Maayon review: రివ్యూ: మాయోన్‌

సిబి రాజ్‌ కీలక పాత్రలో నటించిన ‘మాయోన్‌’ఎలా ఉందంటే?

Updated : 07 Jul 2022 13:39 IST

చిత్రం: మాయోన్‌; నటీనటులు: సిబి రాజ్‌, తాన్య రవిచంద్రన్‌, రాధా రవి, కె.ఎస్‌.రవికుమార్‌ తదితరులు; సంగీతం: ఇళయరాజా; సినిమాటోగ్రఫీ: రామ్‌ ప్రసాద్‌; ఎడిటింగ్‌: రామ్‌ పాండియన్‌, కొండలరావు; నిర్మాత: అరుణ్‌ మోళిమాణికమ్‌; దర్శకత్వం: ఎన్‌.కిషోర్‌; విడుదల: 07-07-2022

ఇతర భాషల్లో విడుదలైన చిత్రాలు తెలుగు ప్రేక్షకుల ముందుకు రావటం కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళ చిత్రాలు తెలుగులో అనువాదమై ఇక్కడి ప్రేక్షకులను అలరించాయి. తాజాగా ఇలా వచ్చిన చిత్రమే ‘మాయోన్’. సత్యరాజ్‌ తనయుడు సిబి రాజ్‌ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించారు. ట్రైలర్‌, ప్రచార చిత్రాలతోనే ఈ సినిమాపై ఆసక్తి పెరిగింది. ఇంతకీ ఈ ‘మాయోన్‌’ కథ (Maayon review) ఏంటి? సిబి రాజ్‌ ఎలా నటించారు?

కథేంటంటే: అర్జున్‌ (సిబి రాజ్‌) ఆర్కియాలజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియాలో శాస్త్రవేత్త. పాదరసంలా చురుకైన వ్యక్తి. ప్రాచీన వస్తువులను కాపాడటం ఎంతో ముఖ్యమని, అది మన పూర్వుల సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబిస్తుందని తోటి ఉద్యోగులతో చెబుతుంటాడు. కానీ, అతడే ఆ విలువైన విగ్రహాలను విదేశాలకు అమ్మేస్తుంటాడు. అందుకోసం విగ్రహాల స్మగ్లింగ్‌ మాఫియా మధ్యవర్తిగా పనిచేస్తున్న సీనియర్‌ ఆర్కియాలజీ ఆఫీసర్‌ దేవరాజ్‌ (హరీశ్‌ పేరడి)తో చేతులు కలుపుతాడు. ఈ క్రమంలో 5 వేల ఏళ్ల నాటి చరిత్ర కలిగిన మాయోన్‌ ఆలయం, అందులోని నిధి గురించి వీరికి తెలుస్తుంది. దీంతో అర్జున్‌, దేవరాజ్‌ ఆ ఆలయానికి వెళ్లి నిధి వేట మొదలు పెడతారు. మరి వీళ్లకు ఆ నిధి రహస్యం ఎలా తెలిసింది? అందుకు ఎటువంటి ప్రయత్నాలు చేశారు? ఆ గుడిలో ఉన్న అంతు చిక్కని రహస్యం ఏంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

ఎలా ఉందంటే: నిధి వేట.. ఆలయంలో అంతు చిక్కని రహస్యం ఇలాంటి కథా వస్తువులు ప్రతి ప్రేక్షకుడిని అలరిస్తాయి. (Maayon review) అయితే, వాటిని ఎంత ఉత్కంఠగా చూపించామన్నదాని మీదే సినిమా విజయం ఆధారపడి ఉంటుంది. క్లైమాక్స్‌లో బలమైన పాయింట్‌ ఉన్నప్పుడే సినిమా చూసిన ప్రేక్షకుడు తృప్తి చెందుతాడు. ‘ఇంతేనా’ అనిపిస్తే పెదవి విరుస్తాడు. అలాంటి కథతో వచ్చిన తమిళ చిత్రమే ‘మాయోన్‌’. ప్లాట్‌ పాయింట్‌ ఏంటో ప్రచార చిత్రాలతోనే చూపించింది చిత్ర బృందం. అందుకు తగినట్లు సినిమాను తెరకెక్కించడంలో దర్శకుడు ఎన్‌.కిషోర్‌ తనవంతు ప్రయత్నం చేశాడు. పాత్రలన్నింటినీ నెగెటివ్‌ షేడ్స్‌తో ప్రారంభించి, ప్రతి పాత్రపైనా ప్రేక్షకుడిలో అనుమానం కలిగించేలా కథను ప్రారంభించాడు. కథను నెమ్మదిగా ప్రారంభించడంతో.. దర్శకుడు అసలు పాయింట్‌కు రావడానికి కాస్త సమయమే పట్టింది. ఆలయానికి సంబంధించిన వివరాలను తెలుసుకోవడంతోనే ప్రథమార్ధమంతా సాగుతుంది. అసలు కథ ద్వితీయార్ధంలో మొదలవుతుంది. అక్కడి నుంచి, కథా, కథనాలు పరుగులు పెడతాయి. ప్రతి సన్నివేశం ఉత్కంఠ కలిగిస్తుంది. ఒకవైపు దేవుడు, మరోవైపు సైన్స్‌ రెండింటినీ బ్యాలెన్స్‌ చేసుకుంటూ సన్నివేశాలను తీర్చిదిద్దారు. అయితే, ఏ పాత్ర కథపై బలమైన ముద్రవేయలేకపోయింది. (Maayon review) పతాక సన్నివేశాలు రొటీన్‌గా ఉన్నాయి. విజువల్స్‌ ఎఫెక్ట్స్‌ పరంగా పెద్దగా నాణ్యత లేదు. బహుశా ఓటీటీని దృష్టిలో పెట్టుకుని సన్నివేశాలను చుట్టేశారేమో. చాలా చోట్ల ‘కార్తికేయ’, ‘సుబ్రహ్మణ్యపురం’ చిత్రాలను తలపిస్తుంది.

ఎవరెలా చేశారంటే: అర్జున్‌ పాత్రలో సిబి రాజ్‌ ఒదిగిపోయి నటించారు. చివరి వరకూ ఆయన పాత్రలో ప్రతినాయక లక్షణాలు కనిపిస్తాయి. పురావస్తు శాస్త్రవేత్తగా, నిధి రహస్యాన్ని కనిపెట్టే వ్యక్తిగా ఆయన స్టైల్‌, మేకోవర్‌ బాగుంది. కథానాయిక తాన్య రవిచంద్రన్‌కు పెద్దగా ప్రాధాన్యం ఏమీ లేదు. హీరోయిన్‌ ఉండాలి కాబట్టి, ఆమెను తీసుకున్నారంతే. హరీశ్‌ పేరడి, కె.ఎస్‌.రవికుమార్‌, రాధా రవి, భగవతి పెరుమాళ్‌ ఇలా ఎవరూ తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలిసిన నటులు కాదు. ఇళయరాజా నేపథ్య సంగీతం సన్నివేశాలను ఎలివేట్‌ చేసింది. పాటలకు పెద్దగా స్కోప్‌లేదు. రామ్‌పాండియన్‌ ఎడిటింగ్‌ బాగుంది. సినిమా నిడివి కూడా తక్కువే. సినిమాటోగ్రాఫర్‌ రామ్‌ప్రసాద్‌ ప్రతి సన్నివేశాన్ని ఆసక్తిగా చూపించారు. ఆలయంలో లైట్‌ఎఫ్టెక్‌లు ఉత్కంఠ కలిగిస్తాయి. దర్శకుడు ఎన్‌.కిషోర్‌ ఎంచుకున్న పాయింట్‌ కొత్తదేమీ కాదు. కానీ, స్క్రీన్‌ప్లేను ఆసక్తిగా నడిపించటంలో కాస్త సక్సెస్‌ అయ్యారు. అయితే, సినిమా మొత్తం ఒకే పాయింట్‌ చుట్టూ తిరగడం ఆసక్తిగా అనిపించదు. అడ్వెంచర్‌ మూవీలను ఇష్టపడేవారికి ‘మాయోన్‌’ బాగానే నచ్చుతుంది.(Maayon review) కాలక్షేపం కోసం సినిమా చూడాలనుకున్నా పర్వాలేదు.

బలాలు

+ ద్వితీయార్ధం

+ ఉత్కంఠ కలిగించే సన్నివేశాలు

బలహీనతలు

- రొటీన్‌ పాయింట్‌

- ప్రథమార్ధం కొన్ని సన్నివేశాలు

చివరిగా: కాలక్షేపం కోసం అడ్వెంచర్‌ ‘మాయోన్‌’

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని