Published : 28 Jun 2022 22:15 IST

Rocketry: ఆ ఉద్దేశంతోనే ‘రాకెట్రీ’ తీశా.. వారంతా భారత్‌కు తిరిగిరావాలి: మాధవన్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: స్వీయ దర్శకత్వంలో మాధవన్‌ (Madhavan) నటించిన చిత్రం ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్‌’ (Rocketry). 1994లో అన్యాయంగా జైలుపాలైన ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్‌ జీవితం ఆధారంగా తెరకెక్కింది. ఈ పాన్‌ ఇండియా చిత్రం జులై 1న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే మాధవన్‌ మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..

ఆ ఆలోచనతోనే..

‘‘నేను గతంలో నటించిన ‘విక్రమ్‌ వేద’ సినిమా సమయంలో ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్‌కు సంబంధించిన వార్తలు చదివా. ఆయనకు మాల్దీవులకు చెందిన అమ్మాయితో సంబంధం ఉందని, మన దేశ రాకెట్‌ సాంకేతికతను ఆయన రహస్యంగా పాకిస్థాన్‌కు చేరవేస్తున్నారని, ఆ నేరారోపణలతో ఆయన్ను అరెస్టు చేసి చిత్ర హింసలు పెట్టారని, సీబీఐ చేపట్టిన దర్యాప్తులో ఆయన నిరపరాధిగా రుజువయ్యారనే అనేది ఆ వార్తల సారాంశం. ఈ ఘటనల ఆధారంగా సినిమా తీస్తే ఎలా ఉంటుందోనన్న ఆలోచన మొదలైంది’’

నారాయణన్‌ బాధ అర్థమైంది..

‘‘ఆ ఆసక్తితోనే.. సుమారు ఐదేళ్ల క్రితం నంబి నారాయణన్‌ సర్‌ను త్రివేండ్రంలో కలిశా. చాలా మర్యాదగా తమ ఇంట్లోకి నన్ను ఆహ్వానించారు. అప్పుడు ఆయ‌న బోనులో ఉన్న సింహంలా అనిపించారు. ఆయన పవర్‌ఫుల్‌ క‌ళ్లు నన్ను ఆకర్షించాయి. ‘హాయ్.. మాధవన్, నేను మీకు పెద్ద అభిమానిని. మీ సినిమాలు చూస్తుంటా’ అని నారాయణన్‌ అనగానే నాకు ఏదో తెలియని ఆనందం. సరదాగా ఉందనకున్న వాతావరణం కాస్తా తన గతం గురించి తెలుసుకునే ప్రయత్నం చేయగానే వేడెక్కింది. ‘నన్ను దేశ ద్రోహి అని ఎలా అంటారు?’ అంటూ ఆయన చాలా కోపంగా మాట్లాడారు. మీరు నిర్దోషి అని నిరూపితమైంది కదా అని నేనంటే ‘అది నాకూ నీకూ కోర్టుకు మాత్రమే తెలుసు. అంతెందుకు గూగుల్‌లో వెతికినా నా గురించి గూఢచారి అనే సమాధానమే దొరుకుతుంది’ అని ఆవేదనకు గురయ్యారు. ఆయనెంత బాధ పడుతున్నారో ఆ క్షణం నాకు అర్థమైంది’

జేమ్స్‌బాండ్‌లా..

‘‘తన విద్యాభ్యాసం గురించి వివరిస్తూ.. ప్రిన్స్‌టెన్‌ యూనివర్శిటీలో చ‌దువుకున్నాన‌ని, రీసెర్చ్‌ కోసం అక్కడివారంతా ఐదారేళ్ల సమయం తీసుకుంటే తాను ప‌ది నెల‌ల్లోనే పూర్తి చేశార‌ని వివరించారు. ఇస్రో, నాసాలకు సంబంధించిన విష‌యాలు పంచుకున్నారు. ఆయన చేసిన సాహసాల గురించి వినగానే ‘జేమ్స్ బాండ్’ బాబులా అనిపించారు. నంబి నారాయణన్‌ ఓ రాక్ స్టార్‌. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం ఆయనది’’

తప్పకుండా తెలుసుకోవాలి..

‘‘ప్ర‌పంచంలో ఏ సైంటిస్ట్ ఎదుర్కోని ప‌రిస్థితుల‌ను నంబి నారాయ‌ణ‌న్ ఎదుర్కొన్నారు. ఆయ‌న గురించి మ‌నమంతా తెలుసుకోవాల్సిన అవ‌స‌రం తప్పక ఉంది. స్వాతంత్ర్య పోరాట యోధులు, ఇతిహాసాలపై తరచూ సినిమాలు వస్తూనే ఉంటాయి. సైన్స్‌, టెక్నాల‌జీ రంగాల మేధావుల గురించి ఈ ప్ర‌పంచానికి తెలియజేయాల‌నే ఉద్దేశంతోనే ‘రాకెట్రీ’ని తెరకెక్కించా. ఎన్నో ప్రముఖ విదేశీ సంస్థలకు సీఈవోలుగా భారత ఇంజినీర్స్‌ బాధ్యతలు వహిస్తున్నారు. అలాంటి వారంతా ఇండియాకు తిరిగి రావాలి’’

మా కష్టమిదీ..!

‘‘ఈ సినిమాను తెరకెక్కించేందుకు ఆరేళ్ల సమయం పట్టింది. రాకెట్స్‌, అంతరిక్షం గురించి చాలా సినిమాల్లో చూసుంటారు. మేమిందులో రాకెట్‌ ఇంజిన్‌ వ్యవస్థ గురించి చూపించబోతున్నాం. నంబి నారాయణన్‌ లుక్‌ను తలపించేందుకు బరువు పెరిగా, కొన్ని సన్నివేశాల కోసం బరువు తగ్గా. ఆయనలా కనిపించేందుకు నా దంతాల అమరిక మార్చా. ప్రాస్థటిక్‌ మేకప్‌ ఉపయోగించలేదు. ‘బాహుబ‌లి’ని రూపొందించేందుకు ఆ చిత్ర బృందం ఎంత క‌ష్ట‌ప‌డిందో మా టీమ్ కూడా అంతే క‌ష్ట‌ప‌డింది’’ మాధవన్‌ అని వివరించారు.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని