఇప్పటికీ ఎన్నో మంచి జానపద గీతాలు మనకు తెలియకుండా ఉండిపోయాయి. ఎవరూ పట్టించుకోకపోతే.. అవి పూర్తిగా మరుగున పడిపోతాయి. వాటిని బయటకు తీసుకొస్తేనే మరిన్ని కొత్త విషయాలు తెలుస్తాయి.’’


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని