Updated : 15 Jul 2022 19:40 IST

Maa Neella Tank Review: రివ్యూ: మా నీళ్ల ట్యాంక్‌

Maa Neella Tank Review: వెబ్‌ సిరీస్‌: మా నీళ్ల ట్యాంక్‌; నటులు: సుశాంత్‌, ప్రియా ఆనంద్‌, సుదర్శన్‌, దివి, నిరోషా, ప్రేమ్‌ సాగర్‌, రామరాజ్‌, అన్నపూర్ణ తదితరులు; సంగీతం: నరేన్‌ ఆర్‌. కె. సిద్ధార్థ్‌; కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు; ఛాయాగ్రహణం: అరవింద్‌ విశ్వనాథ్‌; మాటలు, సాహిత్యం: కిట్టు విస్సాప్రగడ; కథ, స్క్రీన్‌ప్లే: రాజ్‌శ్రీ బిస్ఠ్‌, సురేశ్‌ మైసూర్‌; దర్శకత్వం: లక్ష్మీ సౌజన్య; విడుదల: ‘జీ 5’.

వెండితెరపై మెరిసిన నటీనటులు వెబ్‌ సిరీస్‌ చేస్తున్నారనగానే దానిపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతుంది. అలా సుశాంత్‌ (Sushanth) కీలక పాత్రలో తెరకెక్కి, అందరి దృష్టిని ఆకర్షించిన సిరీస్‌ ‘మా నీళ్ల ట్యాంక్‌’ (Maa Neelaa Tank) ‘వరుడు కావలెను’ సినిమా ఫేం లక్ష్మీ సౌజన్య ఈ ప్రాజెక్టుకు దర్శకత్వం వహించారు. చాలాకాలం తర్వాత ప్రియా ఆనంద్‌ (Priya Anand) తెలుగు ప్రేక్షకుల్ని ఈ సిరీస్‌తో పలకరించారు. మరి ప్రియ ఎంపిక చేసుకున్న ఆ పాత్ర ఏంటి? సుశాంత్‌ డిజిటల్‌ ఎంట్రీ ఎలా ఉంది? నీళ్ల ట్యాంక్‌ కథేంటి?

ఇదీ కథ: అది రాయలసీమలోని బుచ్చివోలు గ్రామం. ఆ ఊరికి కోదండం (ప్రేమ్‌ సాగర్‌) సర్పంచ్‌. అతని ఒక్కగానొక్క కొడుకు గోపాళం (సుదర్శన్‌). తండ్రి బాగా సంపాదించి పెట్టడంతో ఏ పని చేయడానికీ ఇష్టపడడు. సరదాగా ‘రీల్స్‌’ చేసి, వాటిని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ తనని తాను పెద్ద స్టార్‌ అని ఫీలవుతుంటాడు. ఈ క్రమంలో తన స్నేహితులు ఇచ్చిన సలహాతో అదే గ్రామానికి చెందిన అందమైన అమ్మాయి సురేఖ (ప్రియా ఆనంద్‌)ను పెళ్లి చేసుకోవాలని ఫిక్స్‌ అవుతాడు. అది ఇష్టంలేని సురేఖ ఇంటి నుంచి పారిపోతుంది. దాంతో.. ‘సురేఖతో పెళ్లి చేస్తేనే నేను కిందకు వస్తా’ అంటూ గోపాళం నీళ్ల ట్యాంక్‌ ఎక్కి డిమాండ్‌ చేస్తాడు. విషయం తెలుసుకున్న కోదండం ఈ సమస్యను పరిష్కరించేందుకు ఎస్‌ఐ వంశీ (సుశాంత్‌)కి కబురు పంపిస్తాడు. విధి నిర్వహణలో భాగంగా వంశీ.. సురేఖను వెతికే పనిలో పడతాడు. చివరకు ఆమెను గుర్తించారా? ఈ క్రమంలో ఒకరిపై ఒకరికి ఎలా ఇష్టం కలిగింది? అబద్ధం చెప్పి తనని ఊరికి తీసుకొచ్చాడని తెలుసుకున్న సురేఖ.. వంశీని క్షమిస్తుందా? తన ప్రేమ నిజమేనని వంశీ చెప్పాడా? గోపాళం ఎవరిని పెళ్లి చేసుకునేందు సిద్ధమయ్యాడు? అన్నది మిగతా కథ. 

ఎన్ని ఎపిసోడ్లు, ఎలా సాగిందంటే?: 8 ఎపిసోడ్లతో సాగే కథ ఇది. మరొకరు ఇష్టపడిన అమ్మాయిని హీరో ప్రేమించడం అనే కాన్సెప్ట్‌ చాలా సినిమాల్లో ఉంది. ఈ సిరీస్‌ చూసిన వారికి గోపాళం, వంశీ, సురేఖల విషయంలో ‘అంతే కదా’ అనిపిస్తుంది. ఈ ప్రేమ కథకు నీళ్ల ట్యాంక్‌ అనే రాజకీయ అంశాన్ని జోడించటం మాత్రం కొత్తగా ఉంది. అయితే ఆ ఇతివృత్తాన్ని బలంగా చూపించలేకపోయారు. నీళ్లు లేక నిరుపయోగంగా ఉన్న ట్యాంక్‌తో బుచ్చివోలు ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు? అనే ఒక్క సీన్‌ కూడా లేకుండా కేవలం మాటలతోనే కవర్‌ చేయడం టైటిల్‌కి న్యాయం చేసినట్టనిపించలేదు. గోపాళం ఎక్కడ కింద పడిపోతాడోనని ప్రజలు అక్కడికి చేరుకోవడం, తన తండ్రి, సర్పంచి కోదండంతోపాటు తన తాత నరసింహం (రామరాజ్‌) రావడం, ఒకరిని ఒకరు నిందించుకోవడానికే ట్యాంక్‌ పరితమైందనిపిస్తుంది. సురేఖ పారిపోవడం, గోపాళం సూసైడ్‌ చేసుకుంటాననడం, వంశీ ఎంట్రీతో తొలి ఎపిసోడ్‌ ఆకట్టుకుంటుంది. అసలు కథ మాత్రం మూడో ఎపిసోడ్‌లోనే మొదలవుతుంది. సురేఖ, వంశీల మధ్య బలమైన బాండింగ్‌ క్రియేట్‌ చేసే సన్నివేశం ఒక్కటీ లేదు. ఇప్పటికే అవుట్ డేటెడ్‌ అయిన కాన్సెప్ట్‌ను సురేఖ కుటుంబ సమస్యగా చూపించి మరోసారి ప్రేక్షకుడికి సహనానికి పరీక్షపెట్టారు. మొత్తం మీద కొన్నింటిలో కామెడీ, మరి కొన్నింటిలో కాస్త ఎమోషన్‌ మిక్స్‌ చేసి నీళ్ల ట్యాంక్‌ను నింపారు.

ఎవరెలా చేశారంటే: రాయలసీమ యాసలో సుశాంత్‌ పలికిన సంభాషణలు బాగున్నాయి. హావభావాల పరంగా ఆయన ఇందులో కొత్తగా కనిపిస్తారు. ఎస్‌.ఐ.పాత్రకు తగ్గ పవర్‌ లేదనిపించింది. ఒకట్రెండు ఫ్రేమ్‌ల్లో తప్ప ఆయన పోలీసు యూనిఫామ్‌లో కనిపించరు. ఆయన పనిచేసే స్టేషనూ కనిపించదు. ‘లీడర్‌’, ‘రామ రామ కృష్ణ’ సినిమాల మెప్పించిన ప్రియా ఆనంద్‌ ఇందులో స్వశక్తితో నిలబడాలనుకునే రాయలసీమ అమ్మాయిగా తనదైన మ్యానరిజంతో అలరించింది. ఈమె సోదరి, ఫోన్‌తోనే కాలక్షేపం చేసే అమ్మాయిగా దివి మెరిసింది. ఈ సిరీస్‌కు సుదర్శన్‌ కామెడీ ప్రధాన బలం. అటు తల్లి, ఇటు కాబోయే అత్త పాత్రల్లో నిరోషా ఫర్వాలేదనిపించారు. కోదండంగా ప్రేమ్‌సాగర్‌, ఆయన దగ్గర పనిచేసే గురుమూర్తిగా వాసు ఇవుటూరి, గోపాళం తాతగా రామరాజ్‌, ఇడ్లీ అమ్మే వ్యాపారిగా అన్నపూర్ణ పరిధి మేరకు నటించారు. సన్నివేశానికి తగ్గట్టు నరేన్‌ అందించిన సంగీతం ఒకే అనిపిస్తుంది. లవ్‌స్టోరీని ప్రధానంగా తీసుకుని రచయిత తాను చెప్పాలనుకున్నది మిస్‌ అయ్యారేమో అనే భావన కలుగుతుంది. అరవింద్‌ విశ్వనాథ్‌ కెమెరా.. పల్లెటూరి అందాలను అక్కడక్కడా బాగా చూపించారు. టేకింగ్‌లో లక్ష్మీ సౌజన్య మార్క్‌ లోపించినట్టుంది. 

చివ‌రిగా: నీళ్లు లేని ఈ ట్యాంక్‌లో కామెడీ, ప్రేమ, నింపారు.

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని