
MAA Elections: నటి హేమకు షోకాజ్ నోటీసులు.. జారీ చేసిన క్రమశిక్షణ సంఘం
ఇంటర్నెట్ డెస్క్: ‘మా’(మూవీ ఆర్టిస్టు అసోసియేషన్) ఎన్నికలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ‘మా’ అధ్యక్ష పదవికి పోటీలో ఉన్నానంటూ ప్రకటించిన నటి హేమకు తాజాగా షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. ప్రస్తుత ‘మా’ అధ్యక్షుడు నరేశ్ నిధులు దుర్వినియోగం చేశారంటూ నటి హేమ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు సభ్యులతో హేమ మాట్లాడిన వాయిస్ రికార్డ్ బయపడింది. దీనిపై స్పందించిన నరేశ్.. హేమ వ్యాఖ్యలను తప్పుపట్టారు. అసోసియేషన్ గౌరవాన్ని దెబ్బతీసేలా హేమ మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. హేమపై క్రమశిక్షణ సంఘానికి ఫిర్యాదు చేస్తామని.. కమిటీ నిర్ణయం ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ క్రమంలో హేమకు క్రమశిక్షణ సంఘం షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
ఇదిలా ఉండగా.. మా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న సభ్యులు ఒకరిపై ఒకరు తీవ్రమైన ఆరోపణలు చేసుకుంటున్న నేపథ్యంలో చిరు కూడా స్పందించారు. స్వయంగా ‘మా’ క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు కృష్ణంరాజుకు లేఖ రాశారు. మా ఎన్నికలు వెంటనే జరపాలని.. ఎన్నికలు ఆలస్యమైతే సంక్షేమ కార్యక్రమాలు నిలిచిపోతాయని లేఖలో పేర్కొన్నారు. సభ్యుల బహిరంగ ప్రకటనలతో ‘మా’ ప్రతిష్ట మసకబారుతోందని, ‘మా’ ప్రతిష్ఠ దెబ్బతీస్తున్న ఎవర్నీ ఉపేక్షించవద్దని చిరంజీవి లేఖలో కృష్ణంరాజును కోరారు. ప్రస్తుతం ఉన్నది ఆపద్ధర్మ కార్యవర్గమేనని స్పష్టం చేశారు. సమస్యను కృష్ణంరాజు త్వరగా పరిష్కరిస్తారని ఆశిస్తున్నట్లు చిరంజీవి అభిప్రాయపడ్డారు. మరి క్రమశిక్షణ సంఘం కూడా రంగంలోకి దిగిన నేపథ్యంలో ఎన్నికలు మున్ముందు మరింత రసవత్తరంగా మారే అవకాశం ఉంది.