Madhubala: తెలుగులో ఉండే సౌలభ్యం అదే: మధుబాల

త్వరలో విడుదలకాబోతున్న ‘ప్రేమదేశం’ మూవీలో తాను చక్కని తల్లి పాత్ర పోషించినట్లు మధుబాల తెలిపారు. ఈ సందర్భంగా సినిమాతో పాటు, తన కెరీర్‌ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

Published : 23 Nov 2022 01:04 IST

త్రిగుణ్‌, మేఘా ఆకాష్ హీరో హీరోయిన్లుగా శ్రీకాంత్ సిద్ధం దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ప్రేమ దేశం’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబరు 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన మధుబాల అనేక విషయాలను పంచుకున్నారు.

‘‘నేను ఇది వరకు చాలా వరకు తల్లి పాత్రలు పోషించాను. కానీ, ఈ చిత్రంలో తల్లీకొడుకుల రిలేషన్ చాలా చక్కగా చూపించారు. ‘ప్రేమదేశం’ అనే టైటిల్ నాకు చాలా నచ్చింది. ఈ సినిమాలోని మ్యూజిక్ కూడా అద్భుతంగా ఉంటుంది. ఇండస్ట్రీలో ఎప్పుడూ పోటీతత్వం ఉంటుంది. మనకు ఏ పాత్ర రాసి ఉంటే.. ఆ పాత్రలు వస్తాయి’’

‘‘సుహాసిని, చారుహాసన్ ఇలా అందరూ కలిసి ఓ వెబ్ సిరీస్ చేశారు. అలా మాకు కూడా ఫ్యామిలీ అంతా కలిసి నటించాలని ఉంది. కానీ సరైన కథ దొరకాలి. అయితే ఆ ప్రాజెక్ట్‌ను మాత్రం మేం నిర్మించం. కేవలం నటించాలని మాత్రమే ఉంది. పెద్ద సినిమాలు, నెగెటివ్ రోల్స్ చేయాలని అనుకుంటున్నాను. అయితే, నేను బయట చాలా ఫన్నీగా ఉంటాను. తమిళ్‌లో నేను ‘స్వీట్ కార్న్ కాఫీ’ అనే వెబ్ సిరీస్‌లో ఫుల్ కామెడీ రోల్ చేశా. ఆ వెబ్ సిరీస్ చూశాక.. అందరూ నా కామెడీ టైమింగ్ బాగుందని అన్నారు’’

‘‘త్రిగుణ్ నాకు అదిత్‌లానే తెలుసు. ఈ సినిమాలో ఎంతో సహజంగా నటించాడు. మేఘా అయితే స్వీట్, యాక్టివ్ పర్సన్. తెలుగు, హిందీల్లో చాలా దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది. తమిళ్, మిగతా భాషల్లో కాస్త డిఫరెంట్ అనిపిస్తుంది. తెలుగులో అయితే దర్శకులతో చర్చించే అవకాశం ఉంటుంది. తెలుగు భాష నాకు అంతగా తెలియకపోయినా మిగతా భాషల్లో నటించిన దానికంటే బాగా నటించానని అనిపిస్తుంది. నేను ‘దేవాజు’ అనే ద్విభాష చిత్రంలో నటిస్తున్నాను. తమిళ్ దేజావులో కంటే తెలుగు దేజావులోనే చక్కగా చేసినట్టు అనిపిస్తుంది’’

‘‘నా కెరీర్ ప్రారంభంలో ఈ భాషలోనే చేయాలి.. ఆ భాషలోనే చేయాలని అనుకోలేదు. అన్ని భాషల్లో సినిమాలు చేశా. ఈ మధ్యే నేను ఒక తెలుగు సినిమాను పూర్తి చేశాను. ‘గేమ్ ఆన్’ అనే చిత్రం అద్భుతమైన కథతో రాబోతోంది. నా వద్దకు వచ్చిన వాటిల్లో నచ్చిన కథలను మాత్రమే ఎంచుకుంటాను. నెగెటివ్ రోల్ అయినా, కామెడీ రోల్ అయినా నేను చేసేందుకు రెడీగా ఉన్నా. ప్రస్తుతం హిందీలో ‘కర్తమ్ హుక్తమ్’ సోనమ్ షాతో కలిసి చేస్తున్నా. మరో సినిమా షూటింగ్ దశలో ఉంది. జీ5లో ఓ వెబ్ సిరీస్ చేస్తున్నాను. వివేక్ శర్మ దర్శకత్వంలో మరో సినిమాను చేస్తున్నాను. ఈ మధ్యే కలిబలి అనే సినిమా వచ్చింది’’


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని