Indian 2: సమస్య మీరే పరిష్కరించుకోండి!

సినీ దర్శకుడు శంకర్‌ ‘ఇండియన్‌ 2’ చిత్రం పూర్తి చేయకుండా ఇతర సినిమాలకు దర్శకత్వం వహించకుండా నిషేధించాలని మద్రాసు హైకోర్టులో లైకా ప్రొడక్షన్స్ పిటిషన్‌ వేసింది.

Published : 23 Apr 2021 19:06 IST

ఇంటర్నెట్‌ డెస్క్: సినీ దర్శకుడు శంకర్‌ ‘ఇండియన్‌ 2’ చిత్రం పూర్తి చేయకుండా ఇతర సినిమాలకు దర్శకత్వం వహించకుండా నిషేధించాలని మద్రాసు హైకోర్టులో లైకా ప్రొడక్షన్స్ పిటిషన్‌ వేసింది. ఈ సందర్భంగా ఇరువురి వాదనలు విన్న కోర్టు ‘సమస్యను  మీరే పరిష్కరించుకోండి’ అని సూచిస్తూ, తదుపరి విచారణను ఏప్రిల్‌ 28కి వాయిదా వేసింది. శంకర్‌ దర్శకత్వంలో కమల్‌హాసన్‌ హీరోగా ‘ఇండియన్‌’ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్‌ నిర్మించింది. దీనికి సీక్వెల్‌గా ‘ఇండియన్‌ 2’ ప్రారంభమైంది. అయితే షూటింగ్‌లో అనుకోకుండా జరిగిన ప్రమాదంలో ముగ్గురు మరణించారు. ఆ తర్వాత కరోనా వైరస్, లాక్‌డౌన్‌ వంటి కారణాలతో చిత్రీకరణ మధ్యలోనే ఆగిపోయింది.

ఈ నేపథ్యంలో దర్శకుడు శంకర్‌ తెలుగులో రామ్‌చరణ్‌ హీరోగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ఓ సినిమా చేయడానికి అంగీకారం తెలిపారు. ఇక హిందీలోనూ రణ్‌వీర్‌ సింగ్‌తో కలిసి ‘అపరిచితుడు’ చిత్రాన్ని రీమేక్‌  చేయనున్నారు. అయితే ఈ విషయాలపై ‘ఇండియన్‌ 2’ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ తమ సినిమా పూర్తి చేసిన తర్వాతే ఇతర చిత్రాలు పూర్తి చేయాలని కోరింది. దర్శకుడు శంకర్‌ ఈ విషయంపై స్పందిస్తూ..‘‘నేను ఈ సినిమాని వదిలేయడం లేదు. చిత్రీకరణ చేస్తా. ఈ మధ్యే గుండెపోటుతో మరణించిన నటుడు వివేక్‌పై తీసిన సన్నివేశాలను తిరిగి చిత్రీకరిస్తా’’ అని తెలిపారు. ‘ఇండియన్ 2’ చిత్రీకరణ ఇప్పటికే 80 శాతం వరకు పూర్తి చేశారట. చిత్రంలో కాజల్ అగర్వాల్, సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, బాబీ సింహా, ప్రియా భవానీ శంకర్, నేదుముడి వేణు, గణేష్ తదితరులు నటిస్తున్నారు. అనిరుధ్‌ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని