Manchu Vishnu: తొంభై శాతం హామీల్ని నెరవేర్చాం

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికల్ని పురస్కరించుకుని మేం ఇచ్చిన హామీల్ని తొంభై శాతం నెరవేర్చామని చెప్పారు కథానాయకుడు మంచు విష్ణు. ఆయన గతేడాది జరిగిన ఎన్నికల్లో ‘మా’ అధ్యక్షుడిగా ఎన్నికైన విషయం తెలిసిందే.

Updated : 14 Oct 2022 20:35 IST

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) (MAA) ఎన్నికల్ని పురస్కరించుకుని మేం ఇచ్చిన హామీల్ని తొంభై శాతం నెరవేర్చామని చెప్పారు కథానాయకుడు మంచు విష్ణు (Manchu Vishnu). ఆయన గతేడాది జరిగిన ఎన్నికల్లో ‘మా’ అధ్యక్షుడిగా ఎన్నికైన విషయం తెలిసిందే. ఆ పదవిని చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా తన కార్యవర్గంతో కలిసి గురువారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నటులకి అవకాశాలు, పింఛన్లు, బీమా, ఆరోగ్య సేవలు, మహిళా సంరక్షణ, కొత్త సభ్యత్వాల గురించి తీసుకున్న నిర్ణయాల గురించి వివరించారు. తాను వ్యక్తిగతంగా ఇచ్చిన ‘మా’ భవనం హామీపై కూడా ఓ నిర్ణయాన్ని తీసుకున్నట్టు తెలిపారు. సర్వసభ్య సమావేశంలో మా భవనం గురించి రెండు ఆలోచనల్ని పంచుకున్నానని, కొత్తగా కట్టనున్న చలన చిత్ర వాణిజ్య మండలి భవనంలోనే సొంతంగా స్థలాన్ని కొనుగోలు చేసి ఇవ్వాలని సభ్యులు కోరినట్టు చెప్పారు. ఆ భవనాన్ని నేను వ్యక్తిగతంగా ఇస్తానని, దీనికి మూడు నాలుగేళ్ల సమయం పడుతుందన్నారు. ఇది కాదంటే ఛాంబర్‌కి 20 నిమిషాల దూరంలో ఓ బిల్డింగ్‌ని ఇవ్వాలనుకున్నానని తెలిపారు. ‘‘గత ఎన్నికల్లో ఓటమిని సహించలేక ఎవరేం చేశారో అందరికీ తెలుసు. అందరం ఐకమత్యంగా ఉండాలి’’ అన్నారు ప్రముఖ నటుడు మోహన్‌బాబు. ఈ కార్యక్రమంలో మా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని