Nithiin: అభిమానుల కోసం మరో 20 ఏళ్లైనా కష్టపడతా: నితిన్‌

అభిమానులను అలరించేందుకు ఎంతైనా కష్టపడతానన్నారు నటుడు నితిన్‌. ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఆయన మాట్లాడారు. ఈయన హీరోగా నూతన దర్శకుడు ఎం. ఎస్‌. రాజశేఖర్‌ రెడ్డి తెరకెక్కించిన చిత్రమిది.

Published : 07 Aug 2022 22:42 IST

హైదరాబాద్‌: అభిమానులను అలరించేందుకు ఎంతైనా కష్టపడతానన్నారు నటుడు నితిన్‌ (Nithiin). ‘మాచర్ల నియోజకవర్గం’ (Macherla Niyojakavargam) సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఆయన మాట్లాడారు. నితిన్‌ హీరోగా నూతన దర్శకుడు ఎం. ఎస్‌. రాజశేఖర్‌ రెడ్డి తెరకెక్కించిన చిత్రమిది. కృతిశెట్టి, కేథరిన్‌ కథానాయికలుగా నటించిన ఈ సినిమా ఆగస్టు 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ఈవెంట్‌ నిర్వహించింది. దర్శకులు సురేందర్‌ రెడ్డి, మెహర్‌ రమేశ్‌, హను రాఘవపూడి, మేర్లపాక గాంధీ, వక్కంతం వంశీ తదితరులు అతిథులుగా హాజరయ్యారు.

వేడుకనుద్దేశించి నితిన్‌ మాట్లాడుతూ.. ‘‘అభిమానులూ.. మీ సపోర్ట్‌ లేకపోతే నేనిప్పుడు ఇక్కడ ఇలా ఉండేవాణ్ణి కాదు. 20 ఏళ్ల నుంచి నన్ను ఆదరిస్తున్నారు. మరో 20 ఏళ్లు అయినా మిమ్మల్ని అలరించేందుకు కష్టపడుతూనే ఉంటా. మాచర్ల నియోజకవర్గం.. నా హృదయానికి దగ్గరైన సినిమా. కృతిశెట్టి చూడటానికి అమాయకంగా కనిపిస్తుందిగానీ ఆమె చాలా తెలివైంది. కథకి సంబంధించి లాజిక్స్‌, సందేహాలు అడుగుతూ తన పాత్రను ఇంకెంత బాగా చేయాలో తెలుసుకుంటుంది. ఈ లక్షణం చాలా తక్కువ మంది నటుల్లో ఉంటుంది. దర్శకుడు శేఖర్‌ నా స్నేహితుడు. తనకి ఇది తొలి చిత్రమే అయినా అనుభవం ఉన్న దర్శకుడిగా తెరకెక్కించాడు. మహతి స్వర సాగర్‌ తన నేపథ్య సంగీతంతో సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లాడు. కేథరిన్‌, సముద్ర ఖని, వెన్నెల కిశోర్‌ తదితరులు అద్భుతంగా నటించారు’’ అని నితిన్‌ తెలిపారు.

‘‘నేనీ స్థాయికి చేరుకోవడానికి 15 ఏళ్లు పట్టింది. నేను ఇంటర్‌ చదివేటపుడు మా నాన్న చనిపోయారు. అప్పటి నుంచీ నాకు సపోర్ట్‌గా నిలిచిన మా బాబాయ్‌లకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకునేందుకు సహాయపడిన శ్రీను మావయ్యకి, నేను ఎడిటర్‌గా మారేందుకు ప్రోత్సాహం అందించిన దినేశ్‌ అన్నకు థాంక్స్‌. ఓ సాంకేతిక నిపుణుడిగా ఇండస్ట్రీలో నాకు గుర్తింపు తీసుకొచ్చిన నా గురువు పూరి జగన్నాథ్‌కి బిగ్‌ థాంక్స్‌. ఎడిటర్‌ నుంచి నన్ను డైరెక్టర్‌గా మార్చిన నితిన్‌కి కృతజ్ఞతలు. ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండే వ్యక్తి నితిన్‌. మాచర్ల నియోజకవర్గంపై మాకు నమ్మకం ఉంది’’ అని దర్శకుడు రాజశేఖర్‌ రెడ్డి అన్నారు.






Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని